ఐసీఐసీఐ విదేశీ విస్తరణ

1 Jul, 2014 00:57 IST|Sakshi
ఐసీఐసీఐ విదేశీ విస్తరణ

వడోదర: విదేశాల్లో విస్తరణ కోసం  ఐసీఐసీఐ బ్యాంక్ ప్రయత్నాలు చేస్తోంది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, మారిషస్‌ల్లో బ్యాంక్ శాఖలను ఏర్పాటు చేయనున్నామని బ్యాంక్ ఎండీ, సీఈఓ చందా కొచ్చర్ చెప్పారు. అంతేకాకుండా చైనాలో ఉన్న రిప్రజంటేటివ్ ఆఫీస్‌ను పూర్తి స్థాయి బ్యాంక్ శాఖగా ఏర్పాటు  చేయనున్నామని పేర్కొన్నారు. వీటన్నింటికి తగిన ఆమోదాలు ఆర్‌బీఐ నుంచి పొందామని వివరించారు. బ్యాంక్ 20వ వార్షిక సాధారణ సమావేశంలో ఆమె మాట్లాడారు. భారత ప్రైవేట్ బ్యాంకులతో పోల్చితే విదేశీ నెట్‌వర్క్‌లో ఐసీఐసీఐ బ్యాంక్ అతి పెద్ద బ్యాంక్ అని పేర్కొన్నారు.
 
మూడు అనుబంధ బ్యాంకులతో, ఎనిమిది రిప్రజంటేటివ్ ఆఫీస్‌లతో విదేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని వివరించారు. గత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 653 బ్యాంక్ శాఖలను, 834 ఏటీఎంలను ఏర్పాటు చేశామని, దీంతో మొత్తం శాఖల సంఖ్య 3,753కు, ఏటీఎంలు 11,315కు పెరిగాయని చందా కొచ్చర్ తెలిపారు. వృద్ధి సాధనపై దృష్టి సారించే సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడటం భారత్‌కు ప్రయోజనం కలిగిస్తుందని పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో దేశీ యంగా ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నప్పటికీ, మంచి పనితీరు సాధించామని తెలిపారు. ఈ ఏడాది మరింత మెరుగైన ఫలితాలను నమోదుచేయగలమన్న విశ్వాసాన్ని కొచర్ వ్యక్తం చేశారు.

>
మరిన్ని వార్తలు