మారుతీ లాభం 3% అప్‌

26 Jan, 2018 00:40 IST|Sakshi

27 శాతం పెరిగిన నిర్వహణ లాభం

తగ్గనున్న రాయల్టీ చెల్లింపులు  

న్యూఢిల్లీ: దేశీ వాహన దిగ్గజం మారుతీ సుజుకీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో(2017–18, క్యూ3) రూ.1,799 కోట్ల నికర లాభాన్ని సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో సాధించిన నికర లాభం రూ.1,742 కోట్లతో పోలిస్తే 3 శాతం వృద్ధి సాధించామని మారుతీ సుజుకీ తెలిపింది.  ఇన్వెస్ట్‌మెంట్స్‌పై మార్క్‌–టు–మార్కెట్‌ ప్రభావం కారణంగా ఇతర ఆదాయం తక్కువగా ఉండటం, పన్ను వ్యయాలు అధికంగా ఉండటం వల్ల నికర లాభం పెద్దగా పెరగలేదని వివరించింది.

నిర్వహణ లాభం 27 శాతం పెరిగి రూ.3,038 కోట్లకు, మార్జిన్‌ వంద బేసిస్‌ పాయింట్లు పెరిగి 16 శాతానికి చేరిందని పేర్కొంది. అమ్మకాలు అధికంగా ఉండటం, వ్యయ నియంత్రణ పద్ధతులు, అమ్మకాల వ్యయాలు తక్కువగా ఉండటం, ఫారెక్స్‌ ప్రయోజనాల కారణంగా నిర్వహణ లాభం 22 శాతం పెరిగిందని తెలిపింది. ఇతర ఆదాయం 59 శాతం తగ్గి రూ.245 కోట్లకు పడిపోగా, పన్ను వ్యయాలు 50 శాతం వృద్ధి చెంది రూ.813 కోట్లకు పెరిగాయని పేర్కొంది. మొత్తం ఆదాయం రూ.19,793 కోట్ల నుంచి రూ.19,528 కోట్లకు తగ్గిందని తెలిపింది.

అమ్మకాలు 12 శాతం వృద్ధి...
దేశీయ వాహన అమ్మకాలు 12 శాతం వృద్ధితో 4,00,586కు పెరిగాయని, ఎగుమతులు 30,526గా ఉన్నాయని, మొత్తం అమ్మకాలు 11 శాతం వృద్ధితో 4,31,112కు చేరాయని మారుతీ సుజుకీ తెలిపింది. రాయల్టీ మదింపులో సవరణను డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదించిందని, ఫలితంగా ఇగ్నిస్‌ మోడల్‌ నుంచి  రాయల్టీ చెల్లింపులు తగ్గుతాయని  పేర్కొంది.

సుజుకీ మోటార్‌ కార్పొరేషన్‌ బోర్డ్‌ ఆమోదం పొందిన తర్వాత ఇది అమల్లోకి వస్తుందని కంపెనీ వివరించింది.ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో మారుతీ సుజుకీ షేర్‌ 1.6 శాతం నష్టంతో రూ.9,277 వద్ద ముగిసింది.

>
మరిన్ని వార్తలు