ధరలు పైపైకి.. పారిశ్రామికోత్పత్తి కిందకు!

13 Dec, 2017 00:47 IST|Sakshi

నవంబర్‌లో రిటైల్‌ ద్రవ్యోల్బణం 4.88 శాతం

15 నెలల గరిష్ట స్థాయి

కూరగాయల ధరల మంట

అక్టోబర్‌లో పరిశ్రమల డీలా...

ఉత్పత్తిలో వృద్ధి కేవలం 2.2%

తయారీ, మైనింగ్‌ పేలవం..

న్యూఢిల్లీ: భారత తాజా ఆర్థిక గణాంకాలు నిరాశపరిచాయి. కేంద్రం మంగళవారం సాయంత్రం అక్టోబర్‌ పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ), నవంబర్‌ రిటైల్‌ ద్రవ్యోల్బణం గణాంకాలను విడుదల చేసింది. పారిశ్రామిక ఉత్పత్తిలో కేవలం 2.2 శాతం వృద్ధి నమోదయ్యింది. తయారీ, మైనింగ్‌ రంగాలు ఈ నెలలో పేలవ పనితనాన్ని ప్రదర్శించాయి.

గడిచిన మూడు నెలల్లో ఇంత తక్కువ స్థాయిలో పారిశ్రామిక ఉత్పత్తి నమోదు కాలేదు. 2016 ఇదే నెలలో ఈ వృద్ధి రేటు 4.2 శాతం. సెప్టెంబర్‌లో ఐఐపీ రేటు 4.14 శాతంగా నమోదయ్యింది. ఇక ఆర్థిక సంవత్సరం అక్టోబర్‌ వరకూ (ఏప్రిల్‌ నుంచీ) చూసినా ఐఐపీ వృద్ధి రేటు 5.5 శాతం నుంచి 2.5 శాతానికి పడిపోయింది. కాగా నవంబర్‌లో వినియోగ ధరల ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం భారీగా 4.88 శాతంగా నమోదయ్యింది.

ఆర్‌బీఐ రేటు పెంపు అవకాశం లేనట్లే..!
పారిశ్రామిక ఉత్పత్తి తగ్గినప్పటికీ, ద్రవ్యోల్బణం పెరుగుదల ధోరణి కనిపించడం  వల్ల రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఇప్పట్లో బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపో (ప్రస్తుతం 6 శాతం)ను తగ్గించే అవకాశం లేదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.  

గడచిన 15 నెలల్లో నవంబర్‌ అంత భారీ స్థాయిలో ద్రవ్యోల్బణం నమోదుకాలేదు. ఆర్‌బీఐ అంచనా (4.3–4.7 శాతం) మించి ధరల పెరుగుదల నమోదుకావడం గమనార్హం.  
కీలక రంగాలు ఇలా...: మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీలో దాదాపు 77 శాతం వాటా ఉన్న తయారీ రంగంలో వృద్ధి రేటు అక్టోబర్‌లో 4.8% నుంచి 2.5 శాతానికి పడిపోయింది. ఇక మైనింగ్‌ వృద్ధి 1% నుంచి 0.2 శాతానికి తగ్గింది.

గుడ్డు ధరకు రెక్కలు...
అక్టోబర్‌లో 3.58% ఉన్న రిటైల్‌ ద్రవ్యోల్బణం నవంబర్‌లో ఏకంగా 4.88 శాతానికి పెరిగింది. 2016 నవంబర్‌లో ఈ రేటు 3.63 శాతం. గుడ్లు ధర వార్షిక ప్రాతిపదికన నవంబర్‌లో 7.95% పెరిగాయి. అక్టోబర్‌లో ఈ పెరుగుదల 0.69 శాతమే. ఇక ఇంధనం, లైట్‌ విభాగంలో రేటు 6.36 శాతం నుంచి 7.92%కి పెరిగింది. కూరగాయల ధరలు ఏకంగా 22.48 శాతం పెరిగాయి.

మరిన్ని వార్తలు