-

ఎన్‌ఎస్‌ఈ బ్రోకర్‌పై దాడి: రూ.11 కోట్లు సీజ్‌

17 Nov, 2017 20:01 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : నేషనల్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ బ్రోకర్‌ సంజయ్‌ గుప్తాకు చెందిన ఢిల్లీ నివాసంలో జరిగిన ఆదాయపు పన్ను శాఖ దాడుల్లో రూ.11 కోట్ల నగదు పట్టుబడింది. ఓపీజీ గ్రూప్‌కు చెందిన కో-లొకేషన్‌ కేసులో భాగంగా ఐటీ అధికారులు ఈ తనిఖీలు చేపడుతున్నారు. సంజయ్‌ గుప్తా నివాసంలో జరిపిన దాడుల్లో శుక్రవారం రూ.11 కోట్లు సీజ్‌ చేసినట్టు ఐటీ అధికారులు తెలిపారు. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కత్తాల్లో ఓపీజీ గ్రూప్‌, ఇతరులకు చెందిన 50కి పైగా ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా ఐటీ దాడులు జరుపుతోంది.  ఈ దాడుల్లో వందల కోట్ల పన్ను ఎగవేతకు సంబంధించి డాక్యుమెంట్లను, ఫారిన్‌ బ్యాంకు అకౌంట్లు, ఓవర్‌సీస్‌ ట్రేడింగ్‌ ఫండ్ల డాక్యుమెంట్లను సీజ్‌ చేసినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఓపీజీ సెక్యురిటీస్‌ ఢిల్లీకి చెందిన స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థ. ఎన్‌ఎస్‌ఈ సర్వర్లకు అన్యాయపూర్వకమైన యాక్సస్‌ను కలిగి ఉందనే నెపంతో ఆరు నెలల పాటు ఈ బ్రోకింగ్‌ సంస్థపై నేషనల్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ నిషేధం విధించింది. గుప్తా నివాసంలో దొరికిన నగదు పలు బాక్స్‌లో దాచిపెట్టి ఉంచారని, ఫర్నీచర్‌ చెక్క మధ్యలో ఉంచినట్టు తెలిసింది. ఎన్‌ఎస్‌ఈ మాజీ సీఈవో, ఇతర అధికారుల ప్రాంతాల్లో కూడా ఇంతకముందు ఐటీ దాడులు జరిపింది. కో-లొకేషన్‌ సౌకర్యంతో ఎన్‌ఎస్‌ఈ ఎక్స్చేంజ్‌ నుంచి త్వరగా డేటాను ఓపెజీ సెక్యురిటీస్‌ పొందుతుందని వెల్లడైంది. ఈ సమాచారం ముందస్తుగా పొందడంతో ఎక్కువమొత్తంలో ట్రేడింగ్‌ లాభాలు పొందుతున్నట్టు తెలిసింది.

మరిన్ని వార్తలు