ఇన్‌స్టంట్‌ లోన్... ఒక్క నిమిషం.!

19 Aug, 2019 08:11 IST|Sakshi

ఆన్‌లైన్‌లో నిమిషాల్లోనే రుణాలు పెద్దగా శ్రమ కూడా అక్కర్లేదు

కానీ, రుణ ఒప్పందంలో ఎన్నో షరతులు ముందస్తు చెల్లింపు చార్జీలు

ఆలస్యపు చెల్లింపులపై పెనాల్టీలు ప్రాసెసింగ్‌ ఫీజులు, వడ్డీ రేటు

అన్నీ పరిశీలించుకున్నాకే నిర్ణయం

ప్రతికూల షరతుల రుణానికి దూరంగా ఉండాలి

కేవలం కొన్ని నిమిషాలు వెచ్చిస్తే చాలు... ఆన్ లైన్లో అప్పటికప్పుడు కోరినంత రుణాన్ని (పర్సనల్‌ లోన్ ) పొందే ఆప్షన్లు నేడు ఎన్నో. అవసరానికి అరువు లభిస్తుంది కదా అని సరైన విచారణలు చేసుకోకపోతే ఆ తర్వాత విచారించాల్సి వస్తుంది. ఇన్ స్టంట్‌ పర్సనల్‌ లోన్  ఒక్క క్లిక్‌తో అంటూ మీ మెయిల్‌ బాక్స్‌కి వచ్చే సందేశాలను చూసే ఉంటారు. ఆ సమయంలో డబ్బు అవసరాలు ఉన్న వారు అయితే ఆ అవకాశాన్ని సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. నేటి తరం యువత ఆన్‌లైన్‌లో సునాయాసంగా లభించే ఇన్ స్టంట్‌ రుణాల పట్ల ఎంతో ఆకర్షితులు అవుతున్నారు. ఎందుకుంటే ఉన్న చోట నుంచి కదలక్కర్లేదు. డాక్యుమెంట్లు పట్టుకుని రుణం కోసం తిరగాల్సిన శ్రమ కూడా ఇందులో ఉండదు. రుణానికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ అంతా స్మార్ట్‌ఫోన్ నుంచే పూర్తి చేసుకోవచ్చు. రోజుల నుంచి, నెలల వ్యవధిలో తీసుకున్న రుణాన్ని తీర్చి వేయవచ్చు. కానీ, వీటి విషయంలో తగినంత సమాచారాన్ని తెలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవడం మంచిదన్నది నిపుణుల సూచన.  

పెద్దగా కష్టం లేకుండానే...
‘‘సులభంగా, తక్షణమే రుణాలు కోరుకునే వారికి ఆన్ లైన్ ప్లాట్‌ఫామ్‌లు ఆకర్షణీయంగా ఉన్నాయి. ఎక్కువ పేపర్‌ పని లేకుండా, తిరగాల్సిన శ్రమ ఇందులో ఉండదు’’అని మైలోన్ కేర్‌ డాట్‌ ఇన్‌ వ్యవస్థాపకుడు, సీఈవో గౌరవ్‌గుప్తా తెలిపారు. కొన్ని సంస్థలు క్రెడిట్‌ హిస్టరీ లేని వారికి కూడా రుణాలు ఇచ్చేందుకు ముందుకు వస్తుండడం గమనార్హం. ‘‘ఇన్‌స్టంట్‌ ఆన్ లైన్  రుణాలు వేగంగా ప్రాసెస్‌ చేసి జారీ చేసేవి. దీంతో అర్హతల నిబంధనలు మరింత సులభంగా ఉంటున్నాయి. అప్పటి వరకు ఎటువంటి రుణాలు తీసుకోని కొత్త వారికి క్రెడిట్‌ హిస్టరీ కూడా ఏర్పడడం లేదు’’ అని బ్యాంక్‌ బజార్‌ సీఈవో ఆదిల్‌శెట్టి తెలిపారు. 

పరిశీలించిన తర్వాతే...
ఆన్ లైన్ లో ఎంతో సులభంగా, సౌకర్యంగా రుణం లభిస్తుంటే ఎవరైనా కాదనగలరా..? కానీ, ఒక్క క్లిక్‌తో రుణం తీసుకోకుండా, దానికి ముందు చూడాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. రుణం ఎటువంటిది అయినా కానీ, దానిపై వడ్డీ, ఇతర చార్జీలను తీసు కునే వారు భరించాల్సి ఉంటుంది. తీసుకునే మొత్తాన్ని తాము సకాలంలో తిరిగి చెల్లించగలమా..? అన్న పరిశీలన కూడా అవసరం. ‘‘మీకు అవసరం ఉన్నంత వరకే రుణం తీసుకోవాలి. అంతేకానీ, అర్హత ఉన్నంత తీసుకోరాదు. తిరిగి చెల్లించే ప్రణాళిక కూడా మీ వద్ద ఉండాలి. సకాలంలో ఈఎంఐలు కూడా చెల్లించడం ఎంతో ముఖ్యం. ఆలస్యపు చెల్లింపులు, సకాలంలో చెల్లించకపోవడాలు, పరిష్కారాలు అన్నీ కూడా క్రెడిట్‌ స్కోరును దెబ్బతీసేందుకు కారణమవుతాయి. దీంతో భవిష్యత్తులో రుణం పొందడం కష్టంగా మారుతుంది’’ అని ఆదిల్‌ శెట్టి వివరించారు.

భిన్న చార్జీలు
ఆన్‌లైన్లో వేగంగా రుణం తీసుకునే హడావుడిలో ఈఎంఐకు అదనంగా చెల్లించాల్సిన చార్జీల గురించి కొందరు తెలుసుకునే ప్రయత్నం చేయరు. ఆన్‌లైన్  లెండింగ్‌ ప్లాట్‌ఫామ్‌లు రిజిస్ట్రేషన్  ఫీజు లేదా ప్రాసెసింగ్‌ ఫీజును వసూలు చేస్తుంటాయి. రుణంతోపాటు కలిపి వీటిని రుణగ్రహీతల నుంచే వసూలు చేస్తాయి. ఈ చార్జీలపై అవగాహన లేకపోతే రుణం తీసుకోవడానికి ముందుగా సంబంధిత సంస్థను అడిగి పూర్తి వివరాలు తెలుసుకోవాలి. మెయిల్‌ బాక్స్‌లో లేదా మొబైల్‌కు ఎస్‌ఎంఎస్‌ రూపంలో వచ్చిన లోన్ ఆఫర్‌ను చూసి తొందరపడిపోకుండా, అది మంచి ఆఫర్‌ అవునో, కాదో విచారించుకోవడం ఎంతో అవసరం. కొన్ని సందర్భాల్లో మంచి ఆఫర్‌ వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ‘‘ఇన్ స్టంట్‌ రుణాలు కూడా ఇతర రుణాల మాదిరే. వీటిని తీసుకునే ముందు తగినంత అధ్యయనం, రుణ నిబంధనలు, వడ్డీ రేటు, ప్రాసెసింగ్‌ ఫీజు, ఇన్సూరెన్స ప్రీమియం, ముందస్తు చెల్లింపులపై పెనాల్టీ వంటి చార్జీలను ఇతర సంస్థలతో పోల్చి చూసుకోవాలి’’ అని గౌరవ్‌గుప్తా సూచించారు. రుణం తీసుకుంటే, ప్రతి నెలా నిర్ణీత మొత్తం ఈఎంఐ రూపంలో చెల్లించేందుకు చట్టబద్ధంగా కట్టుబడినట్టేనని గుర్తించాలి. అంతేకాదు, తిరిగి మీ చెల్లింపుల సామర్థ్యం ఆ మేరకు లాక్‌ అయినట్టు భావించాలి. ఉదాహరణకు ప్రతీ నెలా ఈఎంఐ రూపంలో మీరు రూ.20,000 చెల్లించగలరని అనుకుంటే, అప్పటికే కొంత రుణం తీసుకుని రూ.4,000 చెల్లిస్తుంటే, అప్పుడు మీ మిగిలిన చెల్లింపుల సామర్థ్యం రూ.16,000గానే అనుకోవాలి. 

అవసరం లేకపోతే...
నిజమైన అవసరం లేకపోయినా కొన్ని సందర్భాల్లో సంపన్న అవసరాల కోసం రుణాలు తీసుకునే వారూ ఉన్నారు. కానీ, దీని వల్ల వైద్య చికిత్సల వంటి అత్యవసర సందర్భాల్లో రుణానికి ఇబ్బందులు ఎదురుకావచ్చు. ‘‘వివేకంతో రుణాలు తీసుకోవడం ఆస్తులు సమకూర్చుకోవడానికి సాయపడొచ్చు. సకాలంలో చెల్లించడం వల్ల క్రెడిట్‌ స్కోరును కూడా పెంచుకోవచ్చు. సకాలంలో చెల్లింపులు చేయకపోతే విధించే పెనాల్టీలు భారీగా ఉంటాయి. మీ ఆదాయంలో రుణ ఈఎంఐ 25–40 శాతం మించకుండా చూసుకోవడం మంచిది. ఇంతకు మించితే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని ఆదిల్‌ శెట్టి సూచించారు. చాలా సందర్భాల్లో రుణాలిచ్చే సంస్థలు ముందుగా రుణాన్ని తీర్చివేస్తే భారీ చార్జీల విధింపు వంటి షరతులు పెడుతున్నాయి. ఇలాంటి షరుతులు రుణాన్ని ఖరీదుగా మార్చేస్తాయని తెలుసుకోవాలి. కొన్ని సంస్థలు అయితే ముందుగా ఓ నిర్ణీత కాలం వరకు రుణాన్ని తీర్చివేసేందుకు కూడా అనుమతించడం లేదు. ఈ తరహా ప్రతికూల షరతులు రుణ ఒప్పందంలో ఉన్నాయా, లేవా అన్న నిర్ధారణ రుణం తీసుకోవడానికి ముందు తెలుసుకోవాలి.

మరిన్ని వార్తలు