ఇండియన్‌ బ్యాంక్‌ మొండి బాకీలు తగ్గాయ్‌..

13 Feb, 2018 01:49 IST|Sakshi

చెన్నై: ప్రభుత్వ రంగ ఇండియన్‌ బ్యాంక్‌ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో 19 శాతం తగ్గింది. గత క్యూ3లో రూ.373 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.303 కోట్లకు తగ్గిందని ఇండియన్‌ బ్యాంక్‌ తెలిపింది. పెట్టుబడులపై మార్క్‌ టు మార్కెట్‌ తరుగుదల రూ.407 కోట్లుగా ఉండడం వల్ల నికర లాభం తగ్గిందని బ్యాంక్‌ ఎమ్‌డీ, సీఈఓ కిశోర్‌ కారత్‌ తెలిపారు. ఇటీవల కాలంలో ఒక్కో క్వార్టర్‌లో మంచి ఫలితాలు సాధిస్తున్నామని, ఈ క్వార్టర్లో కూడా మంచి ఫలితాలు సాధించామని వివరించారు.

మొత్తం ఆదాయం రూ.4,557 కోట్ల నుంచి రూ.4,903 కోట్లకు పెరిగిందని తెలిపారు. రుణ నాణ్యత మెరుగుపడిందని పేర్కొన్నారు. స్థూల మొండి బకాయిలు 7.69 శాతం నుంచి 6.27 శాతానికి, నికర మొండి బకాయిలు 4.76 శాతం నుంచి 3.3 శాతానికి తగ్గాయని తెలిపారు. ఒత్తిడి రుణాలు 12.41 శాతం నుంచి 8.88 శాతానికి తగ్గాయని పేర్కొన్నారు. నికర వడ్డీ ఆదాయం 30 శాతం వృద్ధితో రూ.1,623 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు.

క్యాపిటల్‌ అడెక్వసీ రేషియో 12.44 శాతంగా ఉందని తెలిపారు. కాగా, ఇప్పటివరకూ క్యూ3 ఆర్థిక ఫలితాలను వెల్లడించిన ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల్లో తమ బ్యాంకే అత్యుత్తమ ఫలితాలను ప్రకటించిందని కారత్‌ తెలిపారు.  ఆర్థిక ఫలితాలు బాగా ఉండటంతో బీఎస్‌ఈలో ఇండియన్‌ బ్యాంక్‌ షేర్‌ 5 శాతం లాభంతో రూ.356 వద్ద ముగిసింది. 

మరిన్ని వార్తలు