పుత్తడికి అంత డిమాండ్‌ ఎందుకు?

2 May, 2019 19:46 IST|Sakshi

గ్లోబల్‌గా 7శాతం పుంజుకున్న  పసిడి డిమాండ్‌

దేశీయంగా బంగారు ఆభరణాల డిమాండ్‌ నాలుగేళ్ల గరిష్టానికి

రెండవ త్రైమాసికంలోనూ ఈ ధోరణి కొనసాగే అవకాశం 

సెంట్రల్ బ్యాంకుల వ్యూహాత్మక కొనుగోళ్లు  పసిడి డిమాండ్‌కు ఊతమిచ్చాయి. దీంతో అంతర్జాతీయంగా  2019 మొదటి త్రైమాసికంలో బంగారం డిమాండ్ 7 శాతం పెరగడానికి దోహద పడిందని  వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యుజిసి) గురువారం వెల్లడించింది.  దేశీయంగా   బంగారు ఆభరణాల డిమాండ్‌ ఏకంగా నాలుగేళ్ల గరిష్టాన్ని నమోదు చేసింది. అయితే  చైనాలో మాత్రం బంగారు ఆభరణాల  డిమాండ్ 2 శాతం క్షీణించింది.

వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ లెక్కల ప్రకారం అంతర్జాతీయంగా పసిడి డిమాండ్ దాదాపు 7శాతం పెరిగి 1,053.3 టన్నులకు చేరుకుంది. సెంట్రల్ బ్యాంకులు, ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్‌) ఇప్పటికే బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి.  భవిష్యత్తులో ఈ ట్రెండ్‌ మరింత  పెరగొచ్చని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్  మార్కెట్‌ ఇంటిలిజెన్స్‌ హెడ్‌  అలిస్టైర్ హెవిట్ తెలిపారు.
సెంట్రల్ బ్యాంకులు ఇప్పటికే సుమారు 145.5 టన్నుల పసిడిని కొనుగోలు చేశాయి. 2013 నుండి పోలిస్తే.. ఈ తొలి త్రైమాసికంలో ఇదే అత్యధికం. ఇన్వెస్టర్ల చూపు మనీ మార్కెట్ల మీద నుండి ఇతర మార్గాలకు మళ్ళడం, బంగారం మీద పెట్టుబడులు సురక్షిత పెట్టుబడులుగా భావించడం, లిక్విడ్ ఆస్తుల కోనుగోళ్లు వంటివి బంగారం డిమాండ్ పెరగడానికి కారణంగా వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ భావిస్తోంది. 

ఇక దేశీయంగా 2019 ఆర్ధిక సంవత్సర తొలి త్రైమాసికంలో దేశీయంగా పసిడి డిమాండ్ అత్యధికంగా పెరిగి 125.4 టన్నులుగా ఉంది. ఇది  4 ఏళ్ళ గరిష్టమని డబ్ల్యుజిసి తెలిపింది. భారత దేశంలో బంగారు ఆభరణాల డిమాండ్ వల్ల గ్లోబల్‌ డిమాండ్‌ 1శాతం పెరిగి 530.3 టన్నులకు చేరింది. చైనాలో బంగారు ఆభరణాల డిమాండ్‌ 184.1 టన్నులుగా ఉంది. 

ముఖ్యంగా  దేశంలో స్వార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అమల్లో ఉన్న ఎన్నికల  కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌,  సరియైన పత్రాలు లేకుండా  రూ. 50వేలకు నగదుకు తీసుకెళ్ల కూడదనే నిబంధన కూడా దేశీయ డిమాండ్‌కు తోడ్పడిందని సంస్థ తెలిపింది. అలాగే 2018 పోలిస్తే 2019 సంవత్సరం తొలి త్రైమాసికంలో అధికంగా సుమారు 21 శుభ ముహూర్తాలున్నాయని పేర్కొంది.  రెండవ త్రైమాసికంలో రానున్న అక్షయ తృతీయ,  పెళ్లిళ్ల సీజన్‌కు తోడు గత ఏడాదితో పోలిస్తే  పెరిగిన పంటల ధరలతో పుత్తడి డిమాండ్‌ మరింత పుంజుకుంటుందని వ్యాఖ్యానించింది. 

2019 తొలి త్రైమాసికంలో ఇండియాలో గోల్డ్ బార్స్ , కాయిన్స్ మీద 4శాతం డిమాండ్ పెరిగి 33.6 టన్నులుగా ఉంది. గత ఆర్ధిక సంవత్సరం ఇది 32.3 టన్నులుగా ఉండేది. అమెరికన్ మార్కెట్ల మందగమనం, ఫెడరల్ రిజర్వ్ యొక్క బదిలీ వైఖరి కారణంగా తొలి క్వార్టర్‌లో పెట్టుబడి దారులు బంగారం వైపు చూస్తున్నారు. అమెరికన్ మార్కెట్లలో తటస్థ వైఖరి కారణంగా బంగారం-ఆధారిత ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్‌ లో పసిడి కొనుగోలుకు డిమాండ్ పెరిగింది. 

2015 నుండి పోలిస్తే... ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్‌లో 5శాతం వృద్ధితో ఈ తొలి క్వార్టర్‌లో బంగారం డిమాండ్ 125.4 టన్నులుగా ఉందని గోల్డ్ కౌన్సిల్ వర్గాలు పేర్కొన్నాయి.   ప్రస్తుతం ఉన్న పరిస్థితుల బట్టి చూస్తే రానున్న కాలంలో 10 గ్రాముల బంగారం ధర రూ. 35వేల మార్కును దాటొచ్చని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా.

మరిన్ని వార్తలు