నందన్‌ రాకతో రూ.9400 కోట్లు వచ్చాయ్‌...

28 Aug, 2017 18:47 IST|Sakshi
నందన్‌ రాకతో రూ.9400 కోట్లు వచ్చాయ్‌...
సాక్షి, ముంబై : నందన్‌ నిలేకని ఇన్ఫోసిస్‌లోకి పునరాగమనం ఈ కంపెనీ ఇన్వెస్టర్లకు మంచి జోష్‌ అందించింది. సోమవారం స్టాక్‌మార్కెట్‌లో ఇన్ఫీ షేర్లు 5 శాతం మేర పైకి జంప్‌ చేయడంతో, ఇన్వెస్టర్ల సంపద కూడా రూ.9000 కోట్లకు పైననే ఎగిసింది. బోర్డు వార్‌ నేపథ్యంలో కంపెనీ సీఈవోగా పదవికి విశాల్‌ సిక్కా రాజీనామా చేయడంతో ఇన్వెస్టర్లలో తీవ్ర ఆందోళన చెలరేగింది. ఈ ఆందోళనకర పరిస్థితులను చక్కదిద్దడానికి, కంపెనీ స్థిరత్వానికి ఇన్ఫీ సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో నందన్‌ నిలేకని, మళ్లీ ఇన్ఫీలోకి అడుగుపెట్టారు. నాలుగు రోజుల క్రితం నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా ఆయన పదవి స్వీకరించారు. లాంగ్‌ వీకెండ్‌ తర్వాత ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్‌లో నిలేకని పునరాగమనం ఇన్ఫీపై సెంటిమెంట్‌ బలపర్చింది. 
 
నందన్‌ పునరాగమనం క్లయింట్స్‌లో, షేర్‌హోల్డర్స్‌లో భరోసా ఏర్పడిందని విశ్లేషకులు చెప్పారు. నందన్‌ నిలేకని మళ్లీ ఇన్ఫోసిస్‌లోకి రావడం, ఆరేళ్ల కాలంలో మంచి ప్రారంభాన్ని ఇన్ఫీకి అందించనట్టై, నాయకత్వంలో మళ్లీ  స్థిరత్వం సంపాదిస్తారని సీఎల్‌ఎస్‌ఏ చెప్పింది.  ఈ నియామకం వ్యవస్థాపకులతో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి, క్లయింట్స్‌కు సహకరిస్తుందని జెఫ్ఫెరీస్‌ బ్రోకరేజ్‌ పేర్కొంది. సిక్కా రాజీనామాతో ఒక్కసారిగా ఇన్ఫీ షేరు భారీగా కుదేలైన సంగతి తెలిసిందే. దాదాపు 15 శాతం మేర క్షీణించింది. దీంతో ఇన్వెస్టర్ల సంపద రూ.30వేల కోట్ల మేర ఆవిరైపోయింది. తర్వాత ఇన్ఫీ షేర్లు మెల్లమెల్లగా కోలుకోవడం ప్రారంభించాయి. నందన్‌ నిలేకని రాకతో, మరింత బలపడ్డాయి.
మరిన్ని వార్తలు