ప్రత్యక్ష పన్ను వసూళ్లు 22 శాతం అప్‌ 

14 Nov, 2023 07:39 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ప్రత్యక్ష పన్నుల వసూళ్లు నికరంగా రూ. 10.60 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 22 శాతం పెరిగాయి. పూర్తి ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న టార్గెట్‌లో 58 శాతానికి చేరాయి.

కార్పొరేట్‌ ట్యాక్స్‌ వసూళ్లు 12.48 శాతం, వ్యక్తిగత ఆదాయ పన్నుల వసూళ్లు 31.77 శాతం పెరిగాయని ఆదాయపు పన్ను శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఏప్రిల్‌ 1 నుంచి నవంబర్‌ 9 వరకు రూ. 1.77 లక్షల కోట్ల రిఫండ్లు జారీ చేసినట్లు పేర్కొంది.

స్థూలంగా ప్రత్యక్ష పన్నుల వసూళ్లు (కార్పొరేట్, వ్యక్తిగత ఆదాయపు పన్నులు కలిపి) సుమారు 18% పెరిగి రూ. 12.37 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2023–24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ. 18.23 లక్షల కోట్లు సాధించాలని నిర్దేశించుకున్నారు. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో నమోదైన రూ. 16.61 లక్షల కోట్లతో పోలిస్తే ఇది 9.75 శాతం అధికం.    

మరిన్ని వార్తలు