నిధుల సమీకరణకు

28 Dec, 2014 00:27 IST|Sakshi
నిధుల సమీకరణకు

బీమా ఆర్డినెన్స్ తోడ్పాటు

న్యూఢిల్లీ: బీమా కంపెనీలు బీమా రంగ సంస్కరణలకు సంబంధించి ఆర్డినెన్స్ జారీతో ఇన్సూరెన్స్ కంపెనీలు కొంగొత్త, వినూత్నమైన సాధనాల ద్వారా నిధుల సమీకరణకు మరింత వెసులుబాటు లభించగలదని కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. అలాగే ఆర్థిక వృద్ధికి, ఉపాధి కల్పనకూ తోడ్పడుతుందని తెలిపింది. భారీ పెట్టుబడులు అవసరమైన బీమా కంపెనీలు తమ వ్యాపార వృద్ధికి అవసరమైన నిధులను సమీకరించుకోవడానికి వీలు కల్పించేలా ఆర్డినెన్స్‌లో నిబంధనలు పొందుపర్చినట్లు ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.

బీమా చట్టాల (సవరణ) ఆర్డినెన్స్ 2014ని ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే తదుపరి పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. దేశీ బీమా కంపెనీల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 26 శాతం నుంచి 49 శాతానికి పెంచడం ఈ ఆర్డినెన్స్ ప్రధానోద్దేశం. దీనితో సుమారు 7-8 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 50,000 కోట్లు) నిధులు బీమా రంగంలోకి రాగలవని అంచనా. దేశ ఎకానమీ.. ముఖ్యంగా బీమా రంగంలో మరిన్ని సంస్కరణలను ప్రవేశపెట్టే దిశగా ఆర్డినెన్స్ ఉపకరించగలదని ఆర్థిక శాఖ వివరించింది. పెట్టుబడులు, ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పన లక్ష్యాల సాధనకు అనుగుణంగా ఇన్వెస్టర్లకు అనుకూలమైన పరిస్థితులు కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

మరిన్ని వార్తలు