అగర్‌బత్తీల్లో లోకల్ ఆధిపత్యం

28 Aug, 2015 02:05 IST|Sakshi
అగర్‌బత్తీల్లో లోకల్ ఆధిపత్యం

- రూ.3,500 కోట్లకు పరిశ్రమ
- ఏటా 6 శాతం మార్కెట్ వృద్ధి
- ఆన్‌లైన్ సహా విస్తరణ బాటలో కంపెనీలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:
కొన్నాళ్ల కిందటి వరకూ... అగర్‌బత్తీ అంటే ఒకటే రంగు. సువాసన కూడా ఒకటే. అసలు అగర్‌బత్తీ అంటే ఇలాగే ఉంటుంది... ఇలా లేనిది అగర్‌బత్తీ కాదనే భావనతో ఉండేవారంతా.
 
మరిప్పుడో...! మార్పు దీనికీ వ్యాపించింది. రకరకాల రంగులు. అత్తరు పరిమళాలను మించి రకరకాల సువాసనలు. ఇక బ్రాండ్ల విషయానికొస్తే చెప్పనక్కరే లేదు. లెక్కలేనన్ని ప్రాంతీయ బ్రాండ్లు. స్థానికంగా తయారీ ప్లాంట్లు ఉండడం, దశాబ్దాల తరబడి వ్యాపారాలను కొనసాగిస్తుండడంతో ఈ కంపెనీలు మార్కెట్లో గట్టి పట్టు సాధించాయి. అంతేకాదు ఒకటి రెండు ఉత్పత్తులకు పరిమితం కాకుండా కస్టమర్ల అభిరుచులను లోతుగా అధ్యయనం చేస్తూ... వాటికి అనుగుణంగా రకరకాల పరిమణాలతో పెద్ద ఎత్తున ఉత్పత్తులను మార్కెట్లోకి తెస్తున్నాయి. ఇవన్నీ కలిసి కంపెనీల బ్రాండ్ ఇమేజ్‌ను బాగా పెంచుతున్నాయి. ప్రజల్లో ఆధ్యాత్మికత అంతకంతకూ పెరుగుతుండడంతో ఇదే ఊపుతో ప్రాంతీయ కంపెనీలు ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తున్నాయి. రూ.3,500 కోట్ల భారత అగర్‌బత్తీల విపణిలో దిగ్గజ కంపెనీలకు ప్రాంతీయ బ్రాండ్లు సవాల్ విసురుతున్నాయి.
 
మార్కెట్లో వేటికవే సాటి...
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఏటా రూ.300 కోట్ల విలువైన అగర్‌బత్తీల వ్యాపారం జరుగుతుండగా.. దాన్లో వ్యవస్థీకృత రంగం వాటా రూ.200 కోట్లు. ఇందులో 60% వాటాతో అంబికా దర్బార్‌బత్తి అగ్ర స్థానాన్ని కొనసాగిస్తోంది. కంపెనీ 1946 నుంచి ఈ వ్యాపారంలో ఉంది. కర్ణాటకలో ‘వాసు’ బ్రాండ్ ముందంజలో ఉంది. 1949లో ప్రస్థానాన్ని ప్రారంభించిన ఈ కంపెనీ.. 50కిపైగా దేశాలకు ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. ఇక 1954లో ప్రారంభమైన దేవ్ దర్శన్ బ్రాండ్ హరియాణా మార్కెట్లో స్థిరమైన వాటాను దక్కించుకోవటమే కాక... ఆన్‌లైన్‌లోనూ ఉత్పత్తులను విక్రయిస్తోంది. 100కుపైగా ఉత్పత్తులను తయారు చేస్తూ 15 రాష్ట్రాల్లో విక్రయిస్తోంది. ఉత్తర ప్రదేశ్‌లో గట్టి పట్టు సాధించిన ‘తిరంగ’ బ్రాండ్... ఉత్తర, తూర్పు భారత్‌లో పలు రాష్ట్రాలకు విస్తరించింది. నాలుగు తరాలుగా అగర్‌బత్తీల తయారీలో ఉన్న ‘హరి దర్శన్’... ఢిల్లీలో పాపులర్ బ్రాండ్.
 
ప్రీమియం విభాగంలో...: కొన్ని కంపెనీలు మాత్రం ఒక అడుగు ముందుకేసి ప్రీమియం విభాగంలో పోటీ పడుతున్నాయి. ఖరీదైన అగర్‌బత్తీలు, ధూప్ బత్తీ, ధూప్ కోన్స్, ధూప్ స్టిక్స్‌ను విభిన్న పరిమళాల్లో తయారు చేస్తున్నాయి. ఒక్కో బత్తి ధర రూ.5 వరకు విక్రయిస్తున్న కంపెనీలు కూడా ఉన్నాయి. వీటిలో సైకిల్ బ్రాండ్ ఒకటి. దేశీయ వ్యవస్థీకృత అగర్ బత్తీల మార్కెట్లో సైకిల్ బ్రాండ్‌కు 20% వాటా ఉంది. ప్రపంచంలో అత్యధికంగా ఏటా 900 కోట్ల అగర్‌బత్తీలను కంపెనీ తయారు చేస్తోంది. ఐటీసీకి చెందిన మంగళ్‌దీప్ బ్రాండ్ మార్కెట్లో పట్టుకోసం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. జెడ్ బ్లాక్ పేరుతో ఇండోర్ కేంద్రంగా అగర్‌బత్తీలను తయారు చేస్తున్న మైసూర్ డీప్ పెర్ఫ్యూమరీ హౌస్... భారత్‌లో టాప్-5 కంపెనీల్లో ఒకటి. 500 రకాల ఉత్పత్తులను తయారు చేస్తూ... 10 దేశాలకు విస్తరించింది.
 
పరిమళాల ప్రత్యేకత...
అగర్‌బత్తీల్లో పరిమళాల తయారీ అంతా గోప్యంగానే సాగుతోంది. కొన్ని కంపెనీల్లో అయితే యజమానులకు మాత్రమే ఈ రహస్యం పరిమితం. ఈ విషయంలో ఒకో కంపెనీది ఒకో ప్రత్యేకత. కొన్నయితే పరిమళాల తయారీకి ఏళ్ల తరబడి సమయం వెచ్చించాయి కూడా. కొన్ని సంస్థలు ఫ్రాన్స్, టర్కీ, ఇండోనేిసియా నుంచి లావెండర్, రోజ్, క్లోవ్ ఆయిల్స్‌ను దిగుమతి చేసుకుంటున్నాయి. సైకిల్ బ్రాండ్ 350 పరిమళాల్ని అభివృద్ధి చేయగా... అంబికా 100కు పైగా పరిమళాలను రూపొందించింది.

సైకిల్ బ్రాండ్‌ను మైసూరుకు చెందిన ఎన్‌ఆర్ గ్రూప్ ప్రమోట్ చేస్తుండగా గ్రూప్ కంపెనీ అయిన నెస్సో ప్రస్తుతం 15 రకాల పూలు, 10 రకాల మొక్కల ఎక్స్‌ట్రాక్ట్స్‌ను విదేశాలకు ఎగుమతి చేస్తోంది. గ్రీన్ టీ, కాఫీ ఎక్స్‌ట్రాకసారంను సైతం విక్రయిస్తోంది. ఫార్ములేషన్స్ తయారీలోకి ప్రవేశించాలన్న ఆలోచన ఉందని ఎన్‌ఆర్ గ్రూప్ చైర్మన్ ఆర్.గురు ‘సాక్షి’ బిజినెస్ బ్యూరోకు తెలిపారు. న్యూట్రాస్యూటికల్స్, కాస్మెటిక్స్ తయారీలో ఇవి ఉపయోగపడతాయన్నారు.
 
ఆధ్యాత్మికత పెరుగుతోంది...
భారత్‌తోపాటు ఇతర దేశాల్లోనూ ఆధ్యాత్మికత పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. యువతలో ఇది అధికంగా కనపడుతున్నట్లు సైకిల్ బ్రాండ్ చెబుతోంది. ‘‘దేశంలో 76 శాతం మందికి అగర్‌బత్తీలు అందుబాటులో ఉన్నాయి. నెలకు సగటున ఒక్కో కుటుంబం రూ.20-50 ఖర్చు చేస్తోంది’’ అని సైకిల్ ప్యూర్ అగర్‌బత్తీస్ ఎండీ అర్జున్ రంగా చెప్పారు. 6 శాతం వృద్ధి రేటు నమోదు చేస్తున్న రూ.3,500 కోట్ల దేశీయ అగర్‌బత్తీ మార్కెట్లో 50 శాతం వ్యవస్థీకృత రంగం కైవసం చేసుకుంది. మొత్తంగా 2,000 పైగా కంపెనీలు పోటీపడుతుండగా దేశం నుంచి రూ.500 కోట్ల విలువైన అగర్‌బత్తీలు ఎగుమతి అవుతున్నాయి. బ్రెజిల్, పెరు, కొలంబియా ప్రధాన మార్కెట్లు.

పరిశ్రమ ఇప్పుడిప్పుడు ఆన్‌లైన్‌కు మళ్లుతోంది. తయారీలో వాడే ముడి పదార్థాల ధరలు పెద్దగా పెరగకపోవడం పరిశ్రమకు ఊరట కలిగించే అంశం. అయితే వెదురు దిగుమతి చేసుకోవడంతో ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయన్నది కంపెనీల ఆందోళన. అగ్రశ్రేణి ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు కొన్ని తయారీ వ్యయం కంటే తక్కువ ధరకే ఉత్పత్తులను విక్రయిస్తుండడంతో మార్కెట్లో నిలదొక్కుకోలేక పోతున్నామని చిన్న కంపెనీలు చెబుతున్నాయి.

మరిన్ని వార్తలు