చట్ట ప్రకారమే విదేశాల్లో ఇన్వెస్ట్ మెంట్స్

5 Apr, 2016 00:53 IST|Sakshi
చట్ట ప్రకారమే విదేశాల్లో ఇన్వెస్ట్ మెంట్స్

స్పష్టం చేసిన ‘పనామా పేపర్స్’ కంపెనీలు
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వ చట్టాల ప్రకారమే విదేశాల్లో ఇన్వెస్ట్ చేశామని, ఎలాంటి చట్ట ఉల్లంఘనలకు పాల్పడలేదని ‘పనామా పేపర్స్’లో పేర్లున్న  కార్పొరేట్ కంపెనీలు స్పష్టం చేశాయి.  పన్నులు ఎగ్గొట్టి విదేశాల్లో నల్లధనాన్ని దాచుకున్నామని తమపై వచ్చిన వార్తలు సరికాదని డీఎల్‌ఎఫ్, అపోలో టైర్స్, ఇండియాబుల్స్ సంస్థలు స్పష్టం చేశాయి.

 ఆర్‌బీఐ పరిమితికి లోబడే ఇన్వెస్ట్‌మెంట్స్...
ఆర్‌బీఐ, ఫెమా, ఆదాయపు పన్ను శాఖ నియమ నిబంధనల ప్రకారమే విదేశాల్లో ఇన్వెస్ట్ చేశామని డీఎల్‌ఎఫ్ సీఈఓ రాజీవ్ తల్వార్ చెప్పారు. డీఎల్‌ఎఫ్ ప్రమోటర్ కుటుంబం బ్రిటిష్ వర్జిన్ దీవుల్లో కొన్ని కంపెనీలు ఏర్పాటు చేశాయని, కోటి డాలర్ల వరకూ నల్లధనాన్ని పోగేసుకున్నాయని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేర్కొంది. 2004లో ప్రభుత్వం తెచ్చిన ఎల్‌ఆర్‌ఎస్ స్కీమ్ ప్రకారమే విదేశాల్లో ఇన్వెస్ట్ చేశామని రాజీవ్ తల్వార్ పేర్కొన్నారు. ఎలాంటి చట్ట ఉల్లంఘనలు జరగలేదని, బ్రిటిష్ వర్జిన్ దీవుల్లో  తమ ప్రమోటర్ గ్రూప్‌లు ఒక్క కంపెనీని కూడా ఏర్పాటు చేయలేదని తెలిపారు. వివరాలన్నీ ప్రతి ఏటా ఆదాయపు పన్ను విభాగానికి నివేదిస్తునే ఉన్నామని, డీఎల్‌ఎఫ్ వార్షిక నివేదికలోనూ పొందుపరుస్తామని వివరించారు.

 అంతా నిబంధనల ప్రకారమే...
విదేశాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అనుమతించే చట్టాల ప్రకారమే అపోలో టైర్స్ గ్రూప్ చైర్మన్ ఓంకార్ కన్వర్, ఆయన కుటుంబ సభ్యులు విదేశాల్లో ఇన్వెస్ట్ చేశారని అపోలో గ్రూప్ ప్రతినిధి పేర్కొన్నారు. ఈ విషయంలో ఎలాంటి చట్ట ఉల్లంఘన జరగలేదని వివరించారు. అపోలో గ్రూప్ చైర్మన్ కుటుంబ సభ్యులు చాలా మంది ఎన్నారైలని, ఇతర దేశాల చట్టాల ప్రకారమే వారు పెట్టుబడులు పెట్టారని వివరించారు. భారత దేశ ఆదాయపు పన్ను చట్టం, ఆర్‌బీఐ నియమనిబంధనలు, ఆంక్షలు వారికి వర్తించవని స్పష్టం చేశారు. భారత్‌లో పూర్తిగా పన్నులు చెల్లించిన తర్వాతనే విదేశాల్లో ఇన్వెస్ట్ చేశామని ముంబైకి చెందిన ఇండియాబుల్స్ సంస్థలకు చెందిన సమీర్ గెహ్లాట్ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు