ఐఎల్‌ఎఫ్‌ఎస్‌పై చర్యలకు నో

16 Oct, 2018 00:43 IST|Sakshi

స్టే విధిస్తూ ఎన్‌సీఎల్‌ఏటీ ఆదేశాలు

తదుపరి విచారణ నవంబర్‌ 13కి వాయిదా

న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్, దాని గ్రూప్‌ సంస్థలపై తదుపరి ఉత్తర్వులు ఇచ్చేదాకా అన్ని చర్యలపై స్టే విధిస్తూ నేషనల్‌ కంపెనీ లా అపీలేట్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) ఆదేశాలిచ్చింది. గ్రూప్‌ సంస్థలు తీసుకున్న రుణాల చెల్లింపులకు సంబంధించి 90 రోజుల మారటోరియం విధించాలన్న అభ్యర్ధనను ఎన్‌సీఎల్‌టీ తోసిపుచ్చడంతో.. కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ ఎన్‌సీఎల్‌ఏటీని ఆశ్రయించగా తాజా ఉత్తర్వులు వచ్చాయి.

90 రోజుల మారటోరియంపై తమ తమ అభిప్రాయాలను తెలియజేయాల్సిందిగా గ్రూప్‌నకు అత్యధికంగా రుణాలిచ్చిన  5 ఆర్థిక సంస్థలకు ద్విసభ్య ఎన్‌సీఎల్‌ఏటీ బెంచ్‌ సూచించింది. ‘తదుపరి ఉత్తర్వులిచ్చే దాకా ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్, దాని 348 అనుబంధ సంస్థలపై ఏ కోర్టు లేదా ట్రిబ్యునల్‌ ద్వారా ఎలాంటి చర్యలు చేపట్టకుండా స్టే విధించడమైనది’ అని పేర్కొంది. దీనిపై తదుపరి విచారణను నవంబర్‌ 13కి వాయిదా వేసింది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ రుణభారం దాదాపు రూ. 90,000 కోట్ల మేర ఉంది.

రుణాలను చెల్లించని పక్షంలో రుణదాతలు కంపెనీపై దావాలు వేయకుండా ఆదేశాలివ్వాలంటూ ఎన్‌సీఎల్‌టీని కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ కోరింది. మారటోరియం విధించిన పక్షంలో కంపెనీని వేగంగా గట్టెక్కించడానికి తగు ప్రణాళికలను రూపొందించడానికి కొత్త బోర్డుకు అవసరమైన సమయం దొరుకుతుందని ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ లాయర్‌ విన్నవించారు. అది జరగకపోతే కంపెనీ దేశవ్యాప్తంగా 70–80 దావాలు ఎదుర్కొనాల్సి వస్తుందని తెలిపారు.

టర్మ్‌ రుణం, కార్పొరేట్‌ రుణం, డిబెంచర్లు మొదలైనవి వెంటనే చెల్లించాలంటూ రుణదాతల నుంచి ఒత్తిళ్లు రాకుండా అపీలేట్‌ ట్రిబ్యునల్‌ స్టే విధించింది. అలాగే, తమ వద్ద ఉన్న కంపెనీ నిధులను బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తమకు రావాల్సిన బకాయిల కింద సర్దుబాటు చేసుకోవడానికి కూడా వీల్లేదని పేర్కొంది. 

కంపెనీకి ఊరట..
ఎన్‌సీఎల్‌ఏటీ మధ్యంతర ఉత్తర్వులతో రుణదాతల ఒత్తిళ్ల నుంచి కొంత ఊరట లభించగలదని ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. వాటాదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తగు పరిష్కార ప్రణాళికను రూపొందించేందుకు కొత్త బోర్డుకు అవకాశం లభిస్తుందని వివరించింది. మరోవైపు ఎన్‌సీఎల్‌ఏటీ ఆదేశాలను కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ స్వాగతించింది. భారీ రుణాల చెల్లింపు కన్నా జీతాల చెల్లింపు, సకాలంలో ప్రాజెక్టులను పూర్తి చేయడం ముఖ్యమని పేర్కొంది.
 

మరిన్ని వార్తలు