కంప్యూటర్ కొనుగోలుకు విద్యార్థులకు లోన్

7 Nov, 2014 00:41 IST|Sakshi
కంప్యూటర్ కొనుగోలుకు విద్యార్థులకు లోన్

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విద్యా రుణంతోపాటు కంప్యూటర్ కొనుగోలుకు విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయాల్సిందిగా బ్యాంకులను కోరనున్నట్టు లెనోవో తెలిపింది. పోటీ ప్రపంచంలో విషయ పరిజ్ఞానం పెంచుకోవడానికి కంప్యూటర్ తప్పనిసరి అయిందని లెనోవో మార్కెటింగ్ డెరైక్టర్ భాస్కర్ చౌదరి తెలిపారు. విద్యార్థులకు అదనంగా రుణమిచ్చే విషయమై బ్యాంకులతో చర్చించనున్నట్టు ఆయన సాక్షి బిజినెస్ బ్యూరోకు గురువారం తెలిపారు.

 వడ్డీ లేకుండా 100 శాతం రుణ పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా లెనోవో ఇండియా, సౌత్ ఆసియా హోమ్, స్మాల్ బిజినెస్ డెరైక్టర్ శైలేంధ్ర కత్యాల్‌తో కలసి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు తొలుత, ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని విస్తరిస్తామని చెప్పారు. ‘11 బ్యాంకులకు చెందిన క్రెడిట్ కార్డు కస్టమర్లకు ఈ స్కీం వర్తిస్తుంది. క్రెడిట్ కార్డు లేనివారి కోసం ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలతో చర్చిస్తున్నాం. కస్టమర్లకు ఇంటర్నెట్ డాంగిల్స్ ఉచితంగా ఇచ్చేందుకు టెలికం కంపెనీలతో మాట్లాడుతున్నాం’ అని చెప్పారు. లెనోవో కంప్యూటర్లు రూ.22,390 నుంచి లభిస్తున్నాయి.

మరిన్ని వార్తలు