వృద్ధి మళ్ళీ 5 % లోపే.......

31 May, 2014 02:01 IST|Sakshi
వృద్ధి మళ్ళీ 5 % లోపే.......

న్యూఢిల్లీ: భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు గడచిన ఆర్థిక సంవత్సరం (2013-14)లోనూ నిరాశనే మిగిల్చింది. 2012-13కన్నా కాస్త బాగున్నప్పటికీ, 5 శాతం దిగువనే కొనసాగింది. 4.7 శాతంగా నమోదయ్యింది. సీఎస్‌ఓ తొలి అంచనాలు 4.9 శాతం కన్నా ఇది తక్కువ.  మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో వృద్ధి రేటు 4.6 శాతంగా ఉంది.  కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్‌ఓ) శుక్రవారం తాజా ఫలితాలను విడుదల చేసింది. 2012-13లో వృద్ధి రేటు దశాబ్దపు కనిష్ట స్థాయి 4.5%.  అంటే వరుసగా రెండేళ్లు జీడీపీ వృద్ధి రేటు 5 శాతం దిగువన ఉంది.

 

ఇలాంటి పరిస్థితి చోటుచేసుకోవడం 25 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. 2013-14 నాలుగు త్రైమాసికాల్లో వృద్ధి రేట్లు వరుసగా... 4.7%, 5.2%, 4.6%, 4.6%గా నమోదయ్యాయి. 2012-13లో ఈ రేట్లు వరుసగా 4.5 శాతం, 4.6 శాతం, 4.4 శాతం, 4.4 శాతంగా ఉన్నాయి.

 రంగాల వారీగా...
 తయారీ: గడచిన ఆర్థిక సంవత్సరం 4వ త్రైమాసికంలో అసలు వృద్ధి నమోదుచేసుకోలేదు.  ఈ రంగం రేటు క్షీణతలో 1.4 శాతంగా నమోదయ్యింది. 2012-13లో ఈ రంగం వృద్ధి రేటు 3 శాతం. ఇక మొత్తం ఆర్థిక సంవత్సరాన్ని చూసుకుంటే కూడా ఈ రంగం 1.1% వృద్ధి నుంచి క్షీణతలో మైనస్ (-) 0.7 శాతంగా నమోదయ్యింది. మొత్తం జీడీపీలో తయారీ రంగం వాటా దాదాపు 14%.

 మైనింగ్, క్వారీయింగ్: మార్చి క్వార్టర్‌లో క్షీణతలోనే కొనసాగింది. అయితే ఈ క్షీణత మైనస్ 4.8 శాతం నుంచి మైనస్ 0.4 శాతానికి తగ్గింది. ఆర్థిక సంవత్సరం మొత్తంమీద కూడా ఈ రంగం క్షీణత 2.2 శాతం నుంచి 1.4 శాతానికి పరిమితమయ్యింది.

వ్యవసాయం: వృద్ధి రేటు నాల్గవ త్రైమాసికంలో భారీగా 1.6 శాతం నుంచి 6.3 శాతానికి చేరింది. ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు 1.4 శాతం నుంచి 4.7 శాతానికి చేరింది. జీడీపీలో ఈ రంగం వాటా దాదాపు 13 శాతం.

నిర్మాణం: జనవరి-మార్చి తైమాసికంలో ఈ రంగంలో వృద్ధి రేటు 2.4 శాతం నుంచి 0.7 శాతానికి పడిపోయింది. ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు 1.1 శాతం నుంచి 1.6 శాతానికి ఎగసింది.

వాణిజ్యం, హోటెల్స్, రవాణా, కమ్యూనికేషన్లు: ఈ విభాగం వృద్ధి క్యూ4లో 4.8 శాతం నుంచి 3.9 శాతానికి మందగించింది. ఆర్థిక సంవత్సరంలో కూడా 5.1 శాతం 3 శాతానికి జారింది.

సేవలు (ఫైనాన్షింగ్, బీమా, రియల్టీ): క్యూ4లో వృద్ధి రేటు 11.2 శాతం నుంచి 12.4 శాతానికి చేరింది. ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు 10.9 శాతం నుంచి 12.9 శాతానికి ఎగసింది. మొత్తం జీడీపీలో ఈ రంగం వాటా దాదాపు 55 శాతం.

కమ్యూనిటీ, సామాజిక, వ్యక్తిగత సేవలు: క్యూ4లో ఈ రంగం వాటా 2.8 శాతం నుంచి 3.3 శాతానికి చేరింది. ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 5.3 శాతం నుంచి 5.6 శాతానికి చేరింది.

 విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా: మార్చి క్వార్టర్‌లో వృద్ధి రేటు భారీగా 0.9% నుంచి 7.2 శాతానికి చేరింది. ఆర్థిక సంవత్సరం మొత్తంలో కూడా ఈ రేటు 2.3% నుంచి 5.9 శాతానికి ఎగసింది.
 
 తలసరి ఆదాయం ఇలా...

 జాతీయ నికర తలసరి ఆదాయం (2004-05 ధరలను ప్రాతిపదికగా తీసుకుని) గడచిన రెండు ఆర్థిక సంవత్సరాల కాలంలో రూ.38,856 నుంచి రూ. 39,904 కు పెరిగింది. అంటే 2.7 శాతం వృద్ధి నమోదయ్యిందన్నమాట.  2012-13లో ఈ వృద్ధి రేటు 2.1 శాతమే. ప్రస్తుత ధరల ప్రాతిపదికగా తీసుకుంటే జాతీయ తలసరి ఆదాయం రూ.67,839 నుంచి రూ.74,380 కి చేరింది.

మరిన్ని వార్తలు