అమెరికాలో మరో 10 జనరిక్ ఔషధాలు

17 Sep, 2016 01:53 IST|Sakshi
అమెరికాలో మరో 10 జనరిక్ ఔషధాలు

వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాల్లో నాట్కో లక్ష్యం

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ రంగ దిగ్గజం నాట్కో ఫార్మా అమెరికా మార్కెట్లో స్థానం మరింత పటిష్టం చేసుకోవడంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాల్లో కొత్తగా మరో 10 జనరిక్స్ ఔషధాల తయారీ అనుమతుల కోసం ఏఎన్‌డీఏలు దరఖాస్తు చేయనున్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది మార్చి నాటికి కంపెనీ కీలకమైన ఔషధాలకు సంబంధించి అమెరికా ఔషధ రంగ నియంత్రణ సంస్థ ఎఫ్‌డీఏకి 38 ఏఎన్‌డీఏలు దాఖలు చేసింది.

సూత్రప్రాయ అనుమతులు లభించిన మూడింటితో పాటు మొత్తం 16 ఏఎన్‌డీఏలకు అనుమతులు లభించినట్లు నాట్కో ఫార్మా ఇన్వెస్టర్లకు తెలిపింది. ఎఫ్‌డీఏ సమీక్షిస్తున్న 21 ఔషధాల మార్కెట్ విలువ దాదాపు 15.4 బిలియన్ డాలర్ల మేర ఉండనున్నట్లు పేర్కొంది. అమెరికా మార్కెట్‌కు సంబంధించి అల్వోజెన్, మైలాన్ తదితర సంస్థలతో భాగస్వామ్యాలు కుదుర్చుకోవడం ద్వారా వ్యూహాత్మక ప్రణాళికలను అమలు చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.

పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలపై నాట్కో ఆదాయాల్లో ఆరు శాతం పైగా వెచ్చిస్తోంది.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కంపెనీ రూ. 309 కోట్ల ఆదాయంపై రూ. 51 కోట్ల ఆదాయం ఆర్జించింది. శుక్రవారం బీఎస్‌ఈలో కంపెనీ షేరు సుమారు 3 శాతం లాభంతో రూ. 659.55 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు