ఒకేసారి వంద అడుగులేయాలి!

2 May, 2017 00:34 IST|Sakshi
ఒకేసారి వంద అడుగులేయాలి!

హైపర్‌లూప్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ టెక్నాలజీ చైర్మన్‌ బిబోప్‌ గ్రేష్టా
రవాణాలో ఇండియా నత్త నడక నడిస్తే కుదరదు
మెట్రో రైళ్ల బదులు కూడా హైపర్‌లూప్‌ వాడొచ్చు
గరిష్ట వేగం గంటకు 1,200 కి.మీ... తగ్గించొచ్చు కూడా
ఇండియాకు ఈ దశలో హైస్పీడ్‌ రైళ్లయితే శుద్ధ దండగ
వాటికయ్యే ఖర్చు వల్ల భారీగా సబ్సిడీలివ్వాలి
హైపర్‌లూప్‌ సురక్షితం, సమర్థం, చౌక కూడా
చాలా దేశాలు ఓకే చేశాయి; డిసెంబర్‌లోగా యూఏఈలో పనులు
మోదీ, గడ్కారీ దీన్ని ఇండియాలో అమలు చేస్తామంటున్నారు
ఓ ముఖ్యమంత్రి దాదాపు ఖరారు చేశారు కూడా
పరోక్షంగా ముంబై– పుణే మార్గం ప్రస్తావన
దేశంలో ఎల్‌ అండ్‌ టీతో చేతులు కలపొచ్చని పరోక్ష సంకేతాలు  


విమానం కన్నా వేగంగా భూమ్మీదే వెళ్లగలిగితే!! అది కూడా విమాన టికెట్లతో పోలికే లేకుండా... బుల్లెట్‌ రైలుకన్నా తక్కువ ధరకే ప్రయాణించగలిగితే!! వీటన్నిటినీ సాధ్యం చేస్తామంటోంది హైపర్‌లూప్‌ టెక్నాలజీ. భూ గర్భంలోగానీ, పైలాన్లపైగానీ గొట్టాలు వేసి... వాటిలో వాక్యూమ్‌ తప్ప గాలి కూడా లేకుండా చేసి... రైలు, బస్సుల్లాంటి చిన్నచిన్న వాహనాలను నడపటమే హైపర్‌లూప్‌ టెక్నాలజీ. దీన్ని అభివృద్ధి చేస్తున్న కంపెనీల్లో ఇపుడు హైపర్‌లూప్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ టెక్నాలజీ (హెచ్‌టీటీ) కంపెనీదే పైచేయి. ప్రపంచవ్యాప్తంగా 42 దేశాల్లో 800 మంది కలిసి పనిచేస్తున్న ఈ కంపెనీ... ఇండియాపై దృష్టి పెట్టింది.

 కంపెనీ చైర్మన్‌ బిబోప్‌ గ్రేష్టా... పలువురు ముఖ్యమంత్రులతో పాటు ప్రధాని మోదీని, కేంద్ర మంత్రి గడ్కారీని కూడా కలిశారు. ముంబై– పుణే మార్గంపై ఒక స్పష్టతకు వచ్చినట్లు కూడా తెలుస్తోంది. రవాణా అవసరాలు విపరీతంగా ఉన్న ఇండియా... తమకు కీలక మార్కెట్‌ అని చెబుతున్న బిబోప్‌ గ్రేష్టా... హైదరాబాద్‌ వచ్చిన సందర్భంగా సాక్షి ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వూ్య ఇచ్చారు. దేశంలోని కొన్ని కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నట్లు కూడా చెప్పారాయన. ఇంటర్వూ్య ముఖ్యాంశాలివీ...


(మంథా రమణమూర్తి)
ఈ మధ్య ఇండియాకు పలుమార్లు వచ్చివెళ్లారు కదా! విశేషాలేమైనా...?
ఇండియాలో మౌలిక సదుపాయాల కొరత ఉంది. జనాభా ఎక్కువ. వేగంగా, సమర్థంగా, చౌకగా ప్రజలను రవాణా చెయ్యాల్సిన అవసరం చాలా ఉంది. హైపర్‌లూప్‌కు ఇదో అవకాశమన్నది మా ఉద్దేశం.

కానీ ఇండియా హైస్పీడ్‌ రైళ్లు తెస్తామంటోంది కదా?
అవును. కానీ వాటి ఫలితమేంటో తెలియంది కాదు. అది ఉత్త పనికిరాని టెక్నాలజీ. దాన్ని నడపాలంటే విపరీతమైన సబ్సిడీలివ్వాలి. వాటికయ్యే వ్యయం కూడా జీడీపీలో ఎక్కువే. భావి తరాలపై ఇంత భారం మోపటం అవసరమా..? అన్నది గుర్తించాలి. అడుగులో అడుగు కాకుండా... ఒకేసారి వందడుగులు వెయ్యమని మేం చెబుతున్నాం. హైపర్‌లూప్‌ అత్యంత సమర్థమైనది. ఇండియాకు దండగమారిలా కాక... వెన్నెముకలా పనిచేస్తుంది. దీనివల్ల సబ్సిడీల జమానా నుంచి బయటపడొచ్చు కూడా.

మీ టెక్నాలజీ ఎక్కడైనా విజయవంతంగా పరీక్షించారా?
కాలిఫోర్నియాలో పలుమార్లు విజయవంతంగా పరీక్షించాం. ఇపుడు తొలి హైపర్‌లూప్‌ పనులను ఎక్కడ ఆరంభించాలా అని చూస్తున్నాం. ఎందుకంటే పలు దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. బహుశా! యూఏఈలో తొలి హైపర్‌లూప్‌ సాకారం కావచ్చు. అలాగని ఇదే తుది మాట కాదు. ఇండియాలోనైనా కావచ్చు. ఇక్కడ నేను చాలామంది రాజకీయ నాయకులను కలిశా. ప్రధాని మోదీ భారతదేశాన్ని మార్చాలన్న దృఢ దీక్షతో ఉన్నారు. మిగిలిన వారు కూడా దీన్నొక అవకాశంగా భావించాలి.

ముంబై– పుణే రూట్‌పై మహారాష్ట్ర ప్రభుత్వం ఆసక్తి చూపిస్తోందట! నిజమేనా?
నేను చాలామంది రాజకీయ నాయకుల్ని, ముఖ్యమంత్రుల్ని కలిశా. వారు దీన్ని అమలు చేయాలన్న చిత్తశుద్ధితో ఉన్నారు. నీతి ఆయోగ్, కేంద్రానికి చెందిన కీలక సంస్థలు మా టెక్నాలజీని సమర్థిస్తున్నాయి. ఓ ముఖ్యమంత్రి దీనికి దాదాపు పచ్చజెండా ఊపారు. సంతకాలు కాలేదు కనక ఆయనెవరో, ఆ రూటేంటో చెప్పలేను. కానీ ఆ రూట్లో రోజుకు 7 లక్షల మంది ప్రయాణిస్తారని మాత్రం చెప్పగలను.

హైపర్‌లూప్‌కు భారీగా ఖర్చవుతుంది కదా? మరి ఆ పెట్టుబడులు వెనక్కి రావటానికి ఎన్నాళ్లు పడుతుంది?
పోల్చాలంటే మనం వాడుతున్నదాంతో పోల్చాలి. ఇండియా హైస్పీడ్‌ రైళ్లు తేవాలనుకుంటోంది. దాంతో పోలిస్తే రెండు మూడు రెట్లు చౌక. మెట్రో మాదిరి ఖర్చు ఉంటుందనుకోవచ్చు. కాకపోతే ఇదంతా నిర్మాణం విషయంలోనే. నిర్మించాక నడిచేటపుడు హైపర్‌లూప్‌ చాలా చౌక. పైపెచ్చు సమర్థమైంది. ఖర్చు ఇంకా తక్కువ కావటానికి పైలాన్లపై నిర్మించొచ్చు. దీంతో భూ సేకరణ ఖర్చు తక్కువ ఉంటుంది. మరోవంక హైపర్‌లూప్‌ నిశ్శబ్దంగా నడుస్తుంది. శబ్దకాలుష్యం ఉండదు కనక భూమి విలువ పెరుగుతుంది. హైస్పీడ్‌ రైలయితే భూసేకరణ.. శబ్దకాలుష్యం, ఇతరత్రా కాలుష్యం కూడా ఉంటాయి కదా. దీనివల్ల అక్కడి భూమి విలువ పడిపోతుంది కూడా. ఇక దీని నిర్వహణకు మైళ్ల కొద్దీ విద్యుత్‌ లైన్లు వేయాలి. హైపర్‌లూప్‌కు పెట్టిన ఖర్చు ఎనిమిది నుంచి పదేళ్లలో తిరిగి వచ్చేస్తుంది.

హైపర్‌లూప్‌కు కూడా ఇంధనం అవసరమేగా?
హైస్పీడ్‌ రైళ్లతో పోలిస్తే దానికయ్యే దాంట్లో లేశమంత విద్యుత్‌ చాలు. ఎందుకంటే ట్యూబ్‌లో గాలి ఉండదు. వాక్యూమ్‌లో పాడ్స్‌ నడిచేటపుడు వాటికి గాలి నిరోధం ఉండదు. ఒక దశను మించి వేగం పెరిగితే గాలి నిరోధం పెరిగి... నీరుగా మారుతుంది. మామూలు వాహనాలు దాన్ని అధిగమించాలంటే అధిక శక్తి, అధిక ఇంధనం కావాలి. హైపర్‌లూప్‌లో అలా కాదు కనక ఇంధనం తక్కువ చాలు. వ్యయం తక్కువ కనక త్వరగానే లాభాల్లోకి రావచ్చు. దీనిపై వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వం విద్య, వైద్యం వంటి ఇతర కార్యక్రమాలకు వెచ్చించవచ్చు. కావాల్సిన విద్యుత్‌లో 30 శాతాన్ని సోలార్‌ ప్యానెల్, గాలి, కైనెటిక్‌ ఎనర్జీ, రీ జనరేటెడ్‌ బ్రేకింగ్‌తో ఉత్పత్తి చేస్తాం.

భారీ దూరాలకేనా... తక్కువ దూరాలక్కూడానా?
తక్కువ దూరాలకూ వాడొచ్చు. ఇది మెట్రో కన్నా చౌక. ట్యూబులో నడుస్తుంది కనక సురక్షితం. హైపర్‌లూప్‌ స్పీడెక్కువ అన్నది నిజం. కానీ ఈ వేగం అనేది కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లోనే సాధ్యమవుతుంది. ఎక్కడా వంపులు లేని తిన్నటి సుదూర మార్గం ఉంటే అక్కడ గరిష్టంగా గంటకు 1,200 కిలోమీటర్ల వేగం సాధ్యమే. తక్కువ దూరాల విషయంలో ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని కాస్త తక్కువ వేగంతో నడిపించాల్సి ఉంటుంది.మొత్తంగా చూస్తే హైపర్‌లూప్‌ అనేది విమానం కన్నా సౌకర్యవంతమైనది. తక్కువ వేగంతో వెళితే దీనికి ఇంకా తక్కువ ఇంధనం అవసరమవుతుంది. అన్నిసార్లూ వేగమే అవసరం లేదు. సమర్థంగా జనాన్ని రవాణా చేయాలంతే.

ఏపీ, తెలంగాణల్లో దీనికోసం ప్రయత్నిస్తున్నారా?
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబును ఇప్పటికే రెండు సార్లు కలిశాం. చాలా మార్గాలు, అవకాశాలపై చర్చించాం. విజయవాడ, విశాఖల్లో మెట్రోలకు ఓకే చేశారు కదా! చూడాలి... ఎక్కడ అవకాశం వస్తుందో!. తెలంగాణ ప్రతి నిధులనూ కలిసే యత్నాలు చేస్తున్నాం.

మీకు కావాల్సినన్ని నిధులున్నాయా?
దీన్ని ప్రైవేటు పెట్టుబడులతోనే ఆరంభించాం. ఇండియాలో ప్రాజెక్టు గనక ఆరంభిస్తే అప్పుడే దానికి సంబంధించి నిధులు సమీకరిస్తాం.

మరి ఇతర దేశాల సంగతో?
కాలిఫోర్నియాతో పాటు ఫ్రాన్స్, చెక్‌ రిపబ్లిక్, స్లొవేకియా, యూఏఈ, జకార్తాల్లో మా ప్రాజెక్టుకు సంబంధించి చర్చలు పురోగతిలో ఉన్నాయి. కొన్నిటికి సంబంధించి ఒప్పందాలు కూడా జరిగాయి. యూఏఈలో డిసెంబర్‌లోగా పనులు మొదలుపెట్టే అవకాశం ఉంది.

ఇండియాలో ప్రాజెక్టు ఎప్పుడు రావచ్చు?
ప్రాజెక్టు ఓకే చేశాక ఆ రూట్‌కు సంబంధించి సాధ్యాసాధ్యాల్ని అధ్యయనం చేస్తాం. అది పూర్తయిన 38 నెలల్లో హైపర్‌లూప్‌ నడుస్తుంది. ఇలాంటి ప్రాజెక్టులకు ఇండియాలో అతిపెద్ద అడ్డంకి భూసేకరణే. ఇండియాకు సంబంధించి నేను చెప్పేదొక్కటే. చరిత్రలో ఏ వైపు ఉండాలో తేల్చుకోవాల్సిన సమయం ఇండియాకు వచ్చింది. కాలుష్యం, ట్రాఫిక్, ప్రమాదాల వంటివి ఇంకా కావాలా అనేది చూసుకోవాలి. స్మార్ట్‌ఫోన్ల విషయంలో పురోగమించినట్లే ఈ విషయంలోనూ దూకుడు అవసరం.

ఇండియాలో దీనికోసం ఏ కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు?
మా కంపెనీలో ఇండియా నుంచి 15 మంది పనిచేస్తున్నారు. టెక్నాలజీకి సంబంధించి ఇక్కడి కంపెనీలతో కొన్ని భాగస్వామ్యాలు కుదుర్చుకున్నాం. అయితే ప్రాజెక్టు అమలుకు మాతో కలిసి పనిచేయటానికి చాలా సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఒకదాన్ని దాదాపు ఖరారు చేశాం. ఒప్పందం ఇంకా కుదరలేదు కనక పేరు చెప్పలేను. అయితే దానికి మెట్రో రైలు అనుభవం ఉంది. (ఇది ఎల్‌ అండ్‌ టీ కావొచ్చా? అన్న ప్రశ్నకు జవాబివ్వకుండా గ్రేష్టా నవ్వేశారు).

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా