ఆగస్ట్‌లో జీఎస్‌టీ వసూళ్లు డౌన్‌

2 Sep, 2019 11:53 IST|Sakshi

రూ.98,202 కోట్లుగా నమోదు

న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ)రూపంలో ఆదాయ వసూళ్లు ఆగస్ట్‌ నెలలో లక్ష కోట్ల మార్క్‌ దిగువకు పడిపోయాయి. అంతక్రితం నెల జూలైలో జీఎస్‌టీ వసూళ్లు రూ.1.02 లక్షల కోట్లుగా ఉంటే, ఆగస్ట్‌లో రూ.98,202 కోట్లు వసూలయ్యాయి. అయితే, 2018 ఆగస్ట్‌ నెలలో వచ్చిన ఆదాయం రూ.93,960 కోట్లతో పోలిస్తే మాత్రం పెరిగినట్టు చెప్పుకోవాలి. జీఎస్‌టీ వసూళ్లు రూ.లక్ష కోట్ల మార్క్‌ దిగువకు రావడం ఈ ఏడాది రెండోసారి. జూన్‌లోనూ రూ.99,939 కోట్లే వసూలు అయ్యాయి.

ఆగస్ట్‌ నెల వసూళ్లలో రూ.17,733 కోట్లు సెంట్రల్‌ జీఎస్‌టీ కాగా, స్టేట్‌ జీఎస్‌టీ రూ.24,239 కోట్లు, ఇంటెగ్రేటెడ్‌ జీఎస్‌టీ రూ.49,958 కోట్లుగా ఉన్నాయి. సెస్సు రూ.7,273 కోట్లుగా ఉన్నట్టు ఆర్థిక శాఖ ప్రకటన పేర్కొంది. జూలై నెలకు సంబంధించి జీఎస్‌టీఆర్‌ 3బీ రిటర్నులు 75.80 లక్షలు దాఖలయ్యాయి. జూన్, జూలై నెలలకు సంబంధించి రూ.27,955 కోట్లు రాష్ట్రాలకు పరిహారంగా విడుదల చేసినట్టు ఆర్థిక శాఖ తెలిపింది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి ఆగస్ట్‌ వరకు జీఎస్‌టీ స్థూల వసూళ్లు రూ.5,14,378 కోట్లుగా ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో  రూ.4,83,538 కోట్లతో పోలిస్తే 6.3% వృద్ధి  చెందింది.

>
మరిన్ని వార్తలు