ఐటీసీ లాభం 2,595 కోట్లు

21 May, 2016 01:44 IST|Sakshi
ఐటీసీ లాభం 2,595 కోట్లు

6 శాతం వృద్ధి
ఒక్కో షేర్‌కు రూ.8.50 డివిడెండ్
రెండు షేర్లకు ఒక షేర్ బోనస్

న్యూఢిల్లీ: ఐటీసీ కంపెనీ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి రూ.2,495 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో సాధించిన నికర లాభం(రూ.2,361 కోట్లు) తో పోల్చితే 6 శాతం వృద్ధి సాధించింది. డిమాండ్ అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ, ఐటీసీ లాభం వృద్ధి చెందడం విశేషమని నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఐటీసీ ఫలితాలు అంచనాలను మించాయని వారంటున్నారు.  నికర అమ్మకాలు రూ.9,188 కోట్ల నుంచి 10 శాతం వృద్ధితో రూ.10,062 కోట్లకు  ఎగిశాయని ఐటీసీ పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేర్‌కు రూ.2 ప్రత్యేక డివిడెండ్‌ను కలుపుకొని మొత్తం రూ.8.50 డివిడెండ్‌ను ఇవ్వడానికి కంపెనీ డెరైక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపిందని వివరించింది. ప్రతి రెండు షేర్లకు ఒక షేర్‌ను బోనస్‌గా ఇవ్వాలని కూడా డెరైక్టర్ల బోర్డ్  రికమెండ్ చేసిందని తెలిపింది.

 సిగరెట్ల ఆదాయం 10 శాతం అప్..
ఉత్పత్తి వ్యయాలు తక్కువగా ఉండడం, మార్జిన్లు, రియలైజేషన్‌లు మెరుగుపడడం, అనుకూలమైన బేస్ ఎఫెక్ట్ వంటి కారణాల వల్ల గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో మంచి పనితీరు సాధించామని కంపెనీ తెలిపింది. సిగరెట్లు కాకుండా ఇతర ఎఫ్‌ఎంసీజీ సెగ్మెంట్ ఆదాయంలో వృద్ధి పెద్దగా లేదని పేర్కొంది. డిమాండ్ అంతంతమాత్రంగానే ఉండడం, ధరల తగ్గింపు పరిస్థితులు, ఈ సెగ్మెంట్ ఆదాయంపై ప్రభావం చూపాయని తెలిపింది. సిగరెట్లతో సహా మొత్తం ఎఫ్‌ఎంసీజీ వ్యాపారానికి సంబంధించిన ఆదాయం 6,777 కోట్ల నుంచి 8 శాతం వృద్ధితో రూ.7,343 కోట్లకు పెరిగిందని పేర్కొంది. సిగరెట్ల సెగ్మెంట్ ఆదాయం రూ.4,211 కోట్ల నుంచి 10 శాతం వృద్ధితో రూ.4,639 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఐటీసీ షేర్ 4 శాతం లాభపడి రూ.338ను తాకింది. చివరకు 1.5 శాతం లాభంతో రూ.330 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు