ఆ ఒక్క బిస్కెట్‌ విలువ రూ.1 లక్ష !

7 Sep, 2023 06:05 IST|Sakshi

తిరువల్లూర్‌(తమిళనాడు): చిన్న బిస్కెట్‌ ప్యాకెట్‌ కొంటే అందులో ఒక బిస్కెట్‌ మిస్సయింది. ప్యాకెట్‌లో లేని ఆ ఒక్క బిస్కెట్‌ విలువ ఎంత ఉంటుంది?. నిజానికి అదేం బంగారు బిస్కెట్‌ కాదు కాబట్టి దాని విలువ చాలా తక్కువే ఉంటుంది. కానీ ఆ ఒక్క బిస్కెట్‌ కోసం ఐటీసీ ఫుడ్స్‌ వారు రూ.1 లక్ష జరిమానాను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఏమిటీ బిస్కెట్‌ బాగోతం అనేగా మీ సందేహం. వివరాల్లోకి వెళ్తే అంతా తెలుస్తుంది.

  తమిళనాడు రాజధాని చెన్నైలో పి.దిల్లిబాబు అనే వ్యక్తి ఇటీవల సన్‌ఫీస్ట్‌ మ్యారీ లైట్‌ అనే బిస్కెట్‌ ప్యాకెట్‌ కొన్నాడు. ‘ఈ ప్యాకెట్‌లో 16 బిస్కెట్లు ఉంటాయి’ ఆ ప్యాకెట్‌ రేపర్‌పై ఉంది. అది చూసిన దిల్లిబాబు సరదాకి ప్యాకెట్‌లోని బిస్కెట్లు లెక్కించాడు. ఒక బిస్కెట్‌ లెక్క తగ్గింది. తప్పుడు ప్రచారం చేస్తూ కంపెనీ మోసం చేస్తోందంటూ నేరుగా ఆయన తిరువల్లూర్‌ జిల్లా వినియోగదారుల ఫోరమ్‌ వద్దకెళ్లి కేసు వేశారు. ప్యాకెట్‌ను తయారుచేసిన ఐటీసీ ఫుడ్స్‌ సంస్థపై రూ.100 కోట్ల పెనాల్టీ వేయాలని కోరారు. సరైన వ్యాపార విధానాలు అవలంభించని కారణంగా రూ.10 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ ఘటనలో సేవా లోపాన్ని ఎత్తిచూపారు. ప్యాకెట్‌ను బరువు ఆధారంగా విక్రయిస్తామేగానీ అందులో ఉన్న బిస్కెట్ల సంఖ్యను బట్టి కాదు అంటూ తయారీసంస్థ చేసిన వాదనలను వినియోగదారుల ఫోరమ్‌ పట్టించుకోలేదు. ‘ రేపర్‌పై ఉండే సమాచారంతో సంతృప్తి చెందిన వినియోగదారులే ఆయా వస్తువులను కొంటారు. బరువును చూసి కాదు ఇందులోని బిస్కెట్ల సంఖ్యను చూసే కొనండి అని రేపర్‌పై ప్రత్యేకంగా ముద్రించి ఉంది’ అంటూ కోర్టు గుర్తుచేసింది. వినియోగదారునికి రూ.1 లక్ష నష్ట పరిహారం చెల్లించాలని ఆదేశించింది. కోర్టు ఖర్చుల కింద మరో రూ.10 వేలు అందించాలని సూచించింది.

మరిన్ని వార్తలు