పాన్ నిబంధనలు మార్చండి..

23 Dec, 2015 03:27 IST|Sakshi
పాన్ నిబంధనలు మార్చండి..

రూ.2 లక్షల పరిమితిని రూ.10 లక్షలకు పెంచండి
బంగారం దిగుమతి సుంకాన్ని 2 శాతం చేయాలి
జ్యుయలరీ ట్రేడ్ ఫెడరేషన్ అభ్యర్థన
 
 న్యూఢిల్లీ:
ఆభరణాల కంపెనీల సమాఖ్య ఆల్ ఇండియా జెమ్స్, జ్యుయలరీ ట్రేడ్ ఫెడరేషన్(జీజేఎఫ్)... కొత్తగా తెస్తున్న పాన్ నిబంధనలను తప్పుపట్టింది. రూ.2 లక్షలపై కొనుగోళ్లకు పాన్ తప్పనిసరి అనే నిబంధనలు జ్యుయలరీ రంగానికి ప్రతికూలమని వ్యాఖ్యానించింది. దీనివల్ల తమ వ్యాపారం దెబ్బతింటుందని, రూ.2 లక్షల పరిమితిని రూ.10 లక్షలకు పెంచాలని కేంద్రాన్ని కోరింది.
 
  ‘‘పాన్ తప్పనిసరి చేయడం వల్ల జ్యుయలరీ విక్రయాలు తగ్గొచ్చు. ప్రత్యేకంగా గ్రామాల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది’’ అని తెలియజేసింది. మెట్రో పట్టణాల్లో కూడా బంగారు ఆభరణాల విక్రయాలు 50% మేర తగ్గే అవకాశముందని పేర్కొంది. బంగారం దిగుమతి సుంకాన్ని ప్రస్తుతం ఉన్న 10% నుంచి 2%కి తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరింది. ఇది ఒకేసారి సాధ్యపడకపోతే దశలవారీగా తగ్గించాలని సూచించింది.
 
 జనవరి 1 నుంచి రూ.2 లక్షలపై కొనుగోళ్లకు పాన్ తప్పనిసరి చేస్తే.. జ్యుయలరీ పరిశ్రమ నాశనమయ్యే ప్రమాదముందని జీజేఎఫ్ చైర్మన్ జి.వి.శ్రీధర్ చెప్పారు. పాన్ తప్పనిసరి వల్ల బంగారం కొనుగోళ్లు వ్యవస్థీకృత మార్కెట్ నుంచి అవ్యవస్థీకృత మార్కెట్‌వైపునకు మళ్లే అవకాశం ఉందని, తద్వారా ప్రస్తుతం 20-25 శాతంగా ఉన్న వ్యవస్థీకృత మార్కెట్ వాటా తగ్గే ప్రమాదముందని చెప్పారు. తాజా నిబంధనలను గ్రామాల్లో అమలుచేయడం కష్టమన్నారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంత జ్యుయలరీ మార్కెట్ వాటా 70 శాతంగా ఉందన్నారు.
 
  దేశంలో ఇప్పటికీ పాన్ కార్డుల మంజూరు సంఖ్య స్వల్పంగానే ఉందని చెప్పారు. కొత్త నిబంధనలు జ్యుయలరీ పరిశ్రమను నిర్వీర్యం చేసేలా ఉన్నాయని జెమ్స్ అండ్ జ్యుయలరీ ఫెడరేషన్ మాజీ చైర్మన్ అశోక్ మీనావాలా చెప్పారు. ఈ పరిశ్రమపై ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 6 కోట్ల మంది ఆధారపడ్డారని తెలిపారు. రూ.10 లక్షలు దాటిన కొనుగోళ్లకే పాన్ తప్పనిసరి చేయాలన్నారు. నల్లధనాన్ని అరికట్టడానికి కేంద్రం తీసుకున్న ఈ చర్యను తాము తప్పుపట్టడం లేదన్నారు. ‘‘ఇది ఆచరణాత్మకమైనదికాదు. దీనివల్ల పాన్ కార్డులు లేని, పన్ను పరిధిలోకి రాని కొనుగోలుదారులున్న 70% గ్రామాల్లో జ్యుయలరీ మార్కెట్‌ను వివక్షకు గురిచేసినట్లవుతుంది’’ అన్నారాయన.
 
 1000 టన్నులకు పసిడి దిగుమతులు!
 న్యూఢిల్లీ: పసిడి దిగుమతులు 2015లో వెయ్యి టన్నులకు చేరుతాయని అఖిల భారత రత్నాలు, ఆభరణాల వాణిజ్య సమాఖ్య (ఏఐజీజేటీఎఫ్) అంచనావేసింది. ఇదే జరిగితే గతేడాది దిగుమతులకన్నా (900 టన్నులు) ఇది 11% అధికం. అంతర్జాతీయంగా పసిడి ధరలు తగ్గుతుండడం దీనికి కారణమని సమాఖ్య  చైర్మన్ జీవీ శ్రీధర్ చెప్పారు. ఈ ఏడాది స్మగ్లింగ్ ద్వారా దాదాపు 100 టన్నుల పసిడి దిగుమతి జరుగుతుందని అంచనా వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య దేశం 850 టన్నుల పసిడి దిగుమతులు చేసుకుంది. గతేడాది ఇదే కాలంలో దిగుమతులు 650 టన్నులు. ధరల తగ్గుదల కారణంగా కొనుగోళ్లు భారీగా ఉండడంతో పసిడికి 2015 కలిసొస్తోందని చెప్పారు.
 

>
మరిన్ని వార్తలు