ప్రోత్సాహకాలు ఆగితే మూసివేతే...!

1 Oct, 2015 23:59 IST|Sakshi
ప్రోత్సాహకాలు ఆగితే మూసివేతే...!

వంట నూనెల పరిశ్రమలో వింత పరిస్థితి
 వ్యాట్ మినహాయింపు కోసమే కొత్త ప్లాంట్లు
 పాతవాటికే మేకప్ వేసి
 కొత్తవిగా చూపిస్తున్న తీరు...
 కొత్త వ్యూహాలు, ప్రణాళికలతో
 నిలదొక్కుకుంటున్న బడా ప్లాంట్లు
 పోటీ పడలేక చిన్న ప్లాంట్లు మూత

 
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నూతన పారిశ్రామిక విధానం ద్వారా పరిశ్రమలకు ప్రోత్సాహకాలివ్వటం రాష్ట్రాలకు కొత్తేమీ కాదు. తద్వారా కొత్త పరిశ్రమలు వస్తాయి. కాకపోతే వంట నూనెల పరిశ్రమలో మాత్రం చిత్రమైన పరిస్థితి నెలకొంది. కొత్త పారిశ్రామిక విధానం వస్తే చాలు. పాత ప్లాంట్లు మూతపడుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి!!. ఎందుకంటే వ్యాట్ మినహాయింపు ఉన్నంత కాలం మాత్రమే కంపెనీలు మనగలుగుతున్నాయి. ఎపుడైతే ఈ ప్రయోజనం ఆగిపోతోందో అప్పటి నుంచి కంపెనీలకు కష్టాలు మొదలవుతున్నాయి. ప్రణాళిక ప్రకారం వ్యాపారాన్ని నిర్వహించే ఒకటిరెండు పెద్ద సంస్థలు మినహా మిగిలిన చిన్న కంపెనీలు ప్లాంట్లను మూసివేయక తప్పడంలేదు. ఎందుకంటే అటు పెద్ద ప్లాంట్లతో గానీ, ఇటు కొత్తగా ప్లాంటు పెట్టి వ్యాట్ ప్రయోజనాలు పొంది తక్కువ ధరకు నూనెలను విక్రయిస్తున్న కంపెనీలతో గానీ అవి పోటీ పడలేకపోతున్నాయి.
 
 ప్రోత్సాహమే అడ్డంకి...
 వంట నూనెలపై తెలుగు రాష్ట్రాల్లో 5 శాతం వ్యాట్ ఉంది. రూ.11 నుంచి 250 కోట్ల మధ్య పెట్టుబడి పెట్టే మధ్య తరహా కంపెనీకి.. చెల్లించిన వ్యాట్‌లో ప్రభుత్వం 75 శాతాన్ని రీయింబర్స్ చేస్తోంది. విద్యుత్ చార్జీల్లోనూ రాయితీలున్నాయి. ప్లాంటులో ఉత్పత్తి మొదలైన నాటి నుంచి ఐదేళ్లపాటు వ్యాట్ ప్రయోజనం ఉంటుంది. నికర  లాభం 1-2 శాతానికే పరిమితమైన వంట నూనెల రంగంలో ఈ ప్రోత్సాహం ఏ కంపెనీకైనా పెద్ద ప్రయోజనం కిందే లెక్క. దీంతో ఈ కంపెనీలు మార్కెట్లో  పోటీ పడటానికి ఇతర కంపెనీల కంటే తక్కువ ధరకే ఉత్పత్తులను విక్రయిస్తున్నాయి. అయితే అయిదేళ్లు పూర్తి చేసుకున్న కంపెనీలు మాత్రం ధర తగ్గించి విక్రయించలేకపోతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఖాయిలాపడ్డ కంపెనీల్లో ఎన్‌సీఎస్ ఇండ స్ట్రీస్, కేడియా అగ్రోటెక్, క్లీన్ సిటీ బయో ఫ్యూయెల్స్, బయో మ్యాక్స్, నేచురల్ బయో ప్యూయెల్స్, గుడ్‌హెల్త్ అగ్రోటెక్, నిఖిల్ రిఫైనరీస్‌తోపాటు మరో 10 కంపెనీలున్నాయి.
 
 తిరిగి కొత్త ప్లాంట్లతో..
 కొత్త ప్రభుత్వం రాగానే నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటించడం సహజం. కొన్ని కంపెనీలకు ఈ అంశమే కలిసి వస్తోంది. పోటీలో నిలదొక్కుకోలేక ప్లాంట్లను మూసివేసిన ఈ కంపెనీలు... కొత్త ఎత్తుగడతో తిరిగి రంగప్రవేశం చేస్తున్నాయి. కొత్త ప్లాంటు పెడితే ప్రోత్సాహకాలు పొందవచ్చన్నది వీటి ఆలోచన. అనుకున్నదే తడవుగా పాత ప్లాంట్లను తుక్కు కింద విక్రయించినట్లు కాగితాల్లో చూపిస్తున్నాయి. అదే యాజమాన్యం కొత్త పేరుతో పాత ప్లాంటుకు సమీపంలోనే మరో ప్లాంటును నెలకొల్పుతోంది. ఈ ప్లాంటుకు కావాల్సిన సామగ్రిని పాత ప్లాంటు నుంచి తీసుకొస్తున్నాయి. బ్యాంకుల నుంచి యథావిధిగా రుణాలను తీసుకుంటున్నాయి. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్‌లోని రిఫైనరీల వార్షిక సామర్థ్యం 43 లక్షల టన్నులు. ఇవి ఏపీ, తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాలకు నూనెలను సరఫరా చేస్తున్నప్పటికీ వినియోగం కంటే సామర్థ్యం రెండింతలుగా ఉంది.
 
 ప్రభుత్వానికి ఆదాయం మిస్..
 కొన్ని కంపెనీల తీరుతో ప్రభుత్వానికి ఆదాయం రాకుండా పోతోంది. ప్రభుత్వ ప్రోత్సాహకాల కోసం ఇలా చేస్తుండటం వల్ల ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదని జెమిని ఎడిబుల్స్, ఫ్యాట్స్ ఇండియా (జెఫ్) ఎండీ ప్రదీప్ చౌదరి ‘సాక్షి బిజినెస్ బ్యూరో’తో చెప్పారు. ‘‘అటు బ్యాంకుల వద్ద బకాయిలు పెరిగిపోతున్నాయి.  మూతపడ్డ కంపెనీలు నిరర్ధక ఆస్తులుగా మిగిలిపోతున్నాయి. ఈ ఆస్తుల విలువ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రూ.3,000-4,000 కోట్లు ఉంటుంది’’ అని ఆయన తెలియజేశారు. డిమాండ్‌ను మించి ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ఈ రంగంలో ఎటువంటి ప్రోత్సాహకాలు ఇవ్వాల్సిన అవసరం లేదని జెఫ్ సేల్స్, మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ పి.చంద్రశేఖరరెడ్డి తెలిపారు. ‘2009-14 కాలంలో కొత్తగా ఏడు ప్లాంట్లు వచ్చాయి. కంపెనీని బట్టి ప్రభుత్వం నుంచి పొందే ప్రయోజనాలు 2017తో ముగుస్తాయి. ఇటీవలే రెండు రాష్ట్రాల్లోనూ నూతన పారిశ్రామిక విధానం ప్రకటించారు. సమస్య పునరావృతం కాకుండా వంట నూనెల కంపెనీలకు ఇచ్చే ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలి’ అని అన్నారాయన. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఎంలను కలిసి సమస్యను తెలియజేసేందుకు కృష్ణపట్నం ఎడిబుల్ ఆయిల్స్ రిఫైనర్స్ అసోసియేషన్ సన్నద్ధమవుతోంది కూడా.
 

మరిన్ని వార్తలు