వేల కోట్ల కాంట్రాక్ట్‌ చేతికి: ఉద్యోగులకేమో పింక్‌స్లిప్‌లు

29 Sep, 2017 22:34 IST|Sakshi

ముంబై : వేల కోట్ల విలువైన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ పోటీల ప్రసార హక్కులను సొంతం చేసుకున్న స్టార్‌ ఇండియా, ఉద్యోగులకు మాత్రం రాం రాం అంటోంది. హక్కులను దక్కించుకోవడంలో రికార్డు విజయం సాధించిన అనంతరం, స్టార్‌ ఇండియా కొంత మంది ఉద్యోగులను తొలగించనుందని ఎకానమిక్‌ టైమ్స్‌ రిపోర్టు చేసింది. స్టార్‌ ఇండియా తొలగిస్తున్న ఉద్యోగుల్లో ఎక్కువగా బ్రాడ్‌కాస్టర్‌కు చెందిన డిస్ట్రిబ్యూషన్‌, ఇతర ఫంక్షన్లలో పని చేసే వారున్నారని పేర్కొంది. డిస్ట్రిబ్యూషన్‌ టీమ్‌లో 60 మంది ఉద్యోగులకు పింక్‌ స్లిప్‌లు అందాయని సంబంధిత వర్గాలు చెప్పాయి. ఇతర ఫంక్షన్ల ఉద్యోగులతో కలిపితే మొత్తంగా నెలలో 100 మంది వరకు ఉద్యోగులు స్టార్‌ ఇండియా నుంచి వీడినట్టు తెలిసింది. ఐపీఎల్‌ హక్కులకు కోసం వేల కోట్ల రూపాయలు వెచ్చించిన అనంతరం రెవెన్యూలను పెంచుకునే ఒత్తిడి పెరగడంతో, ఇక ఉద్యోగులపై వేటు వేస్తుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

స్టార్‌ స్పోర్ట్స్‌ సేల్స్‌, రెవెన్యూ స్ట్రాటజీ యూనిట్లకు చెందిన కొంత మంది టాప్‌-లెవల్‌ ఎగ్జిక్యూటివ్‌లూ సంస్థను వీడాలని ఆదేశాలు జారీ అయినట్టు వెల్లడైంది. తొలగిస్తున్న ఉద్యోగులకు స్టార్‌ ఇండియా 12 నెలల సెవరెన్స్‌ ప్యాకేజీ కూడా ఇస్తున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. ఐటీ, ఇతర ఫంక్షన్లకు చెందిన కొంతమంది సీనియర్‌ ఉద్యోగులకు పింక్‌ స్లిప్‌లు అందాయని, స్టార్‌ స్పోర్ట్స్‌కు చెందిన సీనియర్‌ యాడ్‌ సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌లు తమ రాజీనామా పత్రాలు సమర్పించినట్టు తెలిసింది.  రెవెన్యూలను పెంచుకోవడానికి ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ఈ విషయం తెలిసిన మరో వ్యక్తి చెప్పారు. 

అయితే ఈ విషయంపై కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంజయ్‌ గుప్తాను సంప్రదించగా.. స్టార్‌ ఇండియా కొంత రిడండెన్సీని తగ్గిస్తుందని చెప్పిన ఆయన, ఎంతమంది ఉద్యోగులను తొలగిస్తుందో స్పష్టత ఇవ్వలేదు. స్టార్‌ స్పోర్ట్స్‌లో సీనియర్‌ లెవల్‌ ఉద్యోగుల రాజీనామాలపై స్పందించిన గుప్తా, అక్కడ ఎలాంటి అట్రిక్షన్‌ లేదన్నారు. స్పోర్ట్స్‌ వ్యాపారాలతో తాము చాలా సంతోషంగా ఉన్నట్టు తెలిపారు. సీనియర్‌ స్థాయి ఉద్యోగులు సంస్థను వీడటంపై ఎలాంటి నిజాలు లేవన్నారు. హాట్‌స్టార్‌, డేటా సైన్స్‌, కన్జ్యూమర్‌ ఇన్‌సైట్స్‌లో ఉద్యోగులను చేర్చుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఈ నెల మొదట్లో స్టార్‌ఇండియా ఐదేళ్ల కాలానికి గాను, ఐపీఎల్‌ 'గ్లోబల్‌ మీడియా రైట్స్‌'ను రూ.16,347.50 కోట్లకు సొంతం చేసుకుంది.   

మరిన్ని వార్తలు