బీదర్ టు సిటీ

12 May, 2015 00:46 IST|Sakshi
బీదర్ టు సిటీ

- బాకర్.. డేంజర్ స్నాచర్!
- రెండున్నరేళ్లలో 102 స్నాచింగ్‌లు
- టాస్క్‌ఫోర్స్‌కు చిక్కిన ఇరానీ గ్యాంగ్ లీడర్
- రూ.కోటి విలువైన 3.46 కిలోల బంగారం స్వాధీనం

ఓ సినిమాలో కమెడియన్ అలీ ప్రతి రోజూ బైకుపై ఇసుక తీసుకుని బీదర్‌కు వెళ్లడం..చెక్‌పోస్టు వద్ద పోలీసులు అతన్ని చెక్ చేసినా ఏమీ దొరక్క పోవడం, చివరకు అతను నడిపే బైకులే చోరీ బైకులని తేలడం తెలిసిందే. కరుడుగట్టిన ఇరానీ గ్యాంగ్ లీడర్ బాకర్ సైతం బైకుపైనే బీదర్ నుంచి సిటీకి వస్తూ.. ఒకేరోజు నాలుగైదు స్నాచింగ్‌లకు పాల్పడుతూ.. చోరీ సొత్తుతో దర్జాగా తిరిగి బీదర్‌కు చెక్కేస్తూ రెండున్నరేళ్లుగా పోలీసులను ముప్పుతిప్పలు పెట్టాడు. నగరంలో 102 స్నాచింగ్‌లకు పాల్పడి రూ.కోటి విలువైన 3.46 కిలోల బంగారు ఆభరణాలను కొల్లగొట్టిన డేంజర్ స్నాచర్బాకర్‌ను ఎట్టకేలకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు.  

సాక్షి, సిటీబ్యూరో: బీదర్‌లో ఉంటూ హైదరాబాద్‌లో వందకుపైగా స్నాచింగ్‌లకు పాల్పడిన కరుడు గట్టిన ఇరానీ గ్యాంగ్ లీడర్ బాకర్ ఎట్టకేలకు నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులకు చిక్కాడు. రెండున్నరేళ్ల నుంచి హైదరాబాద్, సైబరాబాద్, మెదక్ పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన ఇతగాడు..102 స్నాచింగ్‌లకు పాల్పడి రూ.కోటి విలువైన 3.46 కిలోల బంగారు ఆభరణాలను కొల్లగొట్టాడు. నిందితుడితో పాటు చోరీ సొత్తు కుదువబెట్టుకున్న నగల తయారీ దారుడిని సైతం టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ కోటిరెడ్డి అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో ఐదుగురి కోసం గాలిస్తున్నారు. వీరి నుంచి మొత్తం సొత్తును రికవరీ చేశారు.

ఇందుకు సంబంధించిన వివరాలను సోమవారం బషీర్‌బాగ్‌లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి వివరించారు. కర్ణాటకలోని బీదర్‌జిల్లా ఇరానీ కాలనీకి చెందిన బాబర్ అలియాస్ బాకర్..అక్రమ్ అలీ అలియాస్ బాకర్ (32)..కుటుంబ అవసరాలకు సంపాదన సరిపోకపోవడంతో 20వ ఏట నుంచే నేరాల బాట పట్టాడు. రాత్రి పూట ఇళ్లలో దొంగతనాలు చేయడం, ఒంటరిగా వెళ్తున్న మహిళను టార్గెట్ చేసుకుని స్నాచింగ్‌కు పాల్పడడం ఇతనికి వెన్నతో పెట్టిన విద్య. చీటింగ్ కేసులో ముంబాయి పోలీసులకు చిక్కి జైలు కెళ్లిన బాకర్ 2011 డిసెంబర్‌లో బెయిల్‌పై విడుదలయ్యాడు.

బీదర్ నుంచి బైక్‌పైనే...
స్నాచింగ్‌లు చేసేందుకు బీదర్ నుంచి హైదరాబాద్‌కు బాకర్ తన బైక్‌పైనే వచ్చేవాడు. బైక్ వెంటన ఎవరైనా తన స్నేహితుడిని తీసుకువచ్చేవాడు. ఒకే రోజు నాలుగైదు స్నాచింగ్‌లు చేసి వెంటనే అదే రోజు తిరిగి బైక్‌పై బీదర్ చేరకుంటాడు. అయితే ఎలాంటి క్లూస్ పోలీసులకు దొరక్కుండా జాగ్రత్తపడేవాడు. బీదర్‌కు చెందిన స్నేహితుల సహకారం మాత్రమే తీసుకునేవాడు. ఒక్కోసారి ఒక్కో స్నేహితుడ్ని వెంట బెంటుకుని వచ్చేవాడు. ఒక్కోసారి అతడు ఒక్కడే బైక్‌ను నడిపిస్తూ కూడా స్నాచింగ్‌లకు పాల్పడ్డాడు.

పట్టించిన హెడ్‌కానిస్టేబుల్...
టాస్క్‌ఫోర్స్ ఈస్ట్‌జోన్ బృందంలో విధులు నిర్వహిస్తున్న హెడ్‌కానిస్టేబుల్ పి.వెంకటస్వామి, కానిస్టేబుళ్లు మహ్మద్ మోబినుద్దీన్, జి.సురేష్‌లు ఇచ్చిన అత్యంత విలువైన సమాచారం మేరకు అదనపు డీసీపీ కోటిరెడ్డి, ఇన్‌స్పెక్టర్ సీహెచ్.శ్రీధర్‌లు వలపన్ని బాకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో హైదరాబాద్‌లో 70, సైబరాబాద్‌లో 26, మెదక్‌లో ఆరు స్నాచింగ్‌లకు పాల్పడినట్లు వెల్లడించాడు. ఇతని నుంచి రూ.కోటి విలువైన 3.46 బంగారు ఆభరణాలతో పాటు కెటీఎం బైక్, కత్తి స్వాధీనం చేసుకున్నారు.

ఇతనిచ్చిన చోరీ సొత్తును కుదువబెట్టుకున్న నగల తయారీ దారుడైన నాందేండ్‌కు చెందిన కె.రామ్‌ప్రసాద్ (27)ని సైతం అరెస్టు చేశారు. 102 కేసులలో బాకర్‌తో కలిసి స్నాచింగ్‌కు పాల్పడిన బీదర్, మహరాష్ట్రలకు చెందిన అతని అనుచరులు ఫిదాఅలీ (28), అసదుల్లా అబు ఇరానీ (30), ఇక్బాల్ (30), అషిక్ హుస్సేన్ (38), ఆర్.మల్లిఖార్జున్ (33)లు పరారీలో ఉన్నారు. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మీడియా సమావేశంలో అదనపు సీపీ అంజనీకుమార్, జాయింట్ సీపీ వై.నాగిరెడ్డి, టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ కోటిరెడ్డి, ఇన్‌స్పెక్టర్ సీహెచ్.శ్రీధర్, ఎస్‌ఐలు ఎ.సుధాకర్, ఎస్.శేఖర్‌రెడ్డి, ఎ.రవికుమార్.జి.రాజులు పాల్గొన్నారు. ఈ కేసు చేధించడంలో కీలక పాత్ర పోషించిన వెంకటస్వామి, మోబినుద్దీన్, సురేష్‌లను కమిషనర్ మహేందర్‌రెడ్డి అభినందించి వారికి రివార్డులు అందజేశారు.

విదేశీయుడిపై పీడీయాక్ట్: మహేందర్‌రెడ్డి, పోలీసు కమిషనర్ డ్రగ్స్ సరఫరా చేస్తూ...పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చి, తిరిగి డ్రగ్స్ సరఫరా చేస్తున్న  నైజీరియన్‌కు చెందిన ఓలుసోల కెహిన్‌దె  అలియాస్ సోల (30)పై జూబ్లీహిల్స్ పోలీసులు పీడీయాక్ట్ ప్రయోగించి జైలుకు పంపించారని కమిషనర్ మహేందర్‌రెడ్డి వెల్లడించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి నగరంలో నేరాలు చేసే బాకర్ వంటి వారిపై కూడా పీడీయాక్ట్ ప్రయోగిస్తామన్నారు.

మరిన్ని వార్తలు