విదేశీ పెట్టుబడుల వివరాలు ఏటా చెప్పాలి

7 Dec, 2019 05:12 IST|Sakshi

ఈ–కామర్స్‌ సంస్థలకు కొత్త నిబంధన

న్యూఢిల్లీ: ఈ–కామర్స్‌ సంస్థలు ఇకపై తమకు అందే విదేశీ పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) సంబంధించిన వివరాలను .. ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం తెలియజేయాల్సి రానుంది. తాము ఎఫ్‌డీఐ నిబంధనలను సక్రమంగా అమలు చేస్తున్నామంటూ ఏటా సెపె్టంబర్‌ 30లోగా ఆడిటర్‌ నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన నిబంధనను కేంద్రం శుక్రవారం నోటిఫై చేసింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ వంటి ఈ–కామర్స్‌ దిగ్గజాలపై దీని ప్రభావం ఉంటుంది. ఈ–కామర్స్‌ రంగంలో ఎఫ్‌డీఐ నిబంధనలు సక్రమంగా అమలయ్యేలా చూసేందుకు ఇది తోడ్పడగలదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

అయితే, దీన్ని అమలు చేసే క్రమంలో ఆయా సంస్థల వ్యయాలు పెరుగుతాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఈ–కామర్స్‌ కంపెనీలు ఎఫ్‌డీఐ నిబంధనలను యధేచ్ఛగా ఉల్లంఘిస్తున్నాయని దేశీ వ్యాపారస్తుల సమాఖ్య సీఏఐటీ ఆరోపిస్తున్న నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. పుష్కలంగా విదేశీ పెట్టుబడుల ఊతంతో ఈ–కామర్స్‌ కంపెనీలు అడ్డగోలు డిస్కౌంట్లు ఇస్తూ చిన్న వ్యాపారాలను దెబ్బ తీస్తున్నాయనే ఆరోపణలున్నాయి.

>
మరిన్ని వార్తలు