HCLTech Q2 results: ఫ్రెషర్స్‌కు గుడ్‌న్యూస్‌.. 10,000 ఉద్యోగాలు ప్రకటించిన ఐటీ సంస్థ

13 Oct, 2023 07:54 IST|Sakshi

క్యూ2లో రూ. 3,833 కోట్లు

షేరుకి రూ. 12 డివిడెండ్‌

న్యూఢిల్లీ: ఐటీ సేవల దిగ్గజం హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన జూలై–సెప్టెంబర్‌(క్యూ2)లో నికర లాభం 10 శాతం పుంజుకుని రూ. 3,833 కోట్లను తాకింది. గతేడాది (2022–23) ఇదే కాలంలో రూ. 3,487 కోట్ల నికర లాభం ఆర్జించింది.

మొత్తం ఆదాయం సైతం 8 శాతం వృద్ధితో రూ. 26,672 కోట్లకు చేరింది. గత క్యూ2లో రూ. 24,686 కోట్ల టర్నోవర్‌ నమోదైంది. వాటాదారులకు షేరుకి రూ. 12 చొప్పున మధ్యంతర డివిడెండును ప్రకటించింది.  కొత్త  కాంట్రాక్టులు 67 శాతం జంప్‌చేసి కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా 4 బిలియన్‌ డాలర్లను తాకినట్లు వెల్లడించారు.

ఇతర విశేషాలు...

  • ఈ ఏడాది తొలి ఆరు నెలల పనితీరు నేపథ్యంలో పూర్తి ఏడాదికి ఆదాయ అంచనాలను 5–6 శాతానికి తగ్గించింది. తొలుత 6–8 శాతం వృద్ధి అంచనాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. 
  • సెప్టెంబర్‌ చివరికి సిబ్బంది సంఖ్య 1% తగ్గి 2,21,139కు చేరింది. 
  • ఈ ఏడాది 10,000 మంది ఫ్రెషర్స్‌కు ఉద్యోగాలివ్వనున్నట్లు కంపెనీ సీపీవో రామచంద్రన్‌ సుందరరాజన్‌ వెల్లడించారు. గతేడాది 27,000 మంది ఫ్రెషర్స్‌కు ఉపాధి కల్పించినట్లు ప్రస్తావించారు.

సాక్షి టీవీ వాట్సాప్‌ ఛానెల్‌ క్లిక్‌ చేసి ఫాలో అవ్వండి 

మరిన్ని వార్తలు