రూ.639 లక్షల కోట్లకు వ్యక్తుల సంపద | Sakshi
Sakshi News home page

రూ.639 లక్షల కోట్లకు వ్యక్తుల సంపద

Published Wed, Dec 13 2017 12:50 AM

Total individual wealth to double to Rs 639 lakh cr in 5 yrs - Sakshi

ముంబై: వ్యక్తుల సంపద వచ్చే ఐదేళ్లలో రెట్టింపై రూ.639 లక్షల కోట్లకు చేరుతుందని కార్వీ ఇండియా వెల్త్‌రిపోర్ట్‌ తెలియజేసింది. వార్షికంగా 13% చొప్పున వృద్ధి చెందుతుందని అంచనా వేసింది. ఈ నివేదికలోని వివరాల ప్రకారం... భారతీయుల సంపద విలువ 2016–17లో 11% వృద్ధితో రూ.344 కోట్లకు చేరింది. వ్యక్తుల ఆర్థిక పరమైన ఆస్తులు 14.63 శాతం పెరుగుదలతో రూ.204 లక్షల కోట్లుగా ఉన్నాయి. డైరెక్ట్‌ ఈక్విటీల్లో 26.8% వృద్ధి చెందగా, మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఆస్తులు 39.2%, సేవింగ్స్‌ డిపాజిట్లలో 27.85 శాతం, కరెంట్‌ ఖాతాల్లోని డిపాజిట్లు 39.2% మేర వృద్ధి చెందినట్టు కార్వీ నివేదిక వెల్లడించింది.

‘‘ఈక్విటీ మార్కెట్ల బుల్‌ర్యాలీని కారణంగా ఇన్వెస్టర్లకు ఈ విభాగం ఇష్టమైన పెట్టుబడి సాధనంగా అవతరించింది. దీనికితోడు ప్రభుత్వం తీసుకున్న పలు సంస్థాగత సంస్కరణలు వ్యక్తులు ఆర్థిక సాధనాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రోత్సాహానిచ్చాయి’’ అని కార్వీ ప్రైవేటు వెల్త్‌ సంస్థ సీఈవో అభిజిత్‌భావే తెలిపారు. వ్యక్తుల సంపదలో భాగంగా నగదు, ఎన్‌ఆర్‌ఐ డిపాజిట్లు, పొదుపులు తగ్గినట్టు ఈ నివేదిక తెలిపింది. ఇవి 2015–16 వరకు ఏటా పెరుగుతూ వచ్చినవే. ఇక ముందూ ఫైనాన్షియల్‌ అసెట్స్‌ అగ్ర స్థానంలో ఉంటాయని, సమీప భవిష్యత్తులో రియల్టీ కూడా టర్న్‌ఎరౌండ్‌ అవుతుందని భావే పేర్కొన్నారు. భౌతిక ఆస్తుల్లో 91% పసిడి, రియల్టీ రూపంలోనే ఉన్నాయని ఈ నివేదిక తెలిపింది.

Advertisement
Advertisement