కార్డులెస్.. లైసెన్స్

13 Sep, 2023 13:07 IST|Sakshi

వాహనంపై వెళుతున్నప్పుడు ఎక్కడో ఒకచోట విధుల్లో ఉన్న ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ లేదా రవాణాశాఖ అధికారులు ఆపి డ్రైవింగ్‌ లైసెన్స్, ఆర్‌సీ చూపించు అని అడుగుతుంటారు. ఆ సమయంలో పత్రాలు అందుబాటులో లేని వాళ్లు సార్‌ ఇంట్లో పెట్టి వచ్చాననో, మర్చిపోయాననో చెప్పి అక్కడి నుంచి బయటపడుతుంటాం. కానీ ఇక నుంచి ఆ ఇబ్బంది లేదు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ల జారీకి రవాణాశాఖ నూతన విధానాన్ని తీసుకొచ్చింది. డ్రైవింగ్‌ లైసెన్స్, ఆర్‌సీ వంటివి మన ఫోన్‌లోనే భద్రపరుచుకుని, తనిఖీల సమయంలో చూపించే వెసులుబాటు కలి్పంచింది.  

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు: డ్రైవింగ్‌ లైసెన్స్‌లు, వాహనాల ఆర్‌సీల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి రవాణాశాఖ ఇటీవల వరకు డ్రైవింగ్‌ టెస్టులు నిర్వహించి లైసెన్స్‌లు జారీ చేసేది. టూ వీలర్, ఫోర్‌ వీలర్, హెవీ వెహికల్‌ లైసెన్స్‌లు.. ఇలా పలురకాల లైసెన్స్‌లను మంజూరు చేసేది. ఇందుకోసం రవాణా శాఖ ప్రత్యేకంగా తయారు చేసిన కార్డులను ప్రింట్‌ చేసి లైసెన్స్‌ కార్డులుగా ఇప్పటి వరకు ఇస్తూ వచ్చింది. దీని కోసం పోస్టల్‌ చార్జీలు, లైసెన్స్‌ ఫీజు కింద రూ.235 వరకు చెల్లించాల్సి ఉండేది. అయితే ప్రస్తుతం రవాణాశాఖ ఈ విధానానికి స్వస్తి పలికింది.

కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా కొత్త విధానాన్ని ఆగస్టు 1వ తేదీ నుంచి అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం కార్డు లెస్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌లను మంజూరు చేస్తున్నారు. లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసుకున్న వాహనదారుడికి అన్ని డ్రైవింగ్‌ టెస్టులు నిర్వహించిన తరువాత లైసెన్స్‌ను మంజూరు చేస్తారు. అయితే నూతన విధానంలో ఎలాంటి కార్డులు ఇవ్వకుండా కేవలం ఆన్‌లైన్‌లో రవాణాశాఖ మంజూరు చేసిన లైసెన్స్‌ పత్రాలను వాహనదారుడి ఫోన్‌కు పంపుతారు. ఆ పత్రాలను వాహనదారుడే నేరుగా ప్రింట్‌ తీసుకోవచ్చు లేదా తన ఫోన్‌లోనే భద్రపరుచుకోవచ్చు. అధికారులు అడిగినప్పుడు ఫోన్‌లోనే తన డ్రైవింగ్‌ లైసెన్స్‌ను చూపే అవకాశాన్ని కలి్పంచారు. ఈ విధానంలో లైసెన్స్‌ కోసం వాహనదారుడు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. 

దేశంలో ఎక్కడైనా తనిఖీకి వీలు  
దేశం మొత్తం ఒకే డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండేలా కేంద్ర ప్రభుత్వం నూతన విధానాన్ని తీసుకొచ్చింది. ఈ విధానాన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలా వద్దా అనే వెసులుబాటును రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ విధానానికి అనుగుణంగా నూతన డ్రైవింగ్‌ లైసెన్స్‌ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ లైసెన్స్‌ పత్రాలను మన ఫోన్‌లో, డిజి లాకర్‌లోనూ భద్రపరుచుకోవచ్చు.

రవాణాశాఖ మంజూరు చేసే ఈ పత్రాలను దేశంలో ఎక్కడైనా తనిఖీల సమయంలో అధికారులకు చూపించవచ్చు. సదరు అధికారికి ఏదైనా సందేహం ఉంటే వెంటనే ఆన్‌లైన్‌లో చెక్‌ చేస్తే సదరు వాహనదారుడికి సంబంధించి పూర్తి సమాచారం ఉంటుంది. పాత విధానంలో ఈ సదుపాయం ఉండేది కాదు. వాహనదారుడి వివరాలు తెలుసుకోవడం, లైసెన్స్‌ సరైనదా కాదా అని పరిశీలించడం కాస్త కష్టతరంగా ఉండేది. కానీ నూతన విధానంలో తనిఖీ అధికారులు వాహనదారుడి పూర్తి సమాచారం క్షణాల్లో పొందవచ్చు. ఈ విధానం తనిఖీలకు సులభతరంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. 

డ్రైవింగ్‌ లైసెన్స్‌కి కార్డులు ఉండవు  
నూతన విధానంలో లైసెన్స్‌ల మంజూరు చేసిన తరువాత ఎలాంటి ప్రింటెడ్‌ కార్డులు ఇవ్వరు. కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే లైసెన్స్‌ పత్రాలను పంపుతారు. వీటిని వాహనదారుడు ప్రింట్‌ తీసుకుని తన వద్ద ఉంచుకోవచ్చు. అలాగే ఫోన్‌లో కూడా భద్రపరుచుకోవచ్చు. అధికారుల తనిఖీల సమయంలో ఈ పత్రాలను చూపితే సరిపోతుంది.                            – ఎస్‌కే ఎండీ రఫి, ఎంవీఐ, కందుకూరు  

మరిన్ని వార్తలు