డిజిన్వెస్ట్‌మెంట్‌ నిధులు రూ.53,558 కోట్లు

18 Feb, 2019 05:31 IST|Sakshi

ఈ ఆర్థిక సంవత్సరం లక్ష్యం రూ.80,000 కోట్లు

లక్ష్య సాధన సంశయమే!

వచ్చే ఆర్థిక సంవత్సరం లక్ష్యం రూ.90,000 కోట్లు

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా కేంద్రం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా రూ.53,558 కోట్లు సమీకరించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్‌మెంట్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ.80,000 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఆర్థిక సంవత్సరం మరో నెలలో ముగియ నుండటం, స్టాక్‌ మార్కెట్‌ అంతంత మాత్రంగానే ఉండటంతో  ఈ లక్ష్యం సాకారమయ్యే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని నిపుణులంటున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్‌మెంట్‌ ద్వారా రూ.90,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.  

గత వారంలో రూ.15,379 కోట్లు  
గత వారంలో కేంద్రం రూ.15,379 కోట్లు  సమీకరించింది. భారత్‌–22 ఈటీఎఫ్‌ ఎఫ్‌పీఓ ద్వారా రూ.10,000 కోట్లు, యాక్సిస్‌ బ్యాంక్‌లో ఎస్‌యూయూటీఐకు ఉన్న వాటాను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా విక్రయించడం ద్వారా రూ.5,379 కోట్లు ప్రభుత్వ ఖజానాకు వచ్చాయి. భారత్‌–22 ఈటీఎఫ్‌ ఎఫ్‌పీఓకు మంచి స్పందన లభించింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.38,000 కోట్లు, రిటైల్‌ ఇన్వెస్టర్లు రూ.2,000 కోట్ల మేర బిడ్‌ చేశారు. గత ఏడాది జూన్‌లో ఈ ఈటీఎఫ్‌ ద్వారా ప్రభుత్వం రూ.8,325 కోట్లు సమీకరించగలిగింది.  

షేర్ల బైబ్యాక్‌ల ద్వారా జోరుగా నిధులు...
షేర్ల బైబ్యాక్‌ ద్వారా ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ నుంచి రూ.2,647 కోట్లు వచ్చాయి. అలాగే భెల్‌ నుంచి రూ.992 కోట్లు, ఎన్‌హెచ్‌పీసీ నుంచి రూ.398 కోట్లు, కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ నుంచి రూ.137 కోట్లు, ఎన్‌ఎల్‌సీ నుంచి రూ.990 కోట్లు, నాల్కో నుంచి రూ.260 కోట్లు, కేఐఓసీఎల్‌ నుంచి రూ.260 కోట్ల  మేర నిధులు ప్రభుత్వానికి లభించాయి. హెచ్‌ఎస్‌సీసీలో వ్యూహాత్మక వాటా విక్రయం ద్వారా రూ.285 కోట్లు ప్రభుత్వానికి వచ్చాయి.
ఇక ఆఫర్‌ ఫర్‌ సేల్‌ విధానంలో కోల్‌ ఇండియా ద్వారా ప్రభుత్వానికి రూ.5,218 కోట్లు లభించాయి. సీపీఎస్‌యూ ఈటీఎఫ్‌ యూనిట్ల విక్రయం ద్వారా రూ.17,000 కోట్లు లభించాయి. ఇక ఐదు ప్రభుత్వ రంగ పీఎస్‌యూల ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) ద్వారా రూ.1,700 కోట్లు కేంద్రం సమీకరించింది. రీట్స్, ఇర్కన్, మిధాని, గార్డెన్‌ రీచ్‌ షిప్‌బిల్డర్స్‌ ఐపీఓల ద్వారా ఈ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం సమీకరించింది.

మరిన్ని వార్తలు