సూక్ష్మ రుణాల్లో ఎన్‌బీఎఫ్‌సీ–ఎంఎఫ్‌ఐల ప్రధాన పాత్ర

18 Nov, 2023 01:06 IST|Sakshi

ఎంఎఫ్‌ఐఎన్‌ నివేదిక వెల్లడి

కోల్‌కతా: దేశంలో సూక్ష్మ రుణాల పంపిణీలో ఎన్‌బీఎఫ్‌సీ–ఎంఎఫ్‌ఐలు గణనీయమైన పాత్ర పోషిస్తున్నట్టు సూక్ష్మ రుణ సంస్థల నెట్‌వర్క్‌ (ఎంఫిన్‌) ప్రకటించింది. 2022–23 సంవత్సరానికి సూక్ష్మ రుణ పరిశ్రమకు (ఎంఎఫ్‌ఐలు) సంబంధించి నివేదికను రూపొందించి విడుదల చేసింది. 2023 మార్చి 31 నాటికి రూ.1,38,310 కోట్ల రుణాలను ఎన్‌బీఎఫ్‌సీ–ఎంఎఫ్‌ఐలు అందించాయి.

మొత్తం సూక్ష్మ రుణాల్లో ఇది 39.7 శాతానికి సమానం. సూక్ష్మ రుణాల్లో బ్యాంక్‌ల వాటా 34.2 శాతంగా ఉంది. ఇవి రూ.1,19,133 కోట్ల రుణాలను సమకూర్చాయి. స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌లు అందించిన సూక్ష్మ రుణాలు రూ.57,828 కోట్లుగా (16.6 శాతం వాటా) ఉన్నాయి. ఈ ఏడాది మార్చి నాటికి ఎంఎఫ్‌ఐల మొత్తం పోర్ట్‌ఫోలియో (రుణాలు) రూ.3,48,339 కోట్లుగా ఉంది.

ఎంఎఫ్‌ఐ రంగానికి అపార వృద్ధి అవకాశాలు ఉన్నాయని, 2024 మార్చి నాటికి సూక్ష్మ రుణ పరిశ్రమ పరిమాణం రూ.13 లక్షల కోట్లుగా ఉంటుందని పేర్కొంది. నూతన నియంత్రణలు సూక్ష్మ రుణ సంస్థల కార్యకలాపాలను బలోపేతం చేస్తాయని అభిప్రాయపడింది. కరోనా తర్వాత నిధుల వితరణ, పోర్ట్‌ఫోలియో నాణ్యత, క్లయింట్ల చేరికలో ఎంఎఫ్‌ఐ పరిశ్రమ బలంగా పుంజుకున్నట్టు తెలిపింది.  

మరిన్ని వార్తలు