భారత ఆర్థిక వృద్ధి రేటుపై ఆందోళన

9 Jun, 2020 09:15 IST|Sakshi

వాషింగ్టన్‌ : భారత ఆర్థిక వృద్ధిపై  ప్రపంచ బ్యాంకు ఆందోళన వ్యక్తం చేసింది. 2020-21లో ఆర్థిక వ్యవస్థ ప్రతికూల వృద్దిని నమోదు చేస్తుందని ప్రకటించింది. ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి కారణంగా వృద్ధి రేటు  మైనస్‌  3.2 శాతానికి పడిపోతుందని  ప్రపంచ బ్యాంకు తేల్చి చెప్పింది. ఈ మేరకు  సోమవారం (నిన్న) నివేదికను విడుదల చేసింది. 

ముఖ్యంగా కరోనా వైరస్ కట్టడికి వివిధ దశల్లో విధించిన లాక్‌డౌన్‌ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపిందని ప్రపంచ బ్యాంకు తెలిపింది. ఆర్థిక కార్యకలాపాలు స్తంభించిపోవడం కోలుకోలేని దెబ్బతీసిందని పేర్కొంది.  అయితే 2021లో వృద్ధిరేటు తిరిగి పుంజుకుంటుదని పేర్కొంది. ఆర్థికవ్యవస్థపై వాస్తవ ప్రభావం 9 శాతం మేరకు ఉండవచ్చని అంచనా వేసింది. మహమ్మారి కట్టడికి తీసుకున్న చర్యల మూలంగా వినియోగం భారీగా క్షీణించిందనీ, సేవల కార్యకలాపాలు ప్రభావితమయ్యాయని తెలిపింది. అలాగే ఈ అనిశ్చితి ప్రైవేట్ పెట్టుబడులను అడ్డుకుంటుందని వ్యాఖ్యానించింది.

భారత వృద్ధిరేటు ప్రభావం ఇతర ఆసియా ఆర్థిక వ్యవస్థలపై కూడా పడుతుందని ప్రపంచ బ్యాంకు నివేదిక తెలిపింది. ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు ప్రభుత్వం తీసుకున్న ఆర్థిక ఉద్దీపన చర్యలు కొంత వరకు ఊరట నిస్తాయని,  ద్రవ్య విధానాల కొనసాగించాలని ప్రపంచ బ్యాంకు సూచించింది. మూడీస్‌, ఫిచ్‌, ఎస్‌ అండ్‌ పీ వంటి గ్లోబల్‌ సంస్థలు ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ 4 నుంచి 5 శాతం ప్రతికూల వృద్ధి అంచనాలను వెలువరించిన సంగతి తెలిసిందే. 

చదవండి : పరిస్థితి మరింత దిగజారుతోంది: డబ్ల్యూహెచ్ఓ

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు