నో ఫ్రిల్స్‌ ఖాతాలకు పరిష్కారం తప్పనిసరి - నందన్‌ నీలేకని

13 Sep, 2023 07:58 IST|Sakshi

చార్జీల కారణంగా ప్రజలు వాడడం లేదు

ఇన్ఫోసిస్‌ చైర్మన్‌ నందన్‌ నీలేకని

ముంబై: ప్రజలు నో ఫ్రిల్స్‌ బ్యాంక్‌ ఖాతాలను వినియోగించుకోవడం లేదని, దీనికి బ్యాంక్‌లు విధిస్తున్న చార్జీలే కారణమని ఇన్ఫోసిస్‌ చైర్మన్‌ నందన్‌ నీలేకని అన్నారు. ఈ సమస్య పరిష్కరించతగినదేనన్నారు. దీనికి పరిష్కారం తప్పనిసరి అంటూ, ఇతర దేశాలు సైతం దీన్ని అనుకరించే అవకాశం ఉన్నట్టు చెప్పారు. 

ముంబైలో గ్లోబల్‌ ఎస్‌ఎంఈ ఫైనాన్స్‌ ఫోరమ్‌ కార్యక్రమంలో భాగంగా నీలేకని ఈ అంశాన్ని ప్రస్తావించారు. బ్యాంక్‌లు చేసిన విస్తృత ప్రచారంతో ప్రజలు పెద్ద సంఖ్యలో ఖాతాలు తెరిచారని, ప్రభుత్వాల ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీకి వీటిని ఉపయోగించుకుంటున్నట్టు చెప్పారు. ‘‘ఖాతాల్లో బ్యాలన్స్‌ ఉన్నా కానీ, లావాదేవీలు లేవు. దీనికి బ్యాంకులు విధిస్తున్న చార్జీలే కారణం. 

ఎలాంటి బ్యాలన్స్‌ లేని (నో ఫ్రిల్స్‌) బేసిక్‌ ఖాతాలను ఆర్థికంగా లాభసాటిగా చూడరాదు. ఆయా ఖాతాలపై ఎన్నో చార్జీలు అమలు చేస్తున్నారు. దీంతో ప్రజలు ఆ ఖాతాలను ఉపయోగించడం నిలిపివేస్తున్నారు’’ నీలేకని పేర్కొన్నారు. ఇది నిర్వహణపరమైన సమస్యేనంటూ, దీనికి పరిష్కారం ఉందన్నారు. 

భారత్‌ అమలు చేస్తున్న డిజిటల్‌ ప్రజా సదుపాయాలను కనీసం 50 దేశాలు అమలు చేసే విధంగా భారత్‌ లక్ష్యం విధించుకోవాలన్నారు. భారత్‌ సాధించిన అనుభవం, విజ్ఞానాన్ని ప్రపంచం సద్వినియోగం చేసుకోవాలన్నారు. భారత్‌–యూఏఈ లేదా భారత్‌–సౌదీ అరేబియా వంటి భారీ కారీడార్ల వైపు చూడాలని, వీటి మధ్య నిధుల ప్రవాహంతో మెరుగైన విజయానికి వీలుంటుందన్నారు.

మరిన్ని వార్తలు