పిల్లల చదువు కోసం ఎక్కడ ఇన్వెస్ట్‌ చేస్తే మంచిది!

20 Nov, 2023 07:22 IST|Sakshi

నేను సావరీన్‌ గోల్డ్‌ బాండ్లలో (ఎస్‌జీబీలు) ఇన్వెస్ట్‌ చేశాను. కాల వ్యవధి ముగిసిన తర్వాత వీటిని విక్రయించాలా..? లేక ఆ మొత్తం నా ఖాతాలో జమ అవుతుందా? – వేదవ్యాస్‌ విశ్వరూప్‌ 

ఎస్‌జీబీల కాల వ్యవధి ఎనిమిదేళ్లు. గడువు ముగియడానికి నెలరోజుల ముందు బాండ్ల మెచ్యూరిటీ తేదీ గురించి ఇన్వెస్టర్లకు సమాచారం వస్తుంది. గడువు ముగిసిన తర్వాత ఆ మొత్తం బ్యాంక్‌ ఖాతాలో జమ అవుతుంది. ఇన్వెస్టర్‌ పెట్టుబడి పెట్టే రోజున ఇచ్చిన బ్యాంక్‌ ఖాతాలో జమ చేస్తారు. గడువు ముగిసిన రోజు నాటి ముందు మూడు రోజుల బంగారం సగటు ధరను పరిగణనలోకి తీసుకుంటారు. ఇండియా బులియన్‌ అండ్‌ జ్యుయెలర్స్‌ అసోసియేషన్‌ ప్రకటించే 999 స్వచ్ఛత బంగారం ధరలను ఇందుకు ప్రామాణికంగా పరిగణిస్తారు. ఆ ప్రకారం ఇన్వెస్టర్‌కు చెల్లింపులు చేస్తారు. ఎస్‌జీబీ సర్టిఫికెట్‌లోనూ బ్యాంక్‌ ఖాతా వివరాలు నమోదై ఉంటాయి.

ఒకవేళ సార్వభౌమ బంగారం బాండ్లను ట్రేడింగ్‌ ఖాతా ద్వారా సెకండరీ మార్కెట్‌ నుంచి కొనుగోలు చేస్తే అవి డీమ్యాట్‌ ఖాతాలో ఉంటాయి. కనుక మెచ్యూరిటీ ముగిసిన అనంతరం డీమ్యాట్‌ ఖాతాకు అనుసంధానమైన ఇన్వెస్టర్‌ బ్యాంక్‌ ఖాతాకు ఆ మొత్తం జమ అవుతుంది. స్టాక్‌ మార్కెట్లో ఎస్‌జీబీల ట్రేడింగ్‌ ధర హెచ్చు, తగ్గులుగా ఉండొచ్చు. అయినప్పటికీ గడువు తీరే నాటి ముందు మూడు పనిదినాల సగటు ధర ప్రకారమే చెల్లింపులు చేస్తారు. బంగారంలో పెట్టుబడులకు ఎంతో సౌకర్యవంతమైన మార్గం ఎస్‌జీబీలు అని తప్పక చెప్పాలి. పెట్టుబడిపై ఏటా 2.5 శాతం వడ్డీ ఇందులో లభిస్తుంది. ఎనిమిదేళ్ల పాటు పెట్టుబడిని కొనసాగిస్తే వచ్చే లాభంపై ఎలాంటి పన్ను లేదు.  

పిల్లల ఉన్నత విద్య కోసం ఏకమొత్తంలో ఇన్వెస్ట్‌ చేయాలని అనుకుంటున్నాను. ఇందుకు అనుకూల సాధనాలు ఏవి? – శరవణన్‌ 
పిల్లల భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్‌ చేయాలని చాలా మంది తల్లిదండ్రులు భావిస్తారు. ఇందుకోసం పలు మార్గాలు ఉన్నాయి. సాధారణంగా ఈ మొత్తాన్ని పిల్లల ఉన్నత విద్య కోసం ఇన్వెస్ట్‌ చేయాలని అనుకుంటే అందుకు, పదేళ్లకు పైగా కాల వ్యవధి ఉంటుంది. అటువంటప్పుడు ఈక్విటీలకు మించి మెరుగైన సాధనం లేదనే చెప్పాలి. అందులోనూ ఫ్లెక్సీక్యాప్‌ విభాగం అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఫ్లెక్సీక్యాప్‌ పథకాలు పెట్టుబడులను డైవర్సిఫై చేస్తాయి. అన్ని రంగాల పరిధిలో, భిన్న మార్కెట్‌ క్యాప్‌ కలిగిన (డైవర్సిఫైడ్‌) కంపెనీల్లో ఫండ్‌ మేనేజర్‌ పెట్టుబడులు పెడతారు.

ఒకవేళ పన్ను ప్రయోజనం కోరుకుంటే ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ (ఈఎల్‌ఎస్‌ఎస్‌)ను ఎంపిక చేసుకోవచ్చు. ఇవి కూడా ఫ్లెక్సీక్యాప్‌ మాదిరే పనిచేస్తుంటాయి. అన్ని రంగాలకు చెందిన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా రిస్క్‌ తగ్గించే విధంగా ఈఎల్‌ఎస్‌ఎస్‌ పథకాల పనితీరు ఉంటుంది. ఈ పథకాల్లో ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా సెక్షన్‌ 80సీ కింద పన్ను ప్రయోజనం పొందొచ్చు. ఫ్లెక్సీక్యాప్‌ ఫండ్స్‌ ఐదేళ్ల కాలంలో సగటున 12 శాతానికి పైనే వార్షిక రాబడులు ఇచ్చాయి. ఈ రాబడి రేటు ప్రకారం ఎవరైనా రూ.లక్షను పదేళ్ల కాలానికి ఇన్వెస్ట్‌ చేస్తే.. రూ.3.14 లక్షలు సమకూరుతుంది. ఈక్విటీలు సహజంగానే అస్థిరలతో ఉంటాయి. కనుక ఫ్లెక్సీక్యాప్‌ పథకాల్లోనూ ఇదే కనిపిస్తుంది. అందుకనే ఈక్విటీల్లో ఏక మొత్తంలో ఇన్వెస్ట్‌ చేయడం కాకుండా, తమ దగ్గరున్న పెట్టుబడులను కొన్ని విడతలుగా ఇన్వెస్ట్‌ చేసుకోవాలి.

దీనివల్ల కొనుగోలు ధర సగటుగా మారి, మార్కెట్లు గరిష్టాల వద్ద ఉన్నప్పుడు రిస్క్‌ను తగ్గిస్తుంది. కనుక మీరు పెట్టుబడి మొత్తాన్ని ఒకే సారి కాకుండా.. డెట్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసి.. అక్కడి నుంచి ప్రతి నెలా సిప్‌ రూపంలో మూడేళ్ల కాలంలో పెట్టుబడులు పెట్టుకోవడం అన్నది తగిన విధంగా ఉంటుంది. దీనివల్ల మార్కెట్ల ర్యాలీ, కరెక్షన్లలోనూ ఇన్వెస్ట్‌ చేసినట్టు అవుతుంది. 

మరిన్ని వార్తలు