పలు డెబిట్‌ కార్డులను బ్లాక్‌ చేసిన ఐఆర్‌సీటీసీ

22 Sep, 2017 15:42 IST|Sakshi
పలు డెబిట్‌ కార్డులను బ్లాక్‌ చేసిన ఐఆర్‌సీటీసీ

సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ రైల్వేకు చెందిన ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ)  డెబిట్‌ కార్డు వినియోగదారులకు షాక్‌ ఇచ్చింది.  కొన్ని బ్యాంకుల డెబిట్‌ కార్డుల పేమెంట్‌ గేట్‌వేను బ్లాక్‌ చేసింది. కన్‌వీనియన్స్‌ ఫీజు కారణంగా  పలు బ్యాంకుల  డెబిట్‌కార్డు లావాదేవీలను నిలిపివేసింది. ప్రస్తుతానికి ఆరు బ్యాంకులు తప్ప మిగిలిన అనేక బ్యాంకులకు చెందిన కార్డు వినియోగదారులకు  అసౌకర్యం కలగనుంది.

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, కెనరా బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌తో సహా ఆరు బ్యాంకుల కార్డుదారుల కార్డు చెల్లింపులను మాత్రమే అనుమతిస్తోంది. డీమానిటైజేషన్‌ తరువాత  కస్టమర్లనుంచి వసూలు చేసే రూ.20 ఫీజును రద్దు చేసింది. అయితే  ఈ ఫీజులో బ్యాంకుల వంతుగా చెల్లించాల్సిన (సగం)సొమ్మును ఆయా  బ్యాంకులు చెల్లించకపోవడంతో ఐఆర్‌సీటీసీ  ఈ నిర్ణయం తీసుకుంది.

మరోవైపు  దీనిపై భారతీయ బ్యాంకుల అసోసియేషన్ (ఐబీఏ),   ఐఆర్‌సీటీసీ, ఇండియన్ రైల్వేశాఖతో చర్చించనున్నట్లు మీడియా నివేదికలు పేర్కొన్నాయి.
 

మరిన్ని వార్తలు