2018లో 7.3... 2019లో 7.4!

10 Oct, 2018 00:39 IST|Sakshi

వాషింగ్టన్‌: భారత్‌ 2018లో 7.3 శాతం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటును సాధిస్తుందని అంచనాలను అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) వెలువరించింది. 2019లో ఈ రేటు 7.4 శాతంగా ఉంటుందని పేర్కొంది. అయితే తాజా అంచనాలు 2018 ఏప్రిల్‌లో ఇచ్చిన అంచనాలకన్నా కొంచెం తక్కువగా ఉండడం గమనార్హం. 

మొత్తంగా ఈ ఏడాది ‘ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ’ హోదాను భారత్‌ 2018లో  కైవసం చేసుకుంటుందని వివరించింది. ఈ విషయంలో చైనాకన్నా (6.6%)  భారత్‌ వృద్ధి రేటు  0.7 శాతం అధికంగా ఉండబోతున్నట్లు పేర్కొంది.

2017లో చైనాయే టాప్‌..: 2017లో భారత్‌ వృద్ధి రేటు 6.7%గా పేర్కొంది. 6.9 శాతంతో చైనా మొదటి స్థానంలో ఉంది. అయితే 2018లో చైనా 6.6%వృద్ధి రేటునే సాధిస్తుందన్నది తాజా ఐఎంఎఫ్‌ అంచనా. 2019లో ఈ రేటు 6.2 శాతంగా ఉంటుందని అంచనా వేసింది.

‘భారత్‌ పలు కీలక సంస్కరణలను ఇటీవల చేపట్టింది. వస్తు సేవల పన్ను, లక్ష్యానికి కట్టుబడి ఉండేలా  ద్రవ్యల్బణం విధానాలు, బ్యాంకింగ్‌కు సంబంధించి దివాలా చట్టాలు, విదేశీ పెట్టుబడుల సరళీకరణలకు తీసుకుంటున్న చర్యలు ఇక్కడ ప్రస్తావించుకోవచ్చు. దేశంలో వ్యాపార పరిస్థితులను ఆయా చర్యలు మెరుగుపరుస్తున్నాయి. తగిన వృద్ధి రేటుకు ఆయా పరిస్థితులు దోహదపడుతున్నాయి’’  అని  ‘వరల్డ్‌ ఎకనమిక్‌ అవుట్‌లుక్‌’ పేరుతో విడుదలైన నివేదికలో ఐఎంఎఫ్‌ పేర్కొంది.  

ప్రపంచ వృద్ధి అంచనాలకూ కోత...
వాణిజ్య యుద్ధం, క్రూడ్‌ ధరల పెరుగుదల వంటి పలు సమస్యలను ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటోంది. దీనితో ప్రపంచ వృద్ధి రేటునూ 0.2 శాతం మేర ఐఎంఎఫ్‌ తగ్గించింది. 2018, 2019లో ఈ రేట్లు 3.7 శాతంగా ఉంటాయని అంచనావేసింది. 2017లో కూడా ఇదే ప్రపంచ వృద్ధి రేటు నమోదయ్యింది. ఇక అమెరికా 2018లో 2.9 శాతం వృద్ధి రేటును 2019లో 2.5 శాతం వృద్ధి రేటును సాధిస్తుందని ఐఎంఎఫ్‌ అంచనా వేసింది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా