ఐటీసీ 4.50శాతం అప్‌

26 May, 2020 10:58 IST|Sakshi

4.50శాతం లాభపడిన షేరు

ఐటీసీ షేరు టార్గెట్‌ ధరను పెంచిన క్రిడెట్‌ సూసీ

సన్‌రైజ్‌ ఫుడ్స్‌ను టోకోవర్‌ చేసిన ఐటీసీ

 

మార్కెట్‌ లాభాల ట్రేడింగ్‌లో భాగంగా ఐటీసీ షేరు భారీగా లాభపడింది. సెన్సెక్స్‌, నిఫ్టీ సూచీల్లో అధిక వెయిటేజీ కలిగిన ఈ షేరు ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో ఏకంగా 4.50శాతం ర్యాలీ చేసింది. ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ క్రిడెట్‌ సూసీ ... ఐటీసీ షేరు కొనుగోలు టార్గెట్‌ ధరను పెంచింది. అలాగే కలకత్తా ఆధారిత మసాలా, సుగంధ ద్రవ్యాల తయారీ కంపెనీ సన్‌రైజ్‌ ఫుడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ను టేకోవర్‌ చేసుకుంటున్నట్లు ఐటీసీ ప్రకటించింది. 

నేడు ఐటీసీ షేరు బీఎస్‌ఈలో 1.69శాతం లాభంతో రూ.189.50 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి ఈ షేరు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఒకదశలో 4.61శాతం లాభపడి రూ.194.95 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఉదయం గం.10:30ని.లకు మునుపటి ముగింపు(రూ.186.35)తో పోలిస్తే 3శాతం​లాభంతో రూ. 192 వద్ద ట్రేడ్‌ అవుతుంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.134.60, రూ.305.60గా నమోదయ్యాయి. 

సన్‌రైజ్‌ ఫుడ్స్‌ను టోకోవర్‌ చేసిన ఐటీసీ

సన్‌రైజ్‌ ఫుడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఎస్‌ఎఫ్‌పీఎల్‌) కంపెనీని కొనుగోలు చేసినట్లు ఐటీసీ ఆదివారం ప్రకటించింది. అయితే ఎంత విలువకు కంపెనీని టేకోవర్‌ చేసిందో ఐటీసీ సమాచారం ఇవ్వలేదు. డీల్‌ విలువ రూ.1,800 కోట్ల నుంచి రూ.2,000 కోట్ల వరకు చెల్లించి ఉంటుందని మార్కెట్‌ వర్గాల అంచనా. ఈ టేకోవర్‌తో దేశ తూర్పు ప్రాంతంలోని ఐటీసీ అమ్మకాలు మరింత ఊపందుకుంటావని బ్రోకేరేజ్‌ సంస్థ క్రిడెట్‌ సూసీ తెలిపింది. ఈ నేపథ్యంలో షేరుకు గతంలో కేటాయించిన ‘‘న్యూట్రల్‌’’ రేటింగ్‌ను కొనసాగిస్తూ, షేరు టార్గెట్‌ ధరను రూ.190గా నిర్ణయిస్తున్నట్లు బ్రోకరేజ్‌ సం‍స్థ తెలిపింది. 

మరిన్ని వార్తలు