జియో టారిఫ్‌లు పెరిగాయ్‌!

19 Oct, 2017 03:56 IST|Sakshi

న్యూఢిల్లీ: రిలయన్స్‌ జియో కొన్ని టారిఫ్‌లను సవరించింది. 84 రోజుల ప్లాన్‌ను రూ.459కు పెంచుతున్నట్లు కంపెనీ తన వెబ్‌సైట్‌ ద్వారా వెల్లడించింది. ప్రస్తుతం ఈ ప్లాన్‌ టారిఫ్‌ రూ.399గా ఉంది. ఈ టారిఫ్‌ల సవరింపు నేటి(గురువారం) నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. 84 రోజుల ప్లాన్‌లో వినియోగదారులు 1 జీబీ 4జీ డేటాను ప్రతిరోజూ పొందవచ్చని వివరించింది. దివాళీ ధమాకా పేరుతో అందిస్తున్న స్కీమ్‌లో  రూ.149 ప్లాన్‌లో ప్రస్తుతం ఆఫర్‌ చేస్తున్న డేటాను 2జీబీ  నుంచి 4జీబీకు పెంచుతున్నామని పేర్కొంది.

షార్ట్‌ టర్మ్‌ ప్లాన్‌లు, తక్కువ డినామినేషన్‌ రీచార్జ్‌ టారిఫ్‌లను రిలయన్స్‌ జియో తగ్గించింది. వారం వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ రూ.52, రెండు వారాల వ్యాలిడిటీ ఉండే రూ.98 ప్లాన్‌లో ఉచిత వాయిస్, ఎస్‌ఎంఎస్, అన్‌లిమిటెడ్‌ డేటాను పొందవచ్చని పేర్కొంది. రోమింగ్‌లో ఉన్నప్పటికీ, జియో... పరిమితి లేని వాయిస్‌ కాల్స్‌ను ఆఫర్‌ చేస్తోందని పేర్కొంది. రూ.509 స్కీమ్‌ ప్రయోజనాలను తగ్గించింది. అంతే కాకుండా బిల్లింగ్‌ సైకిల్‌ను 56 రోజుల నుంచి 49కు కు తగ్గించామని పేర్కొంది. ఇక రూ.999 ప్లాన్‌లో గతంలో ఆఫర్‌ చేసిన 90 జీబీ 4 జీ డేటాను 30 జీబీకి తగ్గించామని తెలిపింది. 

మరిన్ని వార్తలు