మరో 2 మెగా ఫుడ్ పార్కులు

29 Mar, 2014 02:06 IST|Sakshi
మరో 2 మెగా ఫుడ్ పార్కులు

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తెలంగాణ, సీమాంధ్ర రైతులకు శుభవార్త. చిత్తూరులో శ్రీని ఫుడ్ పార్కు విజయవంతం కావడంతో మరో రెండు మెగా ఫుడ్ పార్కులకు కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ రెండు పార్కులు వచ్చే ఏడాది కార్యరూపం దాల్చనున్నాయని రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్‌వీ ప్రసాద్ తెలిపారు. అసోచాం ఆధ్వర్యంలో శుక్రవారమిక్కడ జరిగిన సదస్సులో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు.

 స్మార్ట్ అగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ నిజామాబాద్‌కు సమీపంలో, గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్కు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వద్ద మెగా ఫుడ్ పార్కులను ఏర్పాటు చేస్తున్నాయని చెప్పారు. వీటి ద్వారా తెలంగాణలో వరి, మొక్కజొన్న, పసుపు, సోయా రైతులకు, ఆంధ్ర ప్రాంతంలోని చేపలు, రొయ్యల పెంపకందారులకు మేలు జరుగుతుందని అన్నారు.

 ఉపాధి అవకాశాలు: మొక్కజొన్నతో అటుకులు, ఇథనాల్, దాణా, పిండి వంటి 14 రకాల ఉప ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్ రూ.60 కోట్లతో నిజామాబాద్ పార్కులో రానుంది. డెయిరీ యూనిట్‌కు రూ.30 కోట్లు, పసుపు ప్రాసెసింగ్ యూనిట్‌కు రూ.15 కోట్లు వ్యయం చేస్తున్నారు. అయిదేళ్లలో 15 పరిశ్రమలు, రూ.500 కోట్ల పెట్టుబడులు రావొచ్చని స్మార్ట్ అగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ డెరైక్టర్ పటలోల్ల మోహన్ తెలిపారు. పార్కు పూర్తయితే 3,000 మందికి ఉపాధి లభిస్తుందన్నారు.370 ఎకరాలకుగాను 120 ఎకరాల్లో పార్కు రానుందని, మిగిలిన స్థలంలో వ్యవసాయోత్పత్తుల యూనిట్లు వస్తాయన్నారు. తెలంగాణకు చెందిన ఎన్నారైలు పైల మల్లారెడ్డి, రమేశ్ కంభం, పటలోల్ల మోహన్ ప్రధాన ప్రమోటర్లు. మౌలిక వసతులకయ్యే రూ.120 కోట్ల వ్యయంలో ప్రమోటర్లు రూ.70 కోట్లు, కేంద్రం రూ.50 కోట్లు సమకూరుస్తోంది. 2015 చివరకు నిర్మాణం పూర్తవుతుంది.

 రెడీ టు ఈట్: భీమవరం సమీపంలో ఏర్పాటవుతున్న మెగా ఫుడ్ పార్కులో రొయ్యలు, చేపల ప్రాసెంగ్ చేపడతారు. రెడీ టు ఈట్ ఉత్పత్తులు కూడా తయారు చేస్తారు. అమెరికా, యూరప్, మధ్యప్రాచ్య దేశాలకు వీటిని ఎగుమతి చేస్తారు. ఆనంద గ్రూపు నేతృత్వంలో మొత్తం అయిదు కంపెనీలు పార్కును ప్రమోట్ చేస్తున్నాయి. 55 ఎకరాల్లో ఏర్పాటవుతున్న ఈ పార్కుకు మౌలిక వసతులకు రూ.125 కోట్లు వ్యయం చేస్తున్నారు. కేంద్రం రూ.50 కోట్లు సమకూర్చింది. 30 కంపెనీలు ఇక్కడ యూనిట్లు పెట్టే అవకాశం ఉంది. రూ.800 కోట్ల పెట్టుబడులు రావొచ్చని అంచనా వేస్తున్నట్టు ఆనంద గ్రూపు వైస్ ప్రెసిడెంట్ యు.జోగి ఆనంద్ వర్మ తెలిపారు. పార్కు ద్వారా 2,000 మందికిపైగా ఉపాధి లభిస్తుందని చెప్పారు.

 సింగిల్ విండో మేలు: ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు 15-20 అనుమతులు తీసుకోవాల్సి వస్తోంది. 150 మందికిపైగా అధికారులు ప్రతిపాదన పత్రాలను పరిశీలిస్తున్నారు. ఇదంతా సమయం వృథా. సింగిల్ విండో క్లియరెన్సుల విధానమే పరిశ్రమ వృద్ధికి దోహదం చేస్తుందని కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ కార్యదర్శి సిరాజ్ హుస్సేన్ స్పష్టం చేశారు. ప్రైవేటు పెట్టుబడులను పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ ఆకర్షిస్తోంది. అయితే చాలా యూనిట్లు ఆంధ్ర ప్రాంతానికి వెళ్తాయని, తెలంగాణలో మరింత కృషి జరగాలన్నారు. అనుమతుల ప్రక్రియే పెద్ద అడ్డంకి అని హైదరాబాద్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎండీ రవీంద్ర మోడీ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యత రంగంగా గుర్తించినప్పుడే ఫుడ్ ప్రాసెసింగ్ కొత్త పుంతలు తొక్కుతుందని  అసోచాం దక్షిణ ప్రాంత చైర్మన్  సన్నారెడ్డి తెలిపారు.

>
మరిన్ని వార్తలు