సెప్టెంబర్‌ వరకూ తనఖా షేర్ల విక్రయం ఉండదు

18 Feb, 2019 05:17 IST|Sakshi

రుణ దాతలతో ఒప్పందం కుదుర్చుకున్న రిలయన్స్‌ గ్రూప్‌ 

షెడ్యూల్‌ ప్రకారమే అసలు, వడ్డీ  చెల్లింపులు జరుపుతాం

ఆర్‌పవర్‌లో వాటా విక్రయానికి ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్లు రెడీ...

న్యూఢిల్లీ: అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ గ్రూప్‌ కంపెనీలకు ఊరట లభించింది. ప్రమోటర్‌ తనఖా పెట్టిన షేర్లను ఈ ఏడాది సెప్టెంబర్‌ వరకూ విక్రయించకుండా రుణదాతలతో ఒక ఒప్పందాన్ని రిలయన్స్‌ గ్రూప్‌ కుదుర్చుకుంది. ఈ ఒప్పందానికి రుణదాతల్లో దాదాపు 90 శాతం సంస్థలు అంగీకరించాయి. ఈ ఒప్పందంలో భాగంగా రుణదాతలకు గడువు ప్రకారమే వడ్డీ, అసలు చెల్లింపులను రిలయన్స్‌ గ్రూప్‌..  జరుపుతుంది. అంతే కాకుండా రిలయన్స్‌ పవర్‌లో రిలయన్స్‌గ్రూప్‌నకు నేరుగా ఉన్న 30 శాతం వాటాలో పాక్షిక వాటాను సంస్థాగత ఇన్వెస్టర్లకు  విక్రయించడం కోసం  ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్లను నియమించింది. ఈ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్లు త్వరలో రోడ్‌షోలను నిర్వహిస్తారు.  

రిలయన్స్‌ గ్రూప్‌ ఒప్పందం కుదుర్చుకున్న రుణదాతల్లో టెంపుల్టన్‌ ఎమ్‌ఎఫ్, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రమెరికా ఎమ్‌ఎఫ్, ఇండియాబుల్స్‌ ఎమ్‌ఎఫ్, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్, యస్‌ బ్యాంక్‌లు ఉన్నాయి. కాగా తనఖా షేర్లు విక్రయించకుండా యథాతథ ఒప్పందం కుదిరినందుకు రుణదాతలకు రిలయన్స్‌ గ్రూప్‌ ధన్యవాదాలు తెలిపింది. తమపై నమ్మకం ఉంచినందుకు కృతజ్ఞులమని రిలయన్స్‌ గ్రూప్‌ ప్రతినిధి వ్యాఖ్యానించారు. ఇటీవల రిలయన్స్‌ గ్రూప్‌ షేర్లు భారీగా పతనమైన విషయం తెలిసిందే. ఈ పతనం కారణంగా తనఖా పెట్టిన షేర్ల విలువ బాగా తగ్గినప్పటికీ, రుణదాతలు తనఖా షేర్లను విక్రయించబోమని తాజా ఒప్పందం ద్వారా అభయం ఇచ్చాయి.  

ఎడెల్‌వీజ్‌కు బకాయి రూ.150 కోట్లు  
తనఖా పెట్టిన షేర్లను  ఎల్‌ అండ్‌ టీ ఫైనాన్స్, ఎడెల్‌వీజ్‌ సంస్థలు అన్యాయంగా కావాలని ఓపెన్‌ మార్కెట్లో విక్రయించాయని, ఫలితంగా తమ కంపెనీల షేర్ల విలువలు భారీగా పడిపోయాయని రిలయన్స్‌ గ్రూప్‌ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలను ఈ ఇరు కంపెనీలు ఖండించాయి. తనఖా ఒప్పందం ప్రకారమే షేర్లను విక్రయించామని, ఎలాంటి దురుద్దేశం లేదని ఎడెల్‌వీజ్‌ పేర్కొంది. కాగా క్యాపిటల్‌ మార్కెట్‌ కార్యకలాపాల్లో పాల్గొనకుండా ఎడెల్‌వీజ్‌ను తక్షణం నిషేధించాలని కూడా సెబీని రిలయన్స్‌ గ్రూప్‌ కోరింది. కాగా రిలయన్స్‌ గ్రూప్‌ ఎడెల్‌వీజ్‌ సంస్థకు రూ.150 కోట్ల రుణం చెల్లించాల్సి ఉండగా, ఎల్‌ అండ్‌ టీ ఫైనాన్స్‌ రుణం పూర్తిగా తీరిపోయింది.

మరిన్ని వార్తలు