హెచ్డీఎఫ్సీ బ్యాంకు లాభం 20% వృద్ధి

26 Oct, 2016 00:50 IST|Sakshi
హెచ్డీఎఫ్సీ బ్యాంకు లాభం 20% వృద్ధి

క్యూ2లో రూ.3,455 కోట్లు
కలసి వచ్చిన రిటైల్ రుణాలు
19% పెరిగిన నికర వడ్డీ ఆదాయం

ముంబై: రిటైల్ రుణాలు కలసి రావడంతో ప్రైవేటు రంగ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు లాభం సెప్టెంబర్ త్రైమాసికంలో 20.4 శాతం వృద్ధి చెంది రూ.3,455 కోట్లకు చేరింది. గతేడాది ఇదే కాలంలో బ్యాంకు నికర లాభం రూ.2,869 కోట్లుగా ఉంది. ఆదా యం రూ.19,970 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే కాలంలో వచ్చిన రూ.17,324 కోట్లతో పోలిస్తే 15 శాతానికిపైగా వృద్ధి సాధించినట్టు తెలుస్తోంది. అధిక మార్జిన్లతో కూడిన రిటైల్ రుణాలు 22 శాతం వృద్ధి చెందడంతో నికర వడ్డీ ఆదాయం భారీగా పెరిగింది. నికర వడ్డీ ఆదాయం ఈ త్రైమాసికంలో 19.6 శాతం పెరిగి రూ.7,993 కోట్లకు చేరింది. బ్యాంకు నికర వడ్డీ మార్జిన్ 4.2 శాతంగా ఉంది.

రిటైల్ రుణాల కారణంగా బ్యాంకు మొత్తం రుణాలు గతేడాది ఇదే కాలంలో పోలిస్తే 18.1 శాతం వృద్ధి చెందినట్టు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తెలిపింది. బ్యాంకు ఇతర ఆదాయం సైతం 13.7 శాతం పెరిగి రూ.2,901 కోట్లుగా నమోదైంది. స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు) మొత్తం రుణాల్లో 0.90 శాతం నుంచి రూ.1.02 శాతానికి పెరిగాయి. వీటికి చేసిన కేటాయింపులు రూ.749 కోట్లుగా ఉన్నాయి. సెప్టెంబర్‌తో ముగిసిన ఆరు నెలల కాలానికి చూసుకుంటే బ్యాంకు నికర లాభం 20.3 శాతం పెరిగి రూ.6,694 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో లాభం రూ.5,565 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయం కూడా రూ.33,827 కోట్ల నుంచి రూ.39,293 కోట్లకు చేరుకుంది.

మరిన్ని వార్తలు