దివీస్‌లో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌!

3 Jul, 2020 00:39 IST|Sakshi

సీఎఫ్‌వోతోపాటు ఇతరులకు సెబీ జరిమానా

సాక్షి, హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడ్డారన్న అభియోగంపై దివీస్‌ ల్యాబొరేటరీస్‌ సీఎఫ్‌వోతోపాటు ఇతరులకు మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్‌చేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబీ) రూ.96 లక్షలకుపైగా జరిమానా విధించింది. సీఎఫ్‌వో ఎల్‌.కిశోర్‌బాబు, ఆయన కుమారుడు, సన్నిహితులు 2017లో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని సెబీ వెల్లడించింది. సీఎఫ్‌వోతోపాటు ప్రవీణ్‌ లింగమనేని, నగేశ్‌ లింగమనేని, శ్రీలక్ష్మి లింగమనేని, డి.శ్రీనివాస రావు, రాధిక ద్రోణవల్లి, గోపీచంద్‌ లింగమనేని, పుష్పలత దేవి ఇన్‌సైడర్లుగా సెబీ గుర్తించింది.

వీరు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ చేశారని సెబి తన ఆదేశాల్లో తెలిపింది. విశాఖ యూనిట్‌–2పై ఉన్న ఇంపోర్ట్‌ అలర్ట్‌ను యూఎస్‌ఎఫ్‌డీఏ ఎత్తివేయనుందంటూ దివీస్‌ 2017 జూలై 10న మార్కెట్‌ సమయంలో ప్రకటించింది. స్టాక్స్‌పై ప్రభావం చూపే ఈ విషయాన్ని కిశోర్‌ బాబు ముందే లీక్‌ చేసి ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని సెబీ  చెబుతోంది. జూలై 7–10 మధ్య జరిగిన ట్రేడింగ్‌పై సెబీ విచారణ జరిపింది. జూలై 7న దివీస్‌ షేరు ధర రూ.680 నమోదైంది. జూలై 10న ఇది రూ.734కి చేరింది.

ప్రొహిబిషన్‌ ఆఫ్‌ ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ రెగ్యులేషన్స్‌ ప్రకారం షేర్ల కొనుగోళ్లకు కావాల్సిన ప్రి–క్లియరెన్స్‌ కోసం సీఎఫ్‌వో, ఆయన కుమారుడు ప్రవీణ్‌ లింగమనేని దరఖాస్తు చేయలేదని విచారణలో తేలింది. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ నిబంధనలను వీరు అతిక్రమించారని సెబీ విచారణలో తేలింది. ఈ ఎనిమిది మంది 30 రోజుల్లో స్పందించాలని సెబి ఆదేశించింది. ఈ మొత్తం మేరకు వీరి ఖాతాలను స్తంభింపజేయాలని బ్యాంకులను ఆదేశించింది. విచారణ పూర్తి అయ్యే వరకు వీరు ఆస్తులను విక్రయించరాదని స్పష్టం చేసింది.  

మరిన్ని వార్తలు