రూ.600 పెరిగిన పసిడి

11 Jun, 2020 10:37 IST|Sakshi

ఆర్థిక వృద్ది ఆందోళనలతో పసిడికి డిమాం‍డ్‌ 

అంతర్జాతీయ మార్కెట్లో వారం గరిష్టానికి...

దేశీయ ఎంసీఎక్స్‌ మార్కెట్లో గురువారం ఉదయం సెషన్‌లో పసిడి ఫ్యూచర్స్ ధర రూ.600 లాభపడింది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర వారం గరిష్టానికి చేరుకోవడంతో దేశీయ పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ పెరిగినట్లు బులియన్‌ పండితులు చెబుతున్నారు. నేడు ఎంసీఎక్స్‌లో ఆగస్ట్‌ కాంట్రాక్టు 10గ్రాముల పసిడి ధర రూ. 46,750 వద్ద మొదలైంది. మార్కెట్‌ ప్రారంభం నుంచే పసిడి ఫ్యూచర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఒక దశలో రూ.608లు లాభపడి రూ.47,234 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఉదయం 10గంటలకు నిన్నటి ముగింపు(రూ.46626)తో పోలిస్తే రూ.559లు పెరిగి రూ.47185 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఫెడ్‌ వడ్డీరేట్ల ప్రకటన కోసం ఎదురుచూపుల నేపథ్యంలో నిన్నరాత్రి ఎంసీఎక్స్‌ మార్కెట్‌లో పసిడి ఫ్యూచర్స్‌ ధర రూ.32 స్వల్ప నష్టంతో రూ. 46626 వద్ద ముగిసింది. 

అంతర్జాతీయంగా వారం గరిష్టానికి:
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ఫ్యూచర్ల ధర వారం గరిష్టాన్ని అందుకుంది. అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ నిన్నరాత్రి కీలకమైన వడ్డీరేట్ల రేట్లపై తన వైఖరి ప్రకటించింది. కోవిద్‌-19 వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో వడ్డీరేట్లను యథాతథంగా సున్నా స్థాయిలోనే ఉంచుతున్నట్లు ఫెడ్‌ ఛైర్మన్‌ పావెల్‌ తెలిపారు. ఈ సందర్భంగా పావెల్‌ ఆర్థిక వృద్ధి, రికవరీ పై ఆందోళన వ్యక్తం చేశారు. పావెల్‌ నిరాశజనకమైన వాఖ్యలతో ఇన్వెసర్లు తమ పెట్టుబడులను రక్షణాత్మక సాధనమైన పసిడి ఫ్యూచర్లలోకి మళ్లించారు. ఫలితంగా ఆసియాలో నేటి ఉదయం ఔన్స్‌ పసిడి ఫ్యూచర్స్‌ ధర 30డాలర్లు లాభపడి 1,749.70డాలర్లను అందుకుంది. ఈ ధర పసిడికి వారం రోజుల గరిష్టస్థాయి కావడం విశేషం.

మరిన్ని వార్తలు