దేశీ అవకాశాలతో... ఐటీ తొలగింపులకు కళ్లెం!!

18 May, 2017 01:37 IST|Sakshi
దేశీ అవకాశాలతో... ఐటీ తొలగింపులకు కళ్లెం!!

ముంబై: ఐటీ కంపెనీలు స్థానిక అవకాశాలను అందిపుచ్చుకొని, తద్వారా ఉద్యోగ తొలగింపులను తగ్గించుకోవాలని పరిశ్రమ సమాఖ్య అసోచామ్‌ సూచించింది. 155 బిలియన్‌ డాలర్ల విలువైన ఐటీ పరిశ్రమలో ప్రస్తుతం ఉద్యోగాల తొలగింపు భయాలు నెలకొన్న విషయం తెలిసిందే. ‘మన ఐటీ కంపెనీలు దేశీ మార్కెట్‌పై దృష్టి పెట్టడానికి ఇదే సరైన సమయం. విదేశీ మార్కెట్లలో పరిస్థితులు బాగోలేవు. అందుకే ఇక్కడి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ప్రయత్నించాలి. వ్యూహాలను సమీక్షించుకోవాలి. దీనివల్ల కనీసం ఉద్యోగాల కోత ను కొంతైనా తగ్గించుకోవచ్చు’ అని వివరించింది.

జన్‌ధన్, ఆధార్‌ సేవలతో అవకాశాలు..
భారత్‌లో అవకాశాలు అస్థిరమైనవని, సింగిల్‌ డిజిట్‌ రెవెన్యూనే కష్టమని, పేమెంట్స్‌ చెల్లింపుల్లో సమస్యలు ఉంటాయని ఐటీ కంపెనీలు పేర్కొంటున్నాయి. అయితే జన్‌ధన్‌ యోజన, ఆధార్‌ ఆధారిత సర్వీసుల వల్ల అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని అసోచామ్‌ పేర్కొంది. వీటి ద్వారా ఎఫ్‌ఎంసీజీ, ఆటో, టెలికం, ఇన్సూరెన్స్, అగ్రి రంగాల్లో ప్రతిఫలం పొందొచ్చని తెలిపింది. టెక్‌ కంపెనీలు దేశీ మార్కెట్‌పై దృష్టిపెట్టడం వల్ల అటు ఐటీ పరిశ్రమతోపాటు, ఇటు దేశం కూడా వృద్ధి దిశగా పయనిస్తాయని పేర్కొంది.

లక్షల ఉద్యోగాలు సృష్టించొచ్చు!!
స్థానికంగా అందుబాటులో ఉన్న అవకాశాలను ఉపయోగించుకుంటే.. ఇక్కడ కొన్ని లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించొచ్చని అసోచామ్‌ సెక్రటరీ జనరల్‌ డి.ఎస్‌.రావత్‌ తెలిపారు. కొత్త టెక్నాలజీలు, విదేశీ మార్కెట్లలోని అస్థిరతల వల్ల కలిగిన నష్టాల నుంచి గట్టేక్కవచ్చని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు