మార్కెట్ కళ్లన్నీ ఎన్నికల ఫలితాలపైనే...

3 May, 2014 01:29 IST|Sakshi
మార్కెట్ కళ్లన్నీ ఎన్నికల ఫలితాలపైనే...

 ముంబై: గత మూడేళ్లలోలేని విధంగా ఈ ఏడాది జనవరి నుంచి దేశీ స్టాక్ మార్కెట్లు బుల్ జోరును అందుకున్నాయి. ఇందుకు అనేక అంశాలు దోహదపడినప్పటికీ ప్రధానంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై పెరుగుతున్న సానుకూల అంచనాలు ఇన్వెస్టర్లకు జోష్‌నిస్తూ వచ్చాయి. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని ఎన్‌డీఏ ప్రస్తుత ఎన్నికల్లో మెజారిటీ సాధించి కేంద్రంలో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న అంచనాలు సెంటిమెంట్‌కు ప్రోత్సాహాన్నిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందుకు అనుగుణంగా దేశీ స్టాక్స్‌లో ఎఫ్‌ఐఐలు కుమ్మరిస్తున్న భారీ పెట్టుబడులు ప్రధాన ఇండెక్స్‌లను పరుగు పెట్టిస్తున్నాయి.

మార్కెట్ల ప్రామాణిక సూచీ సెన్సెక్స్ 23,000 పాయింట్ల సమీపానికి చేరుకోగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 6,800ను అధిగమించిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల మార్కెట్లు కొంత వెనకడుగు వేస్తున్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో నిపుణుల అంచనాలకు భిన్నంగా ఎన్‌డీఏ తగిన మెజారిటీని సాధించలేకపోవచ్చునంటూ తాజాగా విశ్లేషణలు  వెలువడుతుండటమే దీనికి కారణం. ఈ  అంశాల నేపథ్యంలో ఎన్నికల ముందు, ఎన్నికల తరువాత మార్కెట్ల కదలికలపై వివిధ బ్రోకింగ్ సంస్థలు, నిపుణుల అభిప్రాయాలు ఎలా ఉన్నాయో చూద్దాం....

 ఎన్‌డీఏకి మెజారిటీ రాకపోతే 10-15% పతనం కావచ్చు...
 
 కరెంట్ ఖాతా లోటు భారీగా తగ్గడం, ద్రవ్యోల్బణం మూడేళ్ల కనిష్టానికి దిగిరావడం వంటి అంశాలు ఎఫ్‌ఐఐలకు ప్రోత్సాహాన్నిస్తున్నాయి. ఆరు నెలల క్రితంతో పోలిస్తే దేశ ఆర్థిక పరిస్థితులు మెరుగయ్యాయి. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల తరువాత ఏర్పడే కొత్త ప్రభుత్వం సంస్కరణల అమలును వేగవంతం చేస్తుందన్న అంచనాలు ఇన్వెస్టర్లకు జోష్‌నిస్తున్నాయి. నిజానికి ప్రభుత్వాల ఏర్పాటుకు, మార్కెట్ల పనితీరుకు అంతగొప్ప లింకు లేనప్పటికీ, స్వల్ప కాలంలో ఎన్నికల ఫలితాలు ఇండెక్స్‌లను భారీ ఒడిదుడుకులకు లోను చేస్తాయి. అంచనాలకు భిన్నంగా ఎన్‌డీఏకు మెజారిటీ రాకపోతే 10-15% వరకూ మార్కెట్లు పతనం కావచ్చు.  రాజకీయ కారణాలను పక్కనపెడితే ఆర్థిక అంశాల రీత్యా మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయవచ్చు. - జ్యోతివర్థన్ జైపూరియా, ఎండీ, బీవోఎఫ్‌ఏ మెరిల్‌లించ్

 9 ఎన్నికల్లో 7 సార్లు లాభాలే...
 మార్కెట్లు ఖరీదైనవిగా లేవు. గత ఐదేళ్ల సగటులోనే ట్రేడవుతున్నాయి. దీర్ఘకాలిక ఇన్వెస్ట్‌మెంట్స్‌కు ఇది సరైన సమయం. కొంతమంది ట్రేడర్లు లాభాల స్వీకరణకు పాల్పడుతున్నా, ఎన్నికల ఫలితాల కోసం మార్కెట్లు వేచిచూస్తున్నాయి. 1980 నుంచి చూస్తే 9 సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఎన్నికల  తరువాత రెండేళ్ల కాలవ్యవధిలో 7 సార్లు మార్కెట్లు సానుకూలంగానే స్పందించాయి. ఎన్నికల ముందు, ఎన్నికల తరువాత రెండు మూడు నెలల్లో మార్కెట్లలో జరిగేవాటికి ప్రాధాన్యం ఇవ్వబోము.
 - సంజయ్ చావ్లా, సీఐవో, బరోడా పయనీర్ ఏఎంసీ

 నిఫ్టీ 7,200ను తాకే చాన్స్...
 అంచనాలకు అనుగుణంగా ఎన్నికల ఫలితాలు వెలువడితే అంటే ఎన్‌డీఏకు స్పష్టమైన మెజారిటీ వస్తే మే నెలాఖరుకల్లా ఎన్‌ఎస్‌ఈ ప్రధాన సూచీ నిఫ్టీ 7,200ను అధిగమిస్తుంది. సుమారు ఐదేళ్ల తరువాత బుల్ మార్కెట్ మొదలైంది. యూపీఏ ప్రభుత్వం తీసుకున్న సంస్కరణలు, రిజర్వ్ బ్యాంక్ చేపట్టిన పరపతి విధానాలు ఆర్థిక వ్యవస్థకు ఊపునిస్తున్నాయ్. ద్రవ్యలోటు, కరెంట్ ఖాతా లోటు కట్టడి ఎఫ్‌ఐఐల నమ్మకాన్ని పెంచింది.  - సుదీప్ బందోపాధ్యాయ్, ప్రెసిడెంట్, డెస్టిమనీ సెక్యూరిటీస్

 5 శాతం పుంజుకుంటాయ్...
 ఎన్‌డీఏకు మెజారిటీ వస్తే మార్కెట్లలో ప్రస్తుతం కనిపిస్తున్న ర్యాలీ కొనసాగుతుంది. కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటైతే...  ప్రధాన ఇండెక్స్‌లు మరో 5%మేర పుంజుకుంటాయ్. ఒకవేళ ఎన్‌డీఏకు 230-270 మధ్య సీట్లు పరిమితమైతే మార్కెట్లు కొంతమేర దిద్దుబాటుకు లోనవుతాయి. ఇవన్నీ స్వల్పకాలిక మార్పులే. మధ్య, దీర్ఘకాలానికి ఆర్థిక అంశాలకు అనుగుణంగా ఈక్విటీ మార్కెట్లు మరింత పటిష్టపడతాయ్.  - వికాస్ ఖేమానీ, సీఈవో, ఎడిల్‌వీజ్ సెక్యూరిటీస్
 
 ఈ మే నెలకు ప్రాధాన్యం

 సార్వత్రిక ఎన్నికల కారణంగా ఈ ఏడాది మే నెలకు ప్రాధాన్యత ఏర్పడింది. ఎన్నికల నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 2009 మే నెలలో 28% లాభపడింది. ఇక 2004 మే నెలలోనూ 17% ఎగసింది. ఇక 2011, 2012లలో 3-6% స్థాయిలో నష్టపోయినప్పటికీ, తిరిగి 2013 మే నెలలో అయితే 1% పెరిగింది. ప్రస్తుతం నిఫ్టీ 14 పీఈలో ట్రేడవుతోంది. దీర్ఘకాలిక సగటు 15కంటే ఇది తక్కువేకాగా, ప్రోత్సాహకర ఎన్నికల ఫలితాల వంటి పరిస్థితుల్లో ఇంతకంటే బాగా అధిక స్థాయిల్లోనూ ట్రేడైన సందర్భాలున్నాయి. ఇప్పటికే నిఫ్టీ ఇటీవల 400 పాయింట్లు లాభపడ్డ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక ఇన్వెస్ట్‌మెంట్‌కు దిగడం ఉత్తమం. ఏ పార్టీకీ స్పష్టమైన మెజారీటీ లభించని పక్షంలో మే 16 తరువాత కనీసం రెండు వారాలు మార్కెట్లలో కరెక్షన్‌కు అవకాశముంటుంది. ఈ కాలంలో ఇన్వెస్టర్లు వివిధ  రంగాలు, కంపెనీలపై దృష్టిపెట్టవచ్చు. - జయంత్ మాంగ్‌లిక్, రిటైల్ పంపిణీప్రెసిడెంట్, రెలిగేర్ సెక్యూరిటీస్
 

మరిన్ని వార్తలు