ఐటీలో వలసల జోరు...

12 May, 2015 00:50 IST|Sakshi
ఐటీలో వలసల జోరు...

రికార్డు స్థాయికి చేరిన అట్రిషన్ రేటు
బోనస్‌లు, ప్రమోషన్లు, ఐఫోన్లతో ఉద్యోగులకు తాయిలాలు
తగ్గుతున్న కొత్త ఉద్యోగాలు; ఈ ఏడాది 2 లక్షల మందికే అవకాశాలు
12%కి పరిమితం కానున్న ఐటీ రంగ వృద్ధి

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రమేష్ ఓ మల్టీ నేషనల్ కంపెనీ హెచ్ విభాగంలో హైదరాబాద్ యూనిట్‌కి అధిపతిగా పనిచేస్తున్నాడు. వార్షిక జీతం రూ.12 లక్షలు. సడెన్‌గా ఒకరోజు... రేపటి నుంచి విధులకు రానక్కరలేదంటూ మెయిల్ వచ్చింది.  

రమేష్ స్థానంలో అతని కింద పనిచేస్తున్న ఉద్యోగికి ప్రమోషన్ ఇచ్చి హెచ్‌ఆర్ హెడ్‌గా నియమించారు. ఇలా మార్పు చేయడం వల్ల కంపెనీకి ఏటా రూ.4 లక్షల మిగులు కనిపించింది. వ్యయాలు తగ్గించుకోవడానికి ప్రస్తుతం ఐటీ కంపెనీలు అనుసరిస్తున్న సూత్రమిది. ప్రొడక్ట్ నిపుణుల విషయంలో కాస్తంత ఆచితూచి కొద్దిమంది విషయంలోనే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుండగా... సపోర్టింగ్ విభాగాల్లో మాత్రం ఇదే తీరు అనుసరిస్తున్నారు.

ఇందులో భాగంగా ఇప్పటికే టీసీఎస్ వంటి ప్రధాన కంపెనీలు భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించటం కూడా ఇటీవలి పరిణామమే. కంపెనీలు ఉద్యోగుల తొలగింపుపై దృష్టి సారించడంతో ఎంట్రీ లెవెల్‌లో నైపుణ్యం ఉన్న ఉద్యోగులకు డిమాండ్ ఏర్పడుతోంది. దీంతో కంపెనీల మధ్య ఉద్యోగుల వలసలు (అట్రిషన్ రేటు) ప్రస్తుతం రికార్డు స్థాయికి చేరింది.  నాస్కామ్ అంచనాల ప్రకారం అట్రిషన్ రేటు సగటున 15 శాతం ఉంది. కానీ ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్, విప్రో వంటి పెద్ద కంపెనీల్లో ఇంతకంటే అధికంగా ఉంది.
 
దీంతో పలు కంపెనీలు ఉద్యోగులకు పదోన్నతులివ్వటం, బోనస్‌లు మంజూరు చేయటంతో పాటు ఐఫోన్ల వంటి బహుమతులు కూడా ఇస్తుండటం గమనార్హం. ఇటీవలే టసీఎస్ తన ఉద్యోగులకు భారీ బోనస్ ప్రకటించగా, ఇన్ఫోసిస్ 5,000 మంది ఉద్యోగులకు పదోన్నతులు, మంచి పనితీరు కనపర్చిన 3,000 మందికి ఐఫోన్లను బహుమతిగా అందించింది. ఉద్యోగల వలసలను అరికట్టడానికే కంపెనీలు ఈ విధమైన తాయిలాలను ప్రకటిస్తున్నాయని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా కంపెనీల వ్యయ నియంత్రణకి తోడు, కొత్త టెక్నాలజీ ఫ్లాట్‌ఫామ్‌పై పనిచేయాలన్న తాపత్రయం కూడా ఈ వలసలకు ప్రధాన కారణంగా చెబుతున్నారు.

ఈ  ఏడాది కూడా అట్రిషన్ రేటు ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉందని, దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నాస్కామ్ ప్రెసిడెంట్ బి.వి.ఆర్ మోహన్ రెడ్డి చెప్పారు. ఇప్పుడు యువత మానసిక ధోరణిలో చాలా మార్పు వచ్చిందని, ఎక్కువ కాలం ఒకే కంపెనీలో పని చేయడం లేదని, అలాగే సాంకేతిక పరిజ్ఞానం పెంచుకోవడానికి, కొత్త టెక్నాలజీ రంగాల్లోకి మారుతుండటం ఈ వలసలు పెరగడానికి కారణమన్నారు. ఈ మధ్య కాలంలో కొత్త టెక్నాలజిలో అందుబాటులోకి రావడం, అవకాశాలు పెరగడం అట్రిషన్ పెరగడానికి ప్రధాన కారణంగా పోగ్రెసివ్ సాఫ్ట్‌వేర్ వైస్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డెరైక్టర్ రమేష్ లోగనాథన్ పేర్కొన్నారు.
 
తగ్గనున్న ఉద్యోగాల కల్పన...
అమెరికా వృద్ధి రేటు అనుకున్నంతగా పెరగకపోవటం, కంపెనీల్లో ఆటోమేషన్ పెరగటంతో ఈ ఏడాది ఐటీ ఉద్యోగార్థులకు తీవ్ర నిరాశ ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. 15 లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థుల్లో రెండు లక్షల మందికి మించి ఉద్యోగాలు లభించకపోవచ్చని అంచనా. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచే ఏటా 2.5 లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు బయటకు వస్తున్నారు. గతంలో ప్రతీ రూ.1,000 కోట్ల టర్నోవర్‌కు 500 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తే ఇప్పుడు ఆటోమేషన్ వల్ల ఆ స్థాయిలో ఉద్యోగాలు కల్పించలేకపోతున్నట్లు మోహన్ రెడ్డి చెప్పారు.

గతేడాది ఐటీ రంగంలో కొత్తగా 2.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించగా అది ఈ ఏడాది రెండు లక్షలకు పరిమితం కావచ్చని అంచనా వేస్తున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఐటీ ఉద్యోగుల సంఖ్య 32 లక్షలుగా ఉంటే అది ఏ డాది 34 లక్షలకు చేరుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. డాలరుతో పోలిస్తే ఇతర దేశాల కరెన్సీ విలువలు బాగా తగ్గడంతో ఈ ఏడాది ఐటీ రంగ వృద్ధి సింగిల్ డిజిట్‌కే పరిమితమవుతుందని, అదే రూపాయి విలువతో పోలిస్తే 12% దాటకపోవచ్చనేది నాస్కామ్ అంచనా. గతేడాది వ్యాపారంలో 11% వృద్ధి నమోదైతే ఉద్యోగాల కల్పన 7%కి పరిమితమయ్యింది.

మరిన్ని వార్తలు