మాతృ రాష్ట్రం రుణం తీర్చుకోండి

19 Oct, 2017 01:33 IST|Sakshi

     షికాగోలో ఐటీ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు

     రెండు మిలియన్‌ డాలర్లతో అమరావతిలో తానా భవన్‌

     ప్రతిపాదనలు పంపితే పరిశీలిస్తామన్న సీఎం

సాక్షి, అమరావతి :  అమెరికాలో స్థిరపడిన తెలుగువారంతా పుట్టిన గడ్డకు తిరిగి ఎంతో కొంత ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. మాతృ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ రుణం తీర్చుకోవాలని, జన్మభూమికి ఎంతో కొంత చేయాలన్నారు. అదే సమయంలో అమెరికా సమాజానికీ తోడ్పాటివ్వాలని, అవకాశం ఇచ్చిన ఆతిథ్య దేశాన్ని మరవకూడదన్నారు. అమెరికా పర్యటనకు వెళ్లిన ఆయన బుధవారం రాత్రి షికాగోలో తొలుత అక్కడి ఐటీ ప్రతినిధులతో సమావేశమై మాట్లాడారు. ఇక్కడున్న ప్రతి ఐటీ ఉద్యోగి పారిశ్రామికవేత్తగా మారాలని, ఉద్యోగంతోనే సంతృప్తి పడకూడదని చెప్పారు.

మంచి జాబ్‌ ఉందని సరిపె ట్టుకోకుండా మరికొంత మందికి ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలని చెప్పారు. రెండు దశాబ్దాల క్రితం ఐటీకి ఐకాన్‌ బిల్డింగ్‌ నిర్మించానని, అదే తెలుగువారి ఐటీ విప్లవానికి నాందిగా నిలిచిందన్నారు. ఇక్కడి తెలుగు వారిని చూస్తుంటే తాను హైదరాబాద్‌లో ఉన్నానా, లేక విజయవాడలో ఉన్నానా అని ఆశ్చర్యం కలుగుతోందన్నారు. తెలుగు వారు బాగా కష్టపడి సంపద సృష్టించి విశ్వ అభివృద్ధికి తోడ్పడాలన్నారు. అమెరికా అంతటా ఏపీ నుంచి వచ్చిన చేపలు వినియోగించే రోజు ఎంతో దూరంలో లేదన్నారు. అమెరికా నుంచి ఏడాదిలో రాష్ట్రానికి 500 సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించాలని చెప్పారు. ఈ సందర్భంగా ఐటీ సిటీపై సీఎం, ఐటీ టాస్క్‌ఫోర్స్‌ చైర్మన్‌ గారపాటి ప్రసాద్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. విశాఖను మెగా ఐటీ సిటీగా, అమరావతిని మేజర్‌ ఐటీ హబ్‌గా మారుస్తామన్నారు.

పలు ఒప్పందాలకు అంగీకారం
రాష్ట్రంలో ఐటీ పరిశ్రమల స్థాపనకు ఆసక్తి చూపుతున్న ప్రవాస భారతీయులు, వారికి సంబంధించిన కంపెనీలతో ఒప్పందాలకు ముఖ్యమంత్రి అంగీకరించారు. రాష్ట్రంలో 60 కంపెనీలు నెలకొల్పడానికి విశాఖలో ఆరు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో స్థలం కావాలని ఆయా సంస్థలు కోరాయి. తొలుత చంద్రబాబును తానా ప్రతినిధులు కలుసుకున్నారు. అమెరికాలో 20 నగరాలలో 5కె రన్‌ నిర్వహిస్తున్నామని, వీటి ద్వారా వచ్చిన ఆదాయంతో ఏపీలో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. రెండు మిలియన్‌ డాలర్లతో అమరావతిలో తానా భవన్‌ నిర్మిస్తామని, అందుకు అవసరమైన స్థలం కేటాయించాలని కోరగా ప్రతిపాదనలు పంపితే పరిశీలిస్తానన్నారు. షికాగో స్టేట్‌ వర్సిటీ చైర్మన్, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మేథమెటిక్స్‌ అండ్‌ కంప్యూటర్‌ సైన్సెస్‌ ప్రొఫెసర్‌ రోహన్‌ అత్తెలెతో బాబు సమావేశమయ్యారు.

డైనమిక్‌ సైబర్‌ సెక్యూరిటీ ప్రోగ్రామ్‌లో తమకున్న అనుభవం, ప్రావీణ్యాన్ని ఏపీలోని వర్సిటీలకు అందిస్తామని ప్రొఫెసర్‌ రోహన్‌ ప్రతిపాదించారు. ఇందుకు అవసరమైన కార్యాలయ వసతిని ఏర్పాటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం సన్నద్ధత వ్యక్తం చేసింది. సీఎం వెంట ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్,సీఎం ముఖ్య కార్యదర్శి జి సాయి ప్రసాద్, ఈడీబీ సీఈవో జాస్తి కృష్ణ కిషోర్‌ తదితరులున్నారు. షికాగో ఎయిర్‌పోర్టులో ఈ బృందానికి ఏపీఎన్‌ఆర్‌టీ, తానా సభ్యులు స్వాగతం పలికారు. షికాగో పర్యటన తర్వాత డెమోయిన్స్‌ బయలుదేరిన బాబు బృందం ఐయోవా స్టేట్‌ వర్సిటీని సందర్శించనుంది.

ప్రజలకు సీఎం దీపావళి శుభాకాంక్షలు
దీపావళి పండుగ ప్రతి ఇంటా ఆనంద దీపావళి కావాలని, అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆకాంక్షించా రు. విదేశీ పర్యటనలో ఉన్న ఆయన దేశ, విదేశాల్లోని తెలుగువారందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు లోగిళ్లలో కోటి దీపకాంతులు వెల్లివిరియాలని, అంద రి కళ్లల్లో సంతోషం చూడాలనేది తన ఆకాంక్షని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు