నవంబర్‌ తొలివారంలో ‘న్యూఇండియా’ ఐపీఓ

23 Oct, 2017 18:35 IST|Sakshi

రూ. 10,000 కోట్ల సమీకరణ!

ముంబై: ఇండియాలో అతిపెద్ద సాధారణ బీమా కంపెనీ అయిన న్యూఇండియా అష్యూరెన్స్‌ (ఎన్‌ఐఏ) రూ. 10,000 కోట్లు సమీకరించేందుకు నవంబర్‌ మొదటి వారంలో తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ) జారీచేయనుంది. ఇటీవలే మరో సాధారణ బీమా కంపెనీ జీఐసీ రూ. 11,370 కోట్ల ఐపీఓ  1.35 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రయిబ్‌ అయిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా గత ఒకటిన్నర నెలల్లో ఇతర బీమా కంపెనీలు ఐసీఐసీఐ లాంబార్డ్, ఎస్‌బీఐ లైఫ్‌లు కూడా ఐపీఓలు జారీచేసిన సంగతి విదితమే.

ఈ నేపథ్యం లో ప్రభుత్వ రంగ ఎన్‌ఐఏ భారీ పబ్లిక్‌ ఇష్యూరానుండటం విశేషం. ఇండియాతో పాటు 28 దేశా ల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న న్యూ ఇండి యా అష్యూరెన్స్‌ ఐపీఓ నవంబర్‌ మొదటివారంలోనే పూర్తవుతుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఖచ్చితంగా ఎంత మొత్తానికి ఐపీఓ జారీచేయబోయేదీ, ఇష్యూ దర ఎంతనేది ఈ వారం లో ప్రకటించనున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి.  

వందేళ్లు..: త్వరలో శత వార్షికోత్సవం జరుపుకోనున్న న్యూఇండియా అష్యూరెన్స్‌కు ప్రస్తుతం సాధారణ బీమా మార్కెట్లో 16 శాతం వాటా వుంది. 31 పోటీ కంపెనీలున్నప్పటికీ, గత ఐదేళ్లుగా మార్కెట్‌ వాటాను పెంచుకుంటూ వస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 26,000 కోట్ల ప్రీమియం ఆదాయాన్ని అంచనావేస్తున్న ఈ కంపెనీకి రూ. 69,000 కోట్లకుపైగా ఆస్తులున్నాయి. 2017 జూన్‌ క్వార్టర్‌ ముగింపునాటికి ఈ కంపెనీ పెట్టుబడుల మార్కెట్‌ విలువ రూ. 63,100 కోట్లు వుంది. అత్యధిక టాప్‌ కార్పొరేట్లు ఈ కంపెనీకి దీర్ఘకాలిక కస్టమర్లుగా ఉన్నాయి.

మరిన్ని వార్తలు