31 శాతం తగ్గిన విస్తారా నష్టాలు | Sakshi
Sakshi News home page

31 శాతం తగ్గిన విస్తారా నష్టాలు

Published Wed, Aug 23 2023 5:30 AM

Vistara net loss narrows to Rs 1393 crore in FY23 - Sakshi

ముంబై: గత ఆర్థిక సంవత్సరం(2022–23)లో ప్రయివేట్‌ రంగ విమానయాన కంపెనీ విస్తారా నష్టాలు భారీగా తగ్గాయి. రూ. 1,393 కోట్లకు పరిమితమయ్యాయి. అంతక్రితం ఏడాది(2021–22) లో నమోదైన రూ. 2,031 కోట్లతో పోలిస్తే 31 శాతంపైగా రికవర్‌ అయ్యాయి.

కార్పొరేట్‌ వ్యవహారాల శాఖకు దాఖలు చేసిన సమాచారం ప్రకారం టాటా ఎస్‌ఐఏ ఎయిర్‌లైన్స్‌(విస్తారా) మొత్తం ఆదాయం రెట్టింపై రూ. 11,784 కోట్లను తాకింది. దీంతో నష్టాలు భారీగా తగ్గినట్లు కంపెనీ పేర్కొంది. అయితే నెట్‌వర్త్‌ రూ. 1,250 కోట్ల నుంచి రూ. 502 కోట్లకు నీరసించింది. దేశీ విమానయాన పరిశ్రమ గతేడాది పటిష్ట వృద్ధిని సాధించినట్లు విస్తారా తెలియజేసింది. కోవిడ్‌ ముందుస్థాయిని సైతం అధిగమించినట్లు వెల్లడించింది. గత ఆరు నెలల్లో సగటున ప్రతిరోజూ 4 లక్షల మంది ప్రయాణికులు నమోదవుతున్నట్లు తెలియజేసింది.

ఉమ్మడి నష్టం ఇలా..
టాటా గ్రూప్‌ వెలువరించిన 2022–23 వార్షిక నివేదిక ప్రకారం గతేడాది గ్రూప్‌లోని ఎయిరిండియా, ఎయిరేíÙయా, విస్తారాల ఉమ్మడి నష్టం రూ. 15,532 కోట్లుగా నమోదైంది. వెరసి 2021–22లో నష్టం రూ. 13,838 కోట్లు మాత్రమే. అయితే ఈ కాలంలో మూడు సంస్థల ఆదాయం పుంజుకున్నప్పటికీ ఎయిరిండియా విమానాలు, ఇంజిన్ల నిలుపుదల కారణంగా రూ. 5,000 కోట్లమేర అదనపు ప్రొవిజనింగ్‌ చేపట్టడంతో ఉమ్మడి నష్టాలు పెరిగాయి. టాటా సన్స్‌ వార్షిక నివేదిక ప్రకారం గతేడాది ఎయిరిండియా ఆదాయం రూ. 31,377 కోట్లను దాటగా.. రూ. 11,388 కోట్ల నష్టం నమోదైంది. ఎయిరేíÙయా టర్నోవర్‌ రూ. 4,310 కోట్లుకాగా.. రూ. 2,750 కోట్ల నష్టం ప్రకటించింది. అయితే ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ మాత్రం గతేడాది రూ. 5,669 కోట్ల ఆదాయం సాధించింది. అంతేకాకుండా రూ. 117 కోట్ల నికర లాభం ఆర్జించింది.

Advertisement
Advertisement