ఉపాధి రంగాలకు ఊతమివ్వాల్సిందే..

23 Apr, 2020 15:37 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్‌-19తో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలవడంతో కీలక రంగాలు ప్రభుత్వాల చేయూత కోసం వేచిచూస్తున్నాయి. కోట్లాది కొలువులను కాపాడుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీలతో కీలక రంగాలను ఆదుకోవాల్సి ఉంది. అత్యధిక ఉపాధిని సమకూర్చే పరిశ్రమలు, సంస్ధల మనుగడకు ఆర్థిక ప్యాకేజ్‌ను ప్రకటించి ప్రభుత్వం చేయూత ఇవ్వకుంటే పెద్దసంఖ్యలో ఉద్యోగులు నిరుద్యోగులుగా మారే ప్రమాదం నెలకొంది. అగ్రరాజ్య ఆర్థిక వ్యవస్థలు ప్రాణాంతక వైరస్‌ ధాటికి కుప్పకూలుతుంటే భారత ఆర్థిక వ్యవస్థ భారీ మాంద్యంలోకి జారుకుంటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

ఎకానమీని కాపాడుకుంటూ కోట్లాది ఉద్యోగాలను నిలబెట్టేందుకు ఆర్‌బీఐ, కేంద్ర ప్రభుత్వం భారీ కసరత్తే చేయాల్సి ఉంటుందని పరిశ్రమ వర్గాలతో పాటు ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ఏప్రిల్‌లో భారత్‌లో నిరుద్యోగ రేటు భారీగా ఎగబాకిందని సీఎంఐఈ గణాంకాలు వెల్లడించాయి. మరికొద్ది నెలలు ఇదే పరిస్ధితి కొనసాగే పరిస్ధితి కనిపిస్తోంది. మాంద్య మేఘాలు ముసురుకున్న క్రమంలో దేశంలో ఐదు కీలక రంగాలకు ప్రభుత్వ ఊతం అవసరమని భావిస్తున్నారు.


ఎంఎస్‌ఎంఈకి భరోసా
ఇక భారత ఆర్థిక వ్యవస్ధకు వెన్నుదన్నుగా నిలిచి కోట్లాది ఉద్యోగాలను కల్పిస్తున్న చిన్న మధ్యతరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఈ) ప్రభుత్వం భారీ ప్యాకేజ్‌ను ప్రకటించాలనే డిమాండ్‌ ముందుకొస్తోంది. దేశ జీడీపీకి మూలస్తంభాలైన తయారీ, ఎగుమతి రంగంలో నిమగ్నమైన ఎంఎస్‌ఎంఈ రంగం కోవిడ్‌-19 ప్రభావంతో విలవిలలాడుతోంది. ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్ధితుల్లో ఆయా పరిశ్రమలు పెను సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. దేశ జీడీపీలో 30 శాతంపైగా సమకూరుస్తున్న ఈ రంగానికి భారీ రిలీఫ్‌ ప్యాకేజ్‌ ప్రకటించాలని పరిశ్రమ వర్గాలతో పాటు ఆర్థిక నిపుణులు కోరతున్నారు. సత్వరమే ఉద్దీపన ప్యాకేజ్‌ ప్రకటించని పక్షంలో పలు చిన్న యూనిట్లు మూతపడే ప్రమాదం నెలకొంది.

చదవండి : డబ్ల్యూహెచ్‌ఓకు చైనా భారీ సాయం!


సంక్షోభంలో ఆతిథ్యం..
కోవిడ్‌-19 ప్రభావంతో ఆతిథ్య, పర్యాటక రంగాలకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. వైరస్‌ వ్యాప్తి భయాలు, లాక్‌డౌన్‌ ఫలితంగా పర్యాటకుల రాకపోకలు నిలిచిపోయి ఈ రంగాలు కుదేలయ్యాయి. దేశంలో టూరిజం, ఆతిథ్య రంగం 3.8 కోట్ల ఉద్యోగాలను కోల్పోయిందని కేపీఎంజీ నివేదిక స్పష్టం చేసింది. మే 3వరకూ లాక్‌డౌన్‌ పొడిగించడంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక టూరిజం రంగమూ భారీ నష్టాల్లో కూరుకుపోయింది. ఒక్క పౌరవిమానయాన రంగానికే రూ 5 లక్షల నష్టం వాటిల్లడంతో పాటు పర్యాటక రంగంలో 4 నుంచి 5 కోట్ల ఉద్యోగాలు దెబ్బతిన్నాయని పలు నివేదికలు పేర్కొన్నాయి. ఆతిథ్య, పర్యాటక రంగాలకు ఊతమిచ్చేందుకు ప్రభుత్వం సత్వరమే ప్రోత్సాహక చర్యలు ప్రకటించాలి.


విమానయాన, ఆటోమొబైల్‌, నిర్మాణ రంగాలకు ఊతం..
ఈ రెండు ప్రధాన రంగాలతో పాటు కరోనా మహమ్మారితో కుదేలైన విమానయానం, ఆటోమొబైల్‌, రియల్‌ఎస్టేట్‌, నిర్మాణ రంగాలను ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణమే ఉద్దీపన ప్యాకేజ్‌లను ప్రకటించాలని పరిశ్రమ వర్గాలతో పాటు ఆర్థిక నిపుణులు కోరుతున్నారు. పరిశ్రమలను కాపాడుకునేందుకు చొరవచూపితేనే కోవిడ్‌-19 ఎఫెక్ట్‌తో కళ్లముందు కనిపించే మహా పతనాన్ని కొంతమేర నివారించవచ్చు.

మరిన్ని వార్తలు