ఈ వారం స్టాక్‌ మార్కెట్‌ ఎలా ఉండబోతుంది

20 Nov, 2023 07:33 IST|Sakshi

ముంబై: స్టాక్‌ మార్కెట్లో ఈ వారం కూడా సానుకూల సెంటిమెంట్‌ కొనసాగొచ్చని మార్కెట్‌ నిపుణులు భావిస్తున్నారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు దిగిరావడం, అమెరికా బాండ్లపై రాబడులు తగ్గుముఖం పట్టడం తదితర అంశాలు కలిసిరావొచ్చంటున్నారు.

ఫెడ్‌ రిజర్వ్‌ మినిట్స్, స్థూల ఆర్థిక గణాంకాలు, ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల తీరుతెన్నులు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళీ ఈ వారం ట్రేడింగ్‌ను ప్రభావితం చేయోచ్చంటున్నారు. అలాగే ఈ వారంలో ఐదు కంపెనీలు ఐపీఓల ద్వారా నిధుల సమీకరణకు సిద్ధమైన తరుణంలో మార్కెట్‌ వర్గాలు పబ్లిక్‌ ఇష్యూలపై కన్నేయోచ్చంటున్నారు. వీటితో పాటు సాధారణ అంశాలైన క్రూడాయిల్‌ ధరలు, రూపాయి కదలికలపైనా దృష్టి సారించవచ్చంటున్నారు. 

‘‘అమెరికా బాండ్ల ఈల్డ్స్, డాలర్‌ ఇండెక్స్, క్రూడాయిల్‌ ధరలతో పాటు సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడుల అంశాలు కీలకం కానున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడేంత వరకు మార్కెట్‌ స్థిరంగా ట్రేడొచ్చు. తదుపరి మార్కెట్లపై గమనంపై ఓ అంచనాకు రావొచ్చు. నిఫ్టీ 19,850 స్థాయిని చేధించే వరకు స్థిరీకరణ దశలోనే ట్రేడవుతుంది. వచ్చే వారంలో నిఫ్టీ 19,700 – 19,900 పాయింట్ల పరిధిలో ట్రేడొచ్చని ఆప్షన్‌ డేటా సూచిస్తుంది’’ అని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్‌ సాంకేతిక నిపుణుడు సంతోష్‌ మీనా తెలిపారు. 

ద్రవ్యోల్బణ దిగిరావడంతో వడ్డీ రేట్ల పెంపు ప్రక్రియ ఆగొచ్చనే అంచనాలతో పాటు క్రూడాయిల్‌ ధరలు దిగిరావడంతో గతవారం సూచీలు ఒకశాతం మేర లాభపడ్డాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో సానుకూలతలు, సంస్థాగత ఇన్వెస్టర్ల కొనుగోళ్ల మద్దతు అంశాలు కలిసొచ్చాయి. సెన్సెక్స్‌ 890 పాయింట్లు, నిఫ్టీ 307 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి.  

మంగళవారం ఫెడ్‌ రిజర్వ్‌ సమావేశ వివరాలు  
అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ నవంబర్‌ 1న నిర్వహించిన ద్రవ్య పాలసీ సమావేశ వివరాలు(ఫెడ్‌ మినిట్స్‌) మంగవారం విడుదల కానున్నాయి. ద్రవ్యోల్బణం తగ్గుదలతో ఫెడ్‌ రిజర్వ్‌ ప్రస్తుత వడ్డీ రేట్ల శ్రేణి 5.25–5.50% వద్ద నిలిపివేసే సాధ్యాసాధ్యాలను ఇన్వెస్టర్లతో పాటు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అలాగే కమిటీ అంతర్గత నిర్ణయాలు, అవుట్‌లుక్‌ వివరాలపై మార్కెట్‌ వర్గాలు దృష్టి సారింవచ్చు. 

స్థూల ఆర్థిక గణాంకాలు 
అమెరికా మంగళవారం అక్టోబర్‌ రిటైల్, గృహ అమ్మకాలు, నిరుద్యోగ డేటా బుధవారం వెల్లడి కానున్నాయి. జర్మనీ, ఫ్రాన్స్, యూరోజోన్, యూకే, అమెరికా దేశాల నవంబర్‌ తయారీ పీఎంఐ డేటా బుధవారం విడుదల కానున్నాయి. ఆయా దేశాల కీలక డేటా ప్రకటనకు ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించనున్నారు.

మారుతున్న ఎఫ్‌ఐఐల వైఖరి  
గడిచిన రెండు నెలల్లో నికర అమ్మకందారులుగా నిలిచిన విదేశీ ఇన్వెస్టర్ల వైఖరి మారింది. దేశీయ స్టాక్‌ మార్కెట్లో ఈ నవంబర్‌లో రూ.1,433 కోట్ల విలువైన ఈక్విటీలు కొనుగోలు చేశారు. అమెరికా బాండ్లపై రాబడులు, క్రూడాయిల్‌ ధరలు తగ్గుముఖం పట్టడం ఇందుకు ప్రధాన కారణం. ‘‘భారత్‌లో పండుగ సీజన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో ఎఫ్‌ఐఐలు పెట్టుబడులు పెట్టేందుకు మరింత ఆసక్తి కనబరచవచ్చు. ఇటీవల మార్కెట్‌ దిద్దుబాటుతో దిగివచ్చిన షేర్లను కొనేందుకు వారు ఆసక్తి చూపవచ్చు’’ అని మార్నింగ్‌స్టార్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్‌ ఇండియా హిమాన్షు శ్రీవాస్తవ తెలిపారు.

ఈ నెల 22–24 మధ్య రాకింగ్‌డీల్స్‌ ఐపీవో
కన్జూమర్‌ రిటైల్‌ విభాగంలో బీటూబీ సోర్సింగ్‌ ప్లాట్‌ఫామ్‌గా సేవలందించే రాకింగ్‌డీల్స్‌ సర్క్యులర్‌ ఎకానమీ లిమిటెడ్‌ ఈ నెల 22న పబ్లిక్‌ ఇష్యూకి వస్తోంది. 24న ముగియనున్న ఇష్యూకి ధరల శ్రేణి షేరుకి రూ. 136–140గా నిర్ణయించింది. ఆఫర్‌లో భాగంగా 15 లక్షల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. తద్వారా రూ. 21 కోట్లవరకూ సమకూర్చుకునే యోచనలో ఉంది. ఎన్‌ఎస్‌ఈ ఎమర్జ్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా లిస్ట్‌కానుంది. యాంకర్‌ ఇన్వెస్టర్లకు ఈ నెల 21న షేర్లను విక్రయించనుంది. నిధులను 
వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాలు, బ్రాండ్‌ పటిష్టత, మార్కెటింగ్‌ తదితరాలకు వినియోగించనుంది. 

మరిన్ని వార్తలు